షడ్ దర్శనములు

భారతీయ వాజ్మయము కేవలము అంధవిశ్వాసమని వాదించినవారలకు సహేతుకమైన సమాధానమిచ్చి సంతృప్తి పరచిన దివ్యదర్శనములే "షడ్ దర్శనములు". వేదములకు ఒక విధమైన అర్థమును మాత్రమే కాక వివిధ విధములుగా అర్థములను బోధించి విశ్వాసానికిఅందించిన దివ్యసూత్రములే షడ్డర్శనములు. వేదజ్ఞానమును విపులముగా వివరించి జగత్తునకు విజ్ఞాన తత్వమును విజృంభింప చేసినవే యీ షద్దర్శనములు. "విశ్వాసము", అంతర్దర్శనము వేదము మూడు సూత్రములే యీ దర్శనకర్తలకు ప్రధానమైన సూత్రములుగా ఏర్పడినవి. భూతభవిష్యత్ వర్తమాన కాలములలో మారని సత్యాన్ని, విషయ తత్త్వాన్ని ప్రపంచమునకందించి మానవత్వంలో నున్న బలహీనతను, భయమును, సంశయమును, దుఃఖమును దూరము గావించినవి ఈ పడర్శనములే. విశ్వమునకు యోగ క్షేమములను బోధించి, అందించి మానవత్వములో మాలిన్యము లేకుండా నిర్మలత్వమునందించిన దివ్య సూత్రములే ఈ షడ్దర్శనములు. వేదము, వేదాంతము, వేదజ్ఞులు సర్వులూ ఒక్కటేనని ఏకత్వమును ప్రబోధించి దివ్యదర్యమును ప్రకటింపజేసినవి ఈ పద్ధర్శనములే. అన్ని విధములైన ప్రబోధలకు ప్రచారములకు పవిత్రతకు వివేక విజ్ఞానములకు మూల కారణము మనస్సే. ఈ మానసిక తత్త్వాన్ని అర్థము చేసుకొనే నిమిత్తమై ఏకత్వములోని అనేకత్వమును విభజించి అనేకత్వము నుండి ఏకత్వానికి మనసుని గొనిపోయే రాజమార్గమే ఈ పడ్డర్శనములుగా రూపొందింది. ఈ దర్శనములే న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస, ఉత్తర మీమాంసలు. వీటిలో మొదటిది న్యాయము. యీ మిగిలిన ఐదు దర్శనములకు యీ న్యాయమే ప్రాణము. మానవునియొక్క సానుభూతిని సామరస్యాన్ని ఏకత్వాన్ని గుర్తించిన మానవునియందు మాత్రమే ఈ న్యాయము స్వేచ్ఛ, ఆనందములుగా లభ్యమవుతుంది. న్యాయ తత్త్వమనేది కొన్ని ప్రమాణముల పైన ఆధారపడివుంది. విషయములను వివరించవలెనన్న, వస్తువులను ప్రకటించవలెనన్న కొన్ని ప్రమాణములు అత్యవసరములు. మానమనగా కొలత, ప్ర అనగా ముందు. దీనిని మనం విచారించవలెనన్న దీనికి ముందు ఒక విధమైన ప్రమాణం మనకు అవసరము. కొలత బద్దచేత - బట్టలు ఇత్యాది కొన్ని నియమితమైనవస్తువులను కొలత వేయవచ్చును. పదార్థమునకు ఒక కొలత, విషయమునకు ఒక కొలత, విజ్ఞానమునకు ఒక కొలత, సుజ్ఞానమునకు ఒక కొలత, ప్రజ్ఞానమునకు ఒక కొలత, అజ్ఞానమునకు కూడా ఒక కొలత. ఇట్లా అన్నింటికీ ప్రమాణములు అత్యవసరము. ప్రమాణము లేక వస్తువుగాని విషయముగాని వ్యక్తిగాని మంచి చెడ్డలుగాని మనము నిర్ణయించలేము. ఈ అన్ని ప్రమాణములు మనసు పైనే ఆధారపడియుంటున్నాయి. ఈ ప్రమాణములు నాల్గు విధములుగా వుంటున్నాయి. ఒకటి ప్రత్యక్ష ప్రమాణము రెండవది అనుమాన ప్రమాణము, మూడవది ఉపమాన ప్రమాణము, నాల్గవది. శబ్దప్రమాణము. ఈ నాలు ప్రమాణములచేత మానవునియందున్న సర్వ సంశయములను నివారణ గావించి మానవత్వపు విశిష్టతను గుర్తింపచేసి సత్యస్వరూపమును నిరూపణ గావించి మానవత్వపు విశిష్టతను గుర్తింపచేసి సత్యస్వరూపమును నిరూపణ గావించి మానవత్వమును సార్థకము గావిస్తూ వచ్చినదే ఈ న్యాయ దర్శనము.

