పొంగుట కృంగుట పనికిరాని వృత్తి. సుఖదు:ఖములు, కష్టనష్టములు, నిందాస్తుతులు భగవత్ ప్రసాదములేనని భావించవలెను. ముండ్లు వున్నచోట చెప్పులు వేసుకొని ముండ్ల బారి నుండి తప్పించుకొన్నట్లు, వర్షము కురియు సమయమున గొడుగును పట్టివానకు తడువకుండునట్లు, దోమలు వుండు స్థానమున దోమతెర కట్టుకొని వాటి బాధనుండి దూరమయినట్లు, వచ్చే నష్ట కష్టములకు, నిందాస్తుతులకూ యిష్టా అయిష్టములకూ ఈశ్వర అనుగ్రహమేనను సమాధాన చిత్తమును ధరించిన అవి మానవులను యేమియూ బాధించలేవు! అందులకే సమ చిత్తత్వము అవసరము.
(గీ. పు. 211)
జ్ఞానగుణము జనసంఘమున ప్రీతి లేకుండుట. అనగా, విషయాసక్తి కలవారితో పొత్తు చేరకుండుట. క్రూరమైన మృగముల మధ్యనుండియైననూ క్షేమమైన స్థితిని పొందవచ్చును కానీ, సామాన్యమైన పామరుల మధ్య సంచరించుచు సాధనను కొనసాగించ సాధ్యము కాదు. అట్టి సాధన, సంఘమును వట్టి సంబంధ మేర్పరచును. మంచి వారితో చేరిన మంచి సంబంధం, చెడ్డవారిలో చేరిన చెడ్డ అలవాట్లు సంభవించును.
మొదలే, మంచి చెడ్డ నిర్ణయించుట కష్టము కనుక సామాన్య మానవులకు దూరముగా వుండి సాధన సాగించుట యెంతో ఉత్తమము. మానవుని మనసు ఇనుమునకు పోల్చబడినది. మానవుడను ఇనుము, మట్టిలో చేరిన త్రుప్పుపట్టి, తుండ్లవుతుంది. అగ్నిలో చేరిన నిర్మల మవుతుంది. అందువలననే జ్ఞానుల సంఘము చేరిన, సత్ పురుషుల సంఘము చేరిన, యేకాంతమునకంటే నెక్కుడు ఫలమును పొందవీలుండును. దాసీ పుత్రుడయిన నారదుడు కూడనూ సత్ సంఘముచే దేవఋషి అయ్యాడు. కిరాతక వృత్తిలో సంచరించుచున్న రత్నకారుడు సప్తఋషుల సాంగత్యముచే ఆదికవి యైన వాల్మీకిగా మారినాడు. దుస్సంగత్వము అతి ప్రమాదము. అగ్నిని ముట్టిననూ అంత కాల్చదు కాని అగ్నిలో కాలిన ఇనుము దారుణము. అటులనే, పాపమునకంటే, పాపాత్ముని సంఘము మరింత పాపము కాగలదు. కాన సాధకుడు ఈ విషయమున అతి జాగ్రత్తగా మెలగవలసి యుండును.
(గీ. పు. 213)
(చూ॥ ఇరువది గుణములు)