ఈనాటి యువకుల యొక్క ప్రవర్తన చాల వికారంగా ఉన్నది. మంచితనమును పోషించుకున్నప్పుడే యువతకు సరియైన కీర్తి వస్తుంది. ఇష్టం వచ్చినట్లు సంచరించేది కుక్కనేగాని, మనిషి కాదు. “నేను మనిషిని" అనుకున్నప్పుడు మనిషికి తగిన ప్రవర్తన కలిగియుండాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు జంతు లక్షణాలేగాని, మానవ లక్షణాలు కావు. ఇవి ఆహార దోషం వల్ల ఏర్పడుతున్నాయి. వీటి వల్లనే మానవుడు మానవత్వాన్ని కోల్పోయి దివ్యత్వాన్ని విస్మరిస్తున్నాడు. క్రోధం కుక్క లక్షణం. కాబట్టి, మీకు క్రోధం వచ్చినప్పుడునేను కుక్కను కాదు. నేను మనిషిని" అని పదేపదే జ్ఞాపకం చేసుకోండి. చంచలత్వము కోతి లక్షణం. కనుక, మీలో పిచ్చిపిచ్చి భావాలు కల్గినప్పుడు "నేను కోతిని కాదు. నేను మనిషిని" అని మిమ్మల్ని మీరుహెచ్చరించుకోండి. ఈ దుర్గుణములను నివారించే దివ్యాషధం మీయందే ఉన్నది. సద్గుణములను అభివృద్ధి పర్చుకుంటే దుర్గుణములు వాటంతటవే దూరమౌతాయి.
(స.పా.డి.99పు.367/368)