ఈ ఉపనిషత్తు ఋగ్వేదాంతర్గతమైనది. ఆత్మతత్త్య ప్రతి పాదకమగు కాండపట్కముతో అలరారుచున్నందున ఆత్మషట్కమని ప్రసిద్ధిగాంచినది. అవిద్యానాశన పూర్వక మగు ఆత్మదర్శనము సంప్రాప్తమయ ఆత్మజ్ఞానము కలుగునటుల శిష్యునిచే చేయబడినది. "ఆత్మ" “వ్యవహార విశిష్టము" అనబడు రెండు విధములుగా ఆత్మ నిర్వచించబడెను. వ్యవహార విశిష్టుడయినపుడు అతడు జీవుడని పిలువబడుచున్నాడు. ప్రతి మనుజునియందూ ఆత్మజ్ఞానేంద్రియముల ద్వారా బాహ్యములకు స్పురించు చున్నాడు. ఆత్మ శబ్దము అత్ అను ధాతువునుండి ఉత్పన్న మగుచున్నది. ఆ ధాతువునకు సర్వవ్యాపకత్వము, సర్వభోగము. భక్షణము, గమనమని మూడర్థములు కలపు, సర్వవ్యాపకత్వము, సర్వభోగము, సతతగమనము లక్షణములుగా గలది ఆత్మ. ఇవియే బ్రహ్మలక్షణములు, జాగ్రత్ అవస్థ యందు సర్వభోగములుగా గలది ఆత్మ, ఇవియే బ్రహ్మలక్షణములు. జాగ్రత్ అవస్థ యందు సర్వభోగములు అనుభవించుచున్నాడు. కనుక ఆత్మ శబ్దమునకు భోగపరుడనియు, స్వప్నమందు సర్వేంద్రియములు స్వస్వవ్యాపారములు మాని పరమావస్థను జెందినపుడు జాగ్రదనుభవవాసనలను స్వీయకాంతిచే జాగ్రద్రూపమున జయింప స్వీకరించు వాడనియు, సుషుప్తియందు సర్వేంద్రియములు మనస్సు గూడ చరమావస్థను పొందినపుడు సర్వవ్యాపియై ఏమియూ తెలియని కేవలము ముఖస్వరూపమును పొందు వాడనియు, ఇట్లు జాగ్రత్స్వప్న సుషుప్త్యాది అవస్థా త్రయములను బట్టి ఆత్మ శబ్దార్థము నిర్వచింపబడినది. ఉపాధివిశేషముచే ఆత్మ పరిచ్ఛిన్నముగా గాన్పించిననూ పరమార్దముచే అతడు నిరుపాధికుడు. దేశ కాల వస్తు పరిచ్చిన్నములు లేనివాడు. అనగా అనంతుడు, ఇదియూ ఆత్మ శబ్దమునకు అర్థము. ఇట్టి ఆత్మ సర్వజ్ఞుడు, సర్వశక్తిమయుడు, సర్వధర్మవర్జితుడు, నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావుడు, అద్వయుడు, ఆత్మకు ఆవయవ భేదములు లేవనియు తెలియుచున్నది.
ప్రత్యక్షాది ప్రమాణములచే నీ జగత్తంతయు అనుభవ గోచరమగు చున్నది. కనుకనే మూల మంత్రమునందు అది "ఇదం" "ఇది" అని హస్తవిన్యాసముల చేతనే అనునట్లు నిర్దేశింపబడుచున్నది. ఇది వివిధ నామ రూప సంకులమై సృష్టియని ప్రసిద్ధిగ జెప్పబడుచున్నది. సృష్టి శబ్దము ఒక కార్యమును తెలుపుచున్నది. సృష్టి కార్యమునకు పూర్వము ఈ జగత్తు ఏరూపముననున్నది? "ఇదం అగ్రే ఆత్మా ఏవ అసీత్" అనగా మన ఎదుట కాన్పించుచున్న ఈ జగత్తు సృష్టికి పూర్వము ఆత్మ గానే యుండెను. శ్రుతి కూడా ఈ విషయమును తెలిపి యేయున్నది. సృష్టికి పూర్వమున నున్న జగత్తు, తరువాత నున్న జగత్తు రెండూ ఒకటే. సృష్టికి పూర్వము ఆవ్యాకృతమై కేవలమాత్మ రూపమున నుండెను.
(ఉ. వా. పు.65/66)