కొందరు హిస్టీరియా వంటి వ్యాధిగ్రస్తులు, బలహీనమైన మనస్తత్వం గలవారు. నేను వారిద్వారా మాట్లాడు తున్నానని, నేను వారి ద్వారా ప్రవర్తిస్తున్నానని చెప్తున్నారు! నేనిప్పుడే చెప్తున్నాను. అటువంటి అసహ్యపు వ్యక్తులతో నాకు సంబంధం లేదు. నేను ఎవరిని నా వాహికలుగా వాడుకోను. అటువంటి అవసరం నాకులేదు. నేను ఆవిధంగా ఊగిపోతూ పిచ్చిమాటలు మాట్లాడను. సంవత్సరాల తరబడి తపస్సుచేసి శరీరాన్ని బాధ పెట్టుకున్నవారు, శరీరం చుట్టూ పుట్టలు కట్టినా కూడా చలించని వారు భగవంతుణ్ణి గ్రహించటం కష్టమని తెలుసుకున్నారు. అటువంటిది ఈ సోమరులు, తిండిపోతులు, ఇంద్రియలోలుడు తేలికగా భగవంతుణ్ణి ఎలా తెలిసికోగలరు? వారి అభినయాలు, మాటలు, చేతలు అన్ని దొంగవేషాలు. కొందరు అటువంటి వారి ఎదుట ధూపం వేస్తూ, వారిని కొలుస్తూ నా నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఆసత్యము వెంట పరుగులు పెడుతున్నారు. పరిపూర్ణుడైన పరమాత్ముడు తుచ్ఛమైన మోసపూరితమైన శరీరాలలో ఎలా ప్రవేశిస్తాడు? భగవంతుడు రూపం ధరించి వచ్చినప్పుడు ఆయన అర్హతలేని పాత్రలు నింపడు. కలుషితమైన శరీరాలలో ప్రవేశింపడు. కాబట్టి మీరు అటువంటి వారి వెనకబడి వారి అసత్యపుతత్త్వానిస్తుతించకండి. వారితో కఠినంగా ప్రవర్తించండి. అప్పుడు వారు దారికి వస్తారు. మిరుమిట్లు గొలిపే వజ్రాన్ని చూసిన వారు తళుకు బెళుకుల గాజు ముక్కలు చూసి మోసపోరు. మీరు ఏ పేరుతో పిలిచినా భగవంతుడు వజ్రం వంటివాడు. ఎవరు ఎంత పొగడినా, వాదించినా గోజుముక్క వజ్రంగా మారదు.
(వ.61-62 పు.145)
మీకు ఒక హెచ్చరిక చేయాలి. కొందరు నా పేరు చెప్పి భోజనాలు పెడతామని, దేవాలయాలు కడతామని, పూజలు చేస్తామని చందాలు వసూలు చేస్తున్నారు. వాటిని ఎంతమాత్రము నమ్మకండి. అవి నా ఆశయాలకు, సూచనలకు పూర్తి వ్యతిరేకం. అటువంటి వాటిని నేను ఖండిస్తున్నాను. మీరు వాటిని ఏ మాత్రము ప్రోత్సహించకండి. మరికొందరున్నారు. వారిపై నేను పూనానని, వారి ద్వారా నేను మాట్లాడుతున్నానని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. అటువంటివారి నందరిని మోసగాళ్ళుగా గ్రహించండి. లేకపోతే మీరు కూడా వారి మోసంలో పాలుపంచుకుంటున్నారని భావించవలసి వస్తుంది. మరికొందరు నేను వారికి ఒక విగ్రహమునో, ఒక బొమ్మనో ఇచ్చానని చూపించి డబ్బు వసూలు చేస్తున్నారు. "బాబా నన్ను మీ దగ్గర నుంచి డబ్బు తెమ్మని పంపించారు." "బాబా నాకు ఇది ఇచ్చారు". "బాబా ప్రత్యేకంగా ఆశీర్వదించారు" అని మాయ మాటలు చెప్పి మీ దగ్గర డబ్బు ప్రోగుచేస్తున్నారు. ఇటువంటివారిని ఎవరైనప్పటికి వారిని మీరు బహిష్కరించి, బయటకు పంపించి వేయండి.
(వ.61-62 పు.246)