ఉద్యోగులందరికన్నా ముఖ్యంగా ఉపాధ్యాయుడు సత్యంగా ప్రవర్తించాలి. లేకపోతే సంఘం చెడిపోతుంది. ప్రపంచానుభవంలేని పిల్లలు అతని చేతులలో వేలాది మంది ఉంటారు. వారి లేత మనస్సులపై అతని ఉపదేశ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన ఉపాధ్యాయునికి దురలవాట్లు ఉండరాదు; ఎందుకనగా పిల్లలు పెద్దవాళ్ళను చూచి అలవాట్లను అవలంబించే ప్రమాదము ఉన్నది. ఒక్కొక్క ఉపాధ్యాయుని దగ్గర తయారయ్యే విద్యార్థులు కొన్ని వేలమంది ఉంటారు. వారందరికీ ఆ చెడ్డ అలవాట్లు అలవడితే సంఘం చెడిపోతుంది. క్రమంగా సంఘంలోని దురలవాట్లు ఇంకో విధంగా ఉపాధ్యాయుణ్ణే బాధిస్తాయి. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష. తన విద్యార్థులచేతనే ఉపాధ్యాయుడు ఒకానొకనాడు వెక్కిరింపబడతాడు.
(వి.వా. పు.30/31)
ఒక విద్యార్థి చెడిపోతే, ఒక్క విద్యార్థే అనుభవిస్తాడు. ఒక ఉపాధ్యాయుడు చెడిపోతే చాలమంది విద్యార్థులు చెడిపోతారు.
(సా. పు 636)
ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైన వృత్తి. ఆత్మజ్ఞానమును సంపాదించడానికి కూడా ఇది పరమ పవిత్రమైన సాధనముగా ఉపయోగపడుతుంది. నిస్వార్థ ప్రేమను అలవరచుకోవడం, దానిని ఇతరులపై ప్రసరింపజేయడం. వారితో కలసి పంచుకోవడం ఈ సాధనలో అంశములు, ఉపాధ్యాయుడు భావిపౌరులను ఆత్మవిశ్వాసము, ఆత్మప్రకాశము, ఆత్మచైతన్యముగల వ్యక్తులుగా తీర్చి దిద్దాలి. ఉపాధ్యాయుడు ఆనందమయమైన గృహములను, సిరిసంపదలలో తులతూగే సమాజములను, శాంతియుతమైన పౌరులను తిర్చిదిద్దే శిల్పకారుడు. పెద్దవాళ్ళు. ఉపాధ్యాయుల అలవాట్లను, నడవడికను, ప్రవర్తనను, వారి నమ్మకములను పిల్లలు పుణికి పుచ్చుకుంటారు. అందువలన ఉపాధ్యాయులు ఎల్లప్పుడు ఆదర్శవంతమైన జీవితమును గడపాలి. వినయము, నిరాడంబరత, నైతిక విలువలు, నిజాయితి - వీటిలో అతడు ఇతరులకు ఆదర్శమూర్తిగా ఉండాలి. తద్వారా అతడు బోధించే విద్య అత్యుత్తమ మైనదిగా ఉంటుంది. అటువంటి ఉపాధ్యాయుల శిక్షణలో పెరిగిన పిల్లలు వారి వారి యిళ్ళలోను, సమాజములోను కూడా ప్రేమజ్యోతులై ధైర్యసాహసాలు, సుఖ సంతోషాలను వెదవాల్లే ఆశాజ్యోతులుగా నిలుస్తారు. అటువంటి జ్ఞాన జ్యోతులు ఎల్లప్పుడు వెలుగుతూండుగాక! వాటి దివ్యకాంతి ఎల్లప్పుడు ప్రకాశవంతమై నిలుచుగాక! ఉత్తములైన ఉపాధ్యాయులు, ఉత్తములైన విద్యార్థులు కలసి ఉత్తమమైన జాతిని నిర్మించగలుగుతారు."
(ద్తె.ది. పు. 377/378)
(చూ॥ ఆదర్శ మార్గము, విద్యార్థులు)