ధనేషణ, దారేషణ, పుత్రేషణ - ఈ ఈషణ త్రయమే మానవుణ్ణి బంధితుని గావించి అనేక చిక్కులకు గురిచేస్తున్నాయి. ప్రాచీనకాలంలో ఎందరో రాజాలు ఎంతో ధనమును ప్రోగు చేసుకున్నారు. కాని, ఏమి సాధించారు? ధనము ఏనాటికీ మానవుణ్ణి ఉద్దరించలేదు. ధనముచేత మానవుడు శాశ్వతమైన ఆనందమును పొందలేదు. ఆధ్యాత్మిక ధనమే నిజమైనధనము. ధనమువలన తాను శాశ్వతమైన సుఖమును అనుభవించలేక పోయినప్పటికీ ధనంకోసం మానవుడు ఆరాట పడుతూనే ఉన్నాడు. ధనం అవసరమే. కాని, దానిని పరిమితంగా అనుభవించాలి. రెండవది దారేషణ. మానవుడు ధనమును సంపాదించి ఆలుబిడ్డలతో కలసి కొంతకాలం సుఖాన్ని అనుభవించవచ్చు. కాని, శాశ్వతసుఖాన్ని పొందగలనను కోవడం వెట్టితనం. అట్టి సుఖం అనిత్యమైనది, అసత్యమైనది. మూడవది పుత్రేషణ. మానవుడు తనకు పుత్రుడు కలగాలని ఆశిస్తాడు. ఆశించడంలో తప్పులేదు. అయితే, ధృతరాష్ట్రునకు అనేకమంది పుత్రులు కలిగారు. కాని, వారి వల్ల తానేమి సుఖం పొందాడు? పుత్రులు లేనందువల్ల శుకునకేమైనా దుర్గతి కల్గిందా? లేదు. కనుక పుత్రులున్నవారు మాత్రమే సుఖపడతారని, లేనివారు కష్టపడతారని అనుకోవడం వట్టి భ్రమ. దుర్మార్గులైన పుత్రులు ఎంతమంది ఉన్నప్పటికి ఏమి ప్రయోజనం? సత్పుత్రుడు ఒక్కడున్నా చాలు. దీనికి చక్కని ఉదాహరణ రామాయణం.
(స.సా..మే 2002 పు. 1)
(చూ: పల్లెసీమల సేవ)