శస్త్ర వైద్యుడు కత్తి నుపయోగించును. అట్లే ఒక దుష్టుడు కూడా కత్తి నుపయోగించును. శస్త్ర వైద్యుడు కత్తితో పెట్టు గాటు వ్యక్తికి మంచిని చేకూర్చును. కాని దుష్టుడు తన కత్తిని దుష్కార్యముల నిమిత్తమై ఉపయోగించును. ఒక కసాయివాడు మాంసమును నరుకుటకై కత్తి నుపయోగించును. ఒక గృహిణి పండును కోయుటకు కత్తి నుపయోగించును. ఈ కత్తుల నన్నిటిని ఒక వలయాకారములో ఉంచి మధ్యలో అయస్కాంతము నుంచిన, అన్ని కత్తులూ సమానముగా అయస్కాంతముచే ఆకర్షింపబడును. మంచి, చెడు ఆ కత్తులలో లేవు. భగవంతుడు అయస్కాంతము వంటివాడు. అందరూ భగవంతునిచే ఆకర్షింపబడుదురు. మంచి, చెడు మానవులలో లేవు. అవి మనసును ఉపయోగించు విధానము పైన ఆధారపడి యున్నవి.
ప్రపంచము వేనిని దుష్కార్యములుగా పరిగణించునో, ఆ చర్యలను ప్రేరేపించు ఆలోచనలతో నీ మానసమును నింపవద్దు. ప్రతి వస్తువులోనూ దివ్యత్వమును చూడగలుగు విధముగ మనస్సుకు శిక్షణ ఇచ్చుటయే అన్ని సాధనల పరమోద్దేశ్యము. అదే యధార్థమైన "ఉపయుక్తమైన సాధన."
దీనిని నీవు చేయు ప్రతిపని యందున ప్రవేశ పెట్ట వచ్చును.
(ప. పు.286/287)