దేవతాస్తుతి పదాలైన మంత్రాల సమూహము. ఋగ్వేదమనగా దేవతలు అని కూడా చెప్పవచ్చు.
దేవతలు అనేకమంది కలరు. అయితే ఋగ్వేదములో ముఖ్యమైన దేవతలు (33) ముప్పైమూడు మంది. వారికి మానవులవే శరీరములున్నవి.
సూర్యుడు. ఇతనికి కిరణములే హస్తములు: అగ్నిజ్వాలలు నాలుకలని వర్ణింపబడినది. అగ్ని. అరణి మధనముచేత పుట్టినది. అగ్నికి తల్లితండ్రులున్నారు. మధనానికి ఉపయోగించే కఱ్ఱలేవారు. అగ్ని పుట్టగానే తల్లి దండ్రులను భక్షిస్తాడు. ఇతనికి పదిమంది స్త్రీలు. అనగా వేళ్ళచే సృష్టింపబడిన వారు. అరణి మధనముచేత సృష్టింప బడుటచేత అతనికి బహుజన్ముడని కూడా పేరు. ధూమమే ఇతని ధ్వజం: అందువలన ఇతనిని ధూమకేతుడని పిలుస్తారు. ఇతనికి యజ్ఞసారథి అని కూడా పేరు. కారణమేమన దేవతలను తన రథముమీద తీసుకొని వస్తాడు. యజ్ఞములో సమర్పించిన ఆహుతులను దేవతలకు సమర్పిస్తాడు. యజ్ఞమునకు ఇతడే ముఖ్యుడు.
అందుచేతఋత్విక్కులు,హోతలు, పురోహితులుగాను,బ్రహ్మగాను,స్తుతింపబడుతాడు.ఇతడుమానవులకు అత్యంత సన్నిహితుడు. అనగా అగ్ని లేక మానవ దేహము నిలువజాలదు. ఏ పనియు చేయజాలరు. సమస్త కర్మలకు దేహమందు, దేహమునకు వెలుపల అగ్ని ఉండియే తీరవలెను. కనుక అతనిని గృహపతి అని, అతిథి అని పిలుస్తారు. అగ్ని అన్ని ప్రాణులను, అన్ని జాతులను సమానముగా చూచుచుండెడిది. కనుక అగ్నికి సమమిత్రుడని కూడా పేరు.
మన అందరి ఆశలు ఒకటిగా ఉండాలనియు, అందరి హృదయాలు, అందరి ఆలోచనలు మంచివిగా ఉండాలనియు, ఒక్క సత్యమార్గమున నడువవలెననియు, అందరూ, ఒక్కటే అని ఏకత్వము బోధిస్తుంది. ఈనాడు మానవులందరు ఒక్కటే అని బోధించుట క్రొత్తగా ఉన్న మార్గముగా భావిస్తున్నారు. ఇట్టి భావము క్రొత్తది కాదు. ఋగ్వేదము ఇంతకంటే గొప్పగా సమానభావము బోధించినది. ఇదే ఋగ్వేదములోని ప్రధాన ఆశయము. అందరూ ఒక్కటే. అందరూ భగవంతుని అంశములే, శక్తులే. అందరి యందు ఉన్న ఆత్మ స్వరూపుడు ఒక్కడే, బేధములుండరాదు అని శాసించింది. ఇట్టి విశాల భావాన్ని ఈనాటి మానవులు కోల్పోయి, భేదములు అభివృద్ధి పరుచుకొని సంకుచిత జీవితాన్ని గడుపుచున్నారు. ఆనాడు సంకుచితమును కూలద్రోసి విశాలత్వమును, ఏకత్వమును చాటినది ఋగ్వేదము.
(వీ. వా. పు 11, 12)
(చూ || ఆర్ష, వేదము, స్వాహా)