
ముందుగా మాట్లాడిన ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి దక్షిణామూర్తి స్తోత్రంతో తన ప్రసంగాన్ని ప్రారంభించింది. దక్షిణామూర్తి ఎవరు? మన మేధాశక్తియే! కనుక మన మేదస్సును పవిత్రమైన మార్గంలో ప్రవేశ పెట్టాలి. ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి పూర్వం సినిమాలో మీరాగా నటించింది. ఒకానొక సమయంలో మహారాణా మీరాను మందిరం నుండి వెళ్లిపొమ్మన్నాడు.
కాని ఆమె ఎక్కడికి పోగలదు? "చలో రే మన్ గంగా యమునా తీర్....... ఓమనసా! నీవు గంగాయమునా తీరానికి వెళ్ళు" అని తన మనస్సుకు బోధించింది. ఏమిటి గంగాయమునా తీరము? ఇడ, పింగళ రెండూ చేరిన భ్రూమద్య స్థానమే! ఇదే ప్రయాగ. ఈ ప్రయాగకు వెళ్ళాలంటే టికెట్ బుక్ చేసుకోనక్కరలేదు. కాని ఈనాడు మనం ప్రయాగకు వెళ్ళడమంటే ప్రాకృతమైన రీతిగా టికెట్ తీసుకుని ప్రయాణిస్తున్నాము. ఈ బాహ్యమైన అభ్యాసములచేత నిత్యసత్యమైన హృదయస్థాయిని విస్మరిస్తున్నాము. బాహ్యమైన పూజలు, భజనలు, వ్రతములు ఇవన్నీ తాత్కాలికమైన మానసిక తృప్తిని మాత్రమే చేకూర్చగలవు. మనస్సున్నంత వరకు మహత్తరమైన దివ్యబోధలు మనకు అర్థం కావు. మనస్సును మాధవునివైపు మరల్చాలి. భగవంతుడు ఏ హృషీకేశ్ యందో, ఏ బదరీనాథ్ యందో ఏతిరుపతియందో ఉన్నాడని భావించడం తప్పు. ఇవన్నీ మనోకల్పితములే. భగవంతుడు హృదయవాసి. కాని మనం హృదయాన్ని మూసి పెట్టి మాటలను అధికం చేయడం వల్ల ఆశాంతికి గురియౌతున్నాము. నోరు ముయ్యాలి. హృదయం తెరవాలి. అప్పుడే ఆత్మజ్ఞానం అర్థమవుతుంది, ఆనందం ప్రాప్తిస్తుంది. (స.సా.డి. 96 పు. 330/331)
“నీవే తల్లివి, తండ్రివి...” స్వర్గీయ ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మి

“ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః" శ్రీ సాక్షాత్ పరమాత్మ, వైకుంఠాధిపతే! స్వామీ! మా తల్లివా నీవు? అవును. మా తండ్రివా నీవు? అవును. మా గురువువా నీవు? అవును. మా స్నేహితునివా నీవు? అవును. భగవత్ అవతారమూర్తివా నీవు? అవును. మా తల్లీ తండ్రీ గురువూ దైవం సర్వమూ నీవా? అవును, అవును, అవును.
ఎవరు ఏ భావనతో ఆరాధన చేస్తే ఆ భావనకు అనుగుణంగా వారిని పాలించి బ్రోచే స్వామివి నీవు. ఈ జన్మలోను, గత జన్మలలోను మేము చేసిన తపస్సు ఫలితంగా నీ దివ్యసన్నిధికి చేరుకొనే మహద్భాగ్యం మాకు లభించింది. ఎల్లవేళలా తోడునీడగా ఉండి ఈ దీనులపై కృప చూపు స్వామీ! .
( భారతరత్న శ్రీమతి ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మిగారు 1996 మహిళా దినోత్సవ సందర్భమున స్వామి సన్నిధిలో తమిళంలో చేసిన ప్రసంగం ఆధారంగా) ( సనాతన సారథి, ఫి 2020 పు24)