 

మొదటి ప్రమాణము ప్రత్యక్షము. ప్రత్యక్షమనగా ఏమిటి? కేవలము యింద్రియ గోచరమయినది. ప్రత్యక్షమనిభావిస్తున్నాము. కంటితో చూచినది ప్రత్యక్షము. చెవులలో విన్నది ప్రత్యక్షము. చేతితో చేసినది ప్రత్యక్షము. కానీ ఈ యింద్రియములు కొన్ని విధములైన వ్యాధులలో కూడటంచేత ఈ ప్రత్యక్షము సరియైన ప్రమాణముకాదు. కన్ను - కన్ను చూచినది. యిది నలుపు, తెలుపు, ఎరుపు అని నిర్ణయిస్తూ వచ్చింది. ఈ ప్రమాణము సత్యమని ఏరీతిగా చెప్పవచ్చును? ఈ యింద్రియములో పల మనసు ఆవరించి తన ఇష్టాయిష్టముల వలన నిర్ణయించటానికి పూనుకుంటుంది. అంతేగాక యీ ఇంద్రియము కొన్ని రోగములతో పీడింపబడుతూ ఉంటుంది. యీ కన్నుఆరోగ్యముగా ఉన్నప్పుడు నలుపు నలుపుగా, తెలుపు తెలుపుగా ఎరుపు ఎరుపుగా పసుపు పసుపుగా కనిపిస్తుంది. మనలో జాండిస్ వ్యాధి బయలుదేరినప్పుడు కన్నుపసుపుపచ్చగా మారుతుంది. చూచినవన్నీ పచ్చగానే వుంటాయి. ఇది ఎట్లా ప్రత్యక్ష ప్రమాణమవుతుంది? రోగముతో కూడిన నేత్రముతో చూచినవన్ని ప్రత్యక్ష మవుతాయా? కావు. కనుక బాహ్యేంద్రియములన్నీ మనఃప్రభావముతో కూడినవే. ఇంక నోటితో రుచి చూచినది. ప్రత్యక్షం అంటారు. "నేను తిన్నాను రుచి చూచాను. ఇది సత్యం" అని వాదించవచ్చు. ఇది కూడా ప్రత్యక్ష ప్రమాణం కాదు. ఎట్లా? ప్రత్యక్ష ప్రమాణ మవుతుంది? నీకు ఆరోగ్యంగా ఉండినప్పుడు తీపి తీపిగా, కారము కారంగా చేదు చేదుగా ఉంటుంది. నీలో మలేరియా జ్వరము - ప్రవేశిచిందంటే ఈ నాలుక తీపిని కూడా చేదుగా రూపొందింపజేస్తుంది. కాబట్టి యిది ప్రత్యక్షమని ఏవిధముగా వివరించగలవు? లడ్డు తీయగానే వున్నది. కాని నువ్వు చేదు అంటున్నావు. యీ సమయమునందు పదార్ధమును కూడా ఒక ప్రమాణముగా తీసుకోవాలి. ఇంద్రియ ప్రమాణమే కాకుండా పదార్థ ప్రమాణం కూడా మనం విచారించాలి. ఇంద్రియము చేదు అని చెప్పినది పదార్థమును విచారిస్తే అది తీయగా వుంటున్నది. కనుక ఈ ప్రమాణమునకు సరయిన ఆధారము లేదు. ఇక పాలను ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఈ పాలలో కొంచెం మజ్జిగ తోడంటు వేసినప్పుడు పెరుగుగా మారిపోతుంది. యిది. ప్రత్యక్షమే. పాలు పెరుగుగా మారిపోయింది. పెరుగును మనం చిలికినప్పుడు వెన్న తేలుతుంది. వెన్నను మనం కాచినప్పుడు నెయ్యిగా మారుతుంది. ఈ నెయ్యి వెన్న మజ్జిగ పెరుగు-పాలలోనే వుంటున్నాయి. కాని వివిధ మార్పులచేత వివిధ కర్మలచేత వివిధ కాలములలో వేర్వేరుగా రూపొందుతూ వచ్చాయి. కానీ యిది ప్రత్యక్షము కాదని చెప్పడాన్కి వీలులేదు. ఇది ప్రత్యక్షమే. పాలు పెరుగుగా మారింది. పెరుగు వెన్నగా మారింది. వెన్న నెయ్యిగా మారింది. యిది దేనిలోను తిరిగి చేరదు. మజ్జిగనుండి వచ్చిన వెన్నను ముద్ద చేసి తిరిగి మజ్జిగలోనే వేస్తే మజ్జిగలో కలువదు. పాలలో వేసినా కరగదు. ఇదిప్రత్యేకంగా వుంటుంది. ఎక్కడ నుంచి వచ్చింది యిది? మజ్జిగనుంచే వచ్చింది. తిరిగి దానిలో కలవటం లేదు. దీనినే న్యాయ మీమాంసమని కూడ చెప్పవచ్చును. ఈ మీమాంసమనగా ఏ మాంసమూ కాదు. వస్తువు యొక్క చివరి నిష్కర్షయే మీమాంసము. నేయి కట్టకడపటి అంశము. నేయిని ఏమి చేయగలము? భుజించుటమే. దానికి మరొక ఆంత్యములేదు. పాల యొక్క అంత్యమునేయి. నేయి యొక్క అంత్యము భుజింటము. ఈ చివరి నిష్కరయే మీమాంసము. ఈ న్యాయములలో ప్రత్యక్ష ప్రమాణమును తీసుకోవటం కొంతవరకూ సాధ్యమవుతుంది. న్యాయ సూత్రములను గౌతముడు ప్రబోధిస్తూ వచ్చాడు. న్యాయశాస్త్రమునకు కర్త గౌతముడు. ఈ సూత్రములకు గౌతమ సూత్రములని కూడా మరొక పేరు. మహనీయులు అనేక తపస్సులు చేసి అనేక విధములైన విచారణలు సల్పి ప్రచార ప్రబోధలు సల్పటానికి పరిశోధనలు సల్పి ప్రమాణములు కూడా విశ్వసించి ఈ విధమైన నిర్ణయమునకు వచ్చారు. ఆనాటి ప్రమాణ కర్తలకు పరిశోధకులకు, ఈ నాటి ప్రమాణకర్తలకు ఏ పోలికా లేదు. ఆనాటి పరిశోధన ఎట్లుండినదంటే - మహర్షులందరూ మనసుని దాటి దాని తర్వాత ఉన్నతమైన మనసును - సూపర్ మైండును దాటి హయ్యర్ మైండును, హయ్యర్ మైండునుండి ఇల్యూమినేటెడ్ మైండ్ దాటి ఓవర్ మైండ్ ను దాటి విశిష్టమైన దైవత్వాన్ని దర్శించగల్గారు. కాని ఈనాటి వైజ్ఞానికులు కేవలము లోయర్ మైండ్ నందు మాత్రమే ఉంటుండి. ఈ విశిష్టమైన దివ్యత్వాన్ని అర్థము చేసుకొవలేక "ఆనాటి ఋషులు కనిపెట్టలేని విషయాలను మేము కనిపెట్టాము" అని విర్రవీగుతున్నారు. ఆనాడు ఋషులు కనిపెట్టలేనివి ఈనాడు కనిపెట్టినవి లేవు. ఆనాటి ఋషులు - "ఇవన్ని వ్యర్థమైనవి-లోక్లాసుకు చెందినవి" అని వదలినవి ఈనాడు వైజ్ఞానికులు కనిపెట్టారు.

(శ్రీస.ది.పు. 105/108)

 

మన ప్రమాణాలు ప్రత్యక్ష ప్రమాణాలని అనుకోవడం చాలా మూర్ఖత్వం. కనుక ప్రత్యక్ష ప్రమాణమనగా ఏమిటి? హృదయ ప్రమాణమే ప్రత్యక్ష ప్రమాణము. ఇదే సరయినన్యాయము. కానీ ఈనాటి వ్యాయము విరుద్ధమయిన రీతిగా జరుగుచున్నది. న్యాయమును అన్యాయంగా, ఆన్యాయమును న్యాయముగా మారుస్తున్నారు. ఒక వెయ్యి రూపాయలు ఎక్కువిస్తే ఆన్యాయం న్యాయమైపోతుంది, - న్యాయం అన్యాయమైపోతుంది. ఇలాంటి న్యాయము న్యాయమైపోతుందా? ఇలాంటి న్యాయస్థానాలు న్యాయ స్థానాలవుతాయా? కానేకావు. నిత్యజీవనోపాధి నిమిత్తమై పొట్టకూటికై పాటుపడే న్యాయములు ఇవన్నీ. ఇట్టి న్యాయము కాదు ఆనాటి కాలములో, ఆది హృదయన్యాయము.

 

 

తన పర అనే బేధము లేకుండా న్యాయము విచారించి సరైన మార్గములో అమలు పరిచేవారు.

 

అన్ని మతములూ ఇలాంటి మార్గమును అనుసరించాయి. "హజరత్ మహమ్మద్" ముస్లిం మతములో కూడా న్యాయముంటున్నది. మతములు వేరు కావచ్చు. న్యాయము అందరికీ ఒక్కటే మానవత్వానికి విరుద్ధముగా ప్రవర్తించిన వారిని కఠినముగా శిక్షించేది ఆనాటి ముస్లిం మఠం, అందరికీ సమమయిన పనిష్మెంట్ ఉండేది. దుష్ట దృష్టిచేత, మనసు, క్రియలచేత మానవుడు అనేక దోషాలు చేస్తుంటాడు. అలాంటివారికి నూరు కొరడా దెబ్బలు అని నిర్ణయించారు. ముస్లిం మతంలో. కానీ ఆలాంటి దోషాలు ఈ హజరత్ మహమ్మద్ కుమారుడే చేసాడు. అప్పుడు తన కుమారుడే అనే భేదము లేకుండా మహమ్మద్ తన కుమారుని నూరు కొరడా దెబ్బలు కొట్టండి అని అన్నాడు. ఇదే నిజమైన న్యాయం. తన పర భేదము లేకుండా అందరికీ సమమయిన శిక్ష. కాని యాభై దెబ్బలు కొట్టేటప్పుటికే కుమారుడు ప్రాణం విడిచాడు. అతనిని సమాధి చేసారు. సిపాయిలు వచ్చి మహమ్మద్ ని ప్రార్థించారు. "స్వామీ! యింక యాభై దెబ్బలు మిగిలి వుంటున్నాయి. ఏమి చెయ్యమంటారు?" సమాధి పైన కొట్టండి అన్నాడు హజరత్ మహ్మద్ చూసారా! ఎంత న్యాయమో, ఎంత ధర్మమో. ఎంత పవిత్రత, ఈనాడు తన పర అనే భేదము ఉంచుకొని పరాయివాడయితే పది సంవత్సరములకు శిక్ష. తనవాడయితే కోర్టును పూర్తిగా ధిక్కరిస్తారు. ఇదే మనం పేపర్లలో చూస్తున్నది. యిట్టి కుయుక్తితో యిట్టి అల్పమయిన బుద్ధితో కూడినది న్యాయము కాదు. న్యాయము న్యాయమే. అలాంటి దానినే గౌతముడు ఆవిర్భవింప చేసాడు. ఇదే న్యాయదర్శనము. ఈ న్యాయదర్శనము లోపల మొట్టమొదటిది ప్రత్యక్ష ప్రమాణము. .

రెండవది అనుమాన ప్రమాణము. కొంగలంతా ఎక్కడ బాగా తిరుగుతున్నాయో అక్కడ నీరువుంది అనే విశ్వాసము అనుమాన ప్రమాణము. కొంగలు సంచరించే ప్రదేశములో నీరు ఉంది. కొంగలను సాక్ష్యముగా తీసుకొని నీరున్నదని ప్రమాణము నిరూపిస్తున్నది. ఎక్కడెక్కడ పొగ వస్తుందో అక్కడక్కడ అగ్ని ఉంటుంది. అగ్ని కనిపించటం లేదు. కాని పొగను ఆధారంగా తీసుకొని అగ్ని ఉన్నదని విశ్వసిస్తున్నాడు. ఇక్కడెక్కడో సుగంధం వస్తున్నది. ఈ గంథాన్ని ఆధారం చేసుకొని యిక్కడేవో మల్లెపూలు ఉంటున్నాయని స్వరూపాన్ని నిరూపణ చేసుకుంటున్నాడు. స్వరూపం కనిపించకపోయినా స్వభావం విశ్వసించి ఈ విధమైన స్వరూపముండవచ్చును. అని తేల్చింది. అనుమాన ప్రమాణము. ఈ అనుమాన ప్రమాణము కూడనూ అవసరమే. ఈ దివ్యమైన ప్రకృతి యందు కేవలము ఇంద్రియములతో కూడిన దేహములతో, హృదయము కూడిన మనస్సులో ఈ అన్ని ప్రమాణములు సరియైన ప్రమాణములుగానే తోస్తూ వుంటాయి. అనుమాన ప్రమాణమనగా విషయాన్ని ఆధారము చేసుకొని నిజస్వరూపాన్ని నిరూపణ చేయటమే.

ఇక ఉపమాన ప్రమాణము. ఉపమాన ప్రమాణమనగా ఏమిటి? సముద్రము ఉంటున్నది. ఈ సముద్రములో అలలు బయలుదేరుతున్నాయి. ఆలలనుంచి నురుగు వచ్చింది. అలలయందు చూచినా నురుగునందు చూచినా సముద్రజలమే వుంటున్నది. ఈ మూడింటిని విచారణ చేసి ఉపమానములుగా తీసుకోవచ్చును. పారమార్థకము, ప్రాతిభాసికము వ్యావహారికము. వీటికి ప్రమాణముచెప్పమంటే అందు ప్రాతిభాసికమనగా కేవలము అల. వ్యావహారికమనగా నురుగు. పారమార్థికమనగా జలము. ఈ అన్నింటిలోనూ ఉండినది. ఒక్క జలమే అనే ఉపమానము తీసుకొని దీనిని ఏకత్వంగా భావించటము. పారమార్థికమైన సముద్ర జలమునుండి ప్రాతి భాసికమైన అలలు ఆవిర్భవిస్తున్నాయి. ఆవిర్భవించిన ప్రాతిభాసికమనే అలల యందే వ్యావహారికమనే నురుగు ఉంటున్నది. అర్థముకాని విషయమును అర్థమయ్యేరీతిగా నిరూపించటము ఉపమాన ప్రమాణము. కేసులు ఏవిధముగా నిర్ణయాలవుతున్నాయి? కేసులకు సాక్ష్యములే ఆధారము. కేసుకు సాక్షులు ఎంత ఆధారమో సత్యాన్ని గుర్తించటానికి ఉపమానాలు అంత అవసరము. కనుకనే నేను అమితంగా ఉపమానములు చెపుతూవుంటాను. ఈ ఉపమానాల చేతనే సత్యాన్ని మనం గుర్తించటానికి వీలవుతుంది. అక్కడ చూడు చందమామ ఉంటున్నది. ఈ కంటికి కనిపించని చందమామను అందని చందమామను ఏవిధముగా చూపటానికి వీలవుతుంది? అదిగో అక్కడ ఉందంటే ఎక్కడో చూస్తారు. అక్కడ చెట్టుపై ఉంటుందని చూడు. ఆ గుట్టపై ఉంటుందని చూడు. ఆ మెట్టపై ఉంటుందని చూడు. అని చెప్పినప్పుడు చక్కగా దృష్టి చందమామ పైకి ప్రవర్తిస్తుంది. అట్లే మనసుకు అందని దానిని ఉపమానముల చేత అర్థమయ్యేరీతిగా గుర్తించవచ్చును. దీనినే ఉపమాన ప్రమాణము అన్నారు.

 

ఇంక శబ్దప్రమాణము : ఈ శబ్దప్రమాణమును సత్యప్రమాణమని భావిస్తూ వచ్చారు. ఈ సత్య ప్రమాణమును ఆధారముగా చేసుకొనియే వేదములు, వేదాంగములు ఉపనిషత్తులు, భగవద్గీత ఇత్యాది మహా గ్రంథములు ఉపదేశిస్తున్నాయి. ఈ శబ్ద ప్రమాణముచేత ఏమవుతుంది? శబ్ద ప్రమాణము ఏరీతిగా సంభవిస్తుంది? ఇంద్రియముల తత్వాన్ని పూర్తిగా అణగదొక్కాలి. చూచిన కన్నులకు, విన్న చెవులకు, తెలిసిన మనసుకు విచారించే బుద్ధికి అతీతమైన స్థితికి పోవాలి. అందువల్లనే బుద్ధిగ్రాహ్యమతీంద్రియం అన్నారు. మనము ఈ ప్రత్యక్ష ప్రమాణమును వదలి అనుమాన ప్రమాణమును వదిలి ఉపమాన ప్రమాణమును వదలి శబ్ద ప్రమాణమునకు పోవటంలో చాలా జాగ్రత్తగా ఉంటుండాలి.

 

శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి జ్యోతిర్మయి వాజ్మయి నిత్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి అష్టైశ్వర్య స్వరూపముతో కూడినది యీ శబ్దము. ఎక్కడో దూరముగా వుండినవాడిని ఓ బాబూ అని పిలిస్తే ఆ శబ్దము చేతనే వాడు తిరిగి వచ్చుచున్నాడు. అంతవరకూ మనము పోనక్కరలేదు. నిత్యమూ శబ్దము చేతనే హృదయానికి ఆనందము చేకూర్చటమో లేక హృదయానికి దుఃఖాన్ని చేకూర్చటమో జరుగుతూ ఉంటున్నది.

 

శబ్దములన్నింటి పైన ప్రమాణ శబ్దము భగవత్ సంకీర్తన, ఒకానొక సమయములో నారదుడు మహావిష్ణువును సందర్శించి స్వామీ! తన దర్శనార్థమై నేను తరచూ వస్తుంటాను. సహజము. ఎందుకు ఇతనికి సహజ మయినది? యిల్లూ బిడ్డలు లేరు. ఇష్టమొచ్చినప్పుడు వైకుంఠము. ఇష్టమొచ్చినప్పుడు కైలాసము సర్వత్రా సంచరిస్తూ ఉంటాడు. స్వామీ! నాకు అవసరమొచ్చినప్పుడు తమను దర్శించుకోవాలంటే ఎక్కడకు రావాలి? హెడ్ ఆఫీసు ఎక్కడ?" అప్పుడు చెప్పాడు. పిచ్చివాడా! మద్భక్తః యత్రగాయన్తి  తత్ర తిష్టామి, నారద వ్రాసుకో నా ఆడ్రస్ -నా భక్తులు ఎక్కడ గానము చేస్తుంటారో నేనక్కడ ప్రతిష్టమయి ఉంటాను. వసావి అని చెప్పలేదు. తిష్టామి అన్నాడు.) భగవత్ నామమే శబ్దము, శబ్దమంటే బాంబుల శబ్దము, పటాకుల శబ్దము, శబ్దము, ఈ శబ్దమూ కాదు. భగవత్ నామమే ప్రధానమైన శబ్దము. ఈ లౌకిక శబ్దములకు మన యియర్ డ్రమ్స్ పగిలిపోతాయి. గానమనే శబ్దము మన హృదయాన్ని వికసింపజేస్తుంది. హృదయగ్రంథిని భేదింపజేస్తుంది. ఈ శబ్దప్రమాణమే వేద ప్రమాణము. ఈ వేదము శబ్దప్రమాణంతో కూడినది. మానవత్వములో న్యాయవిచారణకు నాల్గు విధములైన ప్రమాణములనుబోధిస్తూ కడపటిదిగా శబ్దప్రమాణమును చెప్పింది. అన్ని ప్రమాణములందు న్యాయము సమానమైన అంతర్వాహినిగా ప్రవహిస్తూ వచ్చింది.

(శ్రీ.స.. ది.పు.110/113)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage