1. యమము: అహింసా సత్యాస్తేయ బ్రహ్మచర్యాపరిగ్రహయమా:
అహింస, సత్యము, దొంగిలింపకుండుట, బ్రహ్మచర్య మవలంబించుట. దానమును పట్టకుండుట అని అయిదు అంగములతో కూడు కొన్నది యమము; అయితే నేను అట్లుకాక, దేహమునందు, ఇంద్రియములందు కలుగు విరక్తియే యమమని తెలుపుదును. నామరూపరహితమై నిర్గుణమై అనంతమై సంతాపదుఃఖశూన్యమై, భావవర్జితమై, శాశ్వతమై సచ్చిదానందస్వరూపమై వెలుగు బ్రహ్మపదార్థ మొండు కలదు. అదియే భ్రాంతిదశలో ఈ సమస్త విశ్వముగాను, పర్యుక్త గుణములకు వ్యతిరేకమైన గుణములతో కూడబడినట్లు, అనగా నామరూపసహిమై, సంతాపదు:ఖభావయుతమై, వివిధ వికృతగుణములు కలదై, శాశ్వతమై, పరిమితమై, జ్ఞానశూన్యమైయుండు సంసారమువలె కన్పించు చున్నది. ఇట్లు పరబ్రహ్మవస్తువు మహామహా పండితులను కూడా భ్రాంతి చెందింప జేయునట్లు వ్యష్టి సమిష్టి రూపముగా కనిపించుచుండును. దేహభ్రాంతులందు జిక్కి, తల్లి, తండ్రి, ఆలు, పిల్లలు, సంసారమని, బంధు బలగములని, నానావిధ బంధముల జిక్కి దుఃఖించుచుండును.కాన, సచ్చిదానందరూపుడైన పరబ్రహ్మమును చింతించి, నిత్యానిత్యవస్తు వివేకమువలన, సత్సంగమువలన, పెద్దల సేవలవలన, నిర్మలబుద్ధి వలన దేహేంద్రియములు నాకు లేవు: వ్యక్తి సమష్టి దేహయమంతటికిని అధిష్టానమై అలరు బ్రహ్మమునే నేను అనెడి భావము పూని యుండుటయే, దేహేంద్రియములందు వైరాగ్యము, జ్ఞానయోగమునందు దీనినే యమ అని పిలుతురు..
సుఖమునకై మోదము, దుఃఖమునకై ఖేదము చెందకుండుట దేహేంద్రియముల యొక్క బాధను తనబాధయని గలంగ కుండుట మొదలుగాగల ద్వంద్వాతీతస్థితి లభించవలయును. క్రమక్రమముగా దేహంద్రియములను మరచి మెలగవలయును. ఇవియే యమాంగము సిద్ధించిన దనుటకు లక్షణములు. పై లక్షణము క్రమశిక్షణాలు ఉన్ననే యమమని పిలువబడును. అయితే ఈ యమాంగము జ్ఞానయోగ భావమునకు పునాది. యమాంగము సిద్ధించనిదే, సాధన అటులనే కొనసాగుతూపోయిన వారికి చాలా ప్రమాదము కాన, సాధకులు పై విషయమున కడుజాగ్రత్తతో మెలగవలెను.
2. నియమము: అనగా పరిశుద్దుడై యుండుట. సదా సంతోషముగా నుండుట, తపస్సు చేయుట, మంత్రజపము చేయుట నియమమని రాజయోగము తెలుపును. దానినే రాజయోగమున "శౌచ సంతోషతపః స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని నియమా:" అని తెలిపినారు. అయితే దానిని నేను ఈ క్రిందిరీతిగా తెలుపుచున్నాను. సర్వకాల సర్వావస్థలయందును శ్రేష్టమైన సత్యమునందు, అనగా పరమాత్మ తత్త్వమునందు మిక్కిలి ప్రేమ కలిగియుండుటయే నియమమని అందును. "సా పరమ ప్రేమరూపా" అని నారద భక్తి సూత్రమున చెప్పినటుల, భక్తి అనగా పరమాత్మునియందు మిక్కిలి అనురాగము కలిగియుండుట. ఇట్టి పరతత్త్వానురక్తి కలిగినంతనే, రాజయోగమున తెలిపిన శౌచ, సంతోష తపస్స్వాధ్యాయేశ్వర ప్రణిధానాదులు వాటంతటవియే కలుగును. పైన చెప్పిన రీతి యమాంగము సిద్ధించిన తదుపరి సచ్చిదానంద పరబ్రహ్మ వస్తువువలననే నిజముగా ఈ ప్రపంచమున మన మనుకొను ఆనందము, శాంతము, సుఖము కొలదియైనను మానవ అర్హతల ననుసరించి, మానవులకు లభించుచున్నది. కాని, సాధకులు భావించునట్లు శాంతి ఆనందములకు నిజమైన కారణము మిధ్యాభూత శుష్క భౌతికవస్తుసమూహము కాదు. "రసోవై సః "ఆనందోవై బ్రహ్మ", అను ఉపనిషత్ శాసనము ననుసరించి ఆ పరబ్రహ్మము వలననే ఈ విశ్వమునందు, సంసారము రసభరితమనిపించును. ఆ పూర్ణ రసస్వరూపుడే లేకున్న ఈ సంసారము మానవుల కింత మధురంగా కన్పించదు. కడు చేదయి వుండును. ఈ మధురమునకు ఆ అమృతస్వరూపుడే కారణము.
బ్రహ్మజ్ఞులుచేరి వేదాంతవాక్యార్థములను వినయ విధేయతలో వినుచుండుట, అపరవస్తువును పొందుటకై మిక్కిలి జ్ఞానపిపాసుడై పరితపించుట ఇట్టి నిర్హేతుకమైన ప్రేమ బ్రహ్మయం దెల్లప్పుడును కలిగియుండుటయే నియము సిద్ధి లక్షణములు. అది సిద్ధించినవాడు, లోకుల నిందలు నిష్ణూరములు, వాన, గాలి, ఎండ, సిగ్గు యెగ్గులను పాటించక, ఆత్మ వల్లభుని చేరుటకు, మిక్కిలి లోకవాసనా విపత్తుల బాటింపక ముముక్షువు అసంగబద్ధయై బ్రహ్మమునందు ప్రేమతో చరించును.
నియమాంగము సిద్ధించినవాడు జ్ఞానార్జనమునకై తన సర్వస్వమును ధారపోయుటకు సిద్ధపడును. ఎంతదూరమైనను శ్రమయని తలంచక బ్రహ్మవార్తలు వినుటకు పరుగిడిపోవును. విజ్ఞానుల ఆజ్ఞలన్నియు శిరసా వహించును. తన కపూర్వమగు చిన్మ యతత్త్వములు చెప్పువారే పరమాప్తులని, వారి కోరికల, ఎన్ని కష్టములకైనను వోర్చి, తీర్ప ప్రయత్నించును. ఇవియే నియమసిద్ధికి లక్షణములు,
3. ఆసనములు: మనము కూర్చొ ను స్థి తి స్థిర ము గా నుం డ వ లె ను ; అన గా క ద ల క మె ద ల క యు o డ వ లె ను . అ యి తే క ద ల క మె ద ల క అ న గా కూర్చొ న్న త రు వా త కీ ళ్లు తొ డ లు తి మ్మి ర్లు ప ట్టి పక్ష వా త ము వ o టి రోగరూపముగా పరిణమించి, స్వతస్సిద్ధముగా కదలలేనివాడై మనసులో బాధపడుచు, కదలక కూర్చున్న, ఆసనమనరు. అది ఆసనలక్షణము కాదు. దేహ స్థిరత్వముతో పాటు హృదయమునకు ప్రసన్నత్వమును ప్రసాదించు సుఖము కూడా ఆసనమందుండవలెను. కాన యోగాభ్యాసకారుడు కూర్చొనుస్థితి ఏదైనను మిక్కిలి స్థిరముగా సుఖముగా నుండవలెను. అందుకని పతంజలి"స్థిరసుఖమాసనమ్"అన్నాడు.అయితే దీనినే మరొక మార్గమున తెలుపుచున్నాను. "అన్ని వస్తువుల యందూ ఉదాసీనమైనభావము కలిగియుండుటే ఉత్తమోత్తమమైన ఆసనము అని. లౌకిక వైదిక విషయములకