భారతీయ సంస్కృతియందు ఉత్తరాయణ కాలం చాల మంచిదన్నారు. ఈ కారణం వల్లనే భీష్ముడు కూడా తన దేహాన్ని ఉత్తరాయణ పుణ్య కాలంలో త్యజించాలని శరతల్పంపై 56 దినములు కాచుకొని ఉన్నాడు. ఉత్తరాయణంలో సూర్యుడు ఉత్తర దిశకు ప్రయాణం చేస్తుంటాడు. ఉత్తర దిశలో హిమాచల పర్వతమున్నది, అక్కడే ఈశ్వరుడు నివసిస్తున్నాడంటారు. సూర్యుడే ఉత్తర దిశకు ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి, మన దృష్టిని కూడా ఉత్తర దిశకు మరల్చాలి. అయితే, "ఈశ్వర స్వర్వ భూతానాం", ఈశ్వరుడు సర్వత్ర ఉన్నాడు కదా! మరి హిమాచలంలో నివసిస్తున్నాడనటంలో అంతరార్థ మేమిటి? హిమమనగా చల్లనిది. తెల్లనిది. ఆచలమనగా చలించనటువంటిది. కనుక, పవిత్రమైన, ప్రశాంతమైన, చలించనటు వంటి హృదయమే హిమాలయము. అందులోనే ఈశ్వరుడుంటున్నాడు. కనుక, ఈశ్వరుణ్ణి దర్శించాలంటే మీరు ఎక్కడికో ప్రయాణమై పోనక్కర లేదు. మీ దృష్టిని అంతర్ముఖం గావించుకుంటే చాలు.
(స.సా. మే99పు. 135/136)
హిమ మనగా మంచు. మంచు చల్లగా ఉంటుంది. చల్లగా ఉండటమే కాదు, తెల్లగా ఉంటుంది. అచలంగా ఉండేది పర్వతం, హిమ + అచలము = హిమాచలము అన్నారు. హిమాచలమనగా మన హృదయమే. అది చల్లగా ఉండాలి. ఏ కోపమో, తాపమో. ఈర్ష్యనో, డంబమో ప్రవేశించ కూడదు. పరిపూర్ణమైన, పరిశుద్ధమైన, ప్రశాంతమైన, చలించని హృదయమే హిమాచలము.హిమాచలములో ఈశ్వరుడున్నాడని అక్కడికి నీవు ప్రయాణమై పోనక్కర లేదు. అచలమైన, శాంతమైన, పవిత్రమైన, నిర్మలమైన నీ హృదయమందే ఈశ్వరుడున్నాడు. కనుక నీ దృష్టిని అంతర్ముఖము గావించుకోవాలి. చలించే హృదయం హిమాచలం కాదు. మాలిన్యమైన హృదయం హిమాచలం కాదు. అశాంతితో మన్న హృదయం హిమాచలం కాదు. ప్రశాంతమైన, పవిత్రమైన, నిర్మలమైన, నిశ్చలమైన హృదయమే హిమాచలము.
(దస. 98 పు. 76)
(చూ|| సూర్యుడు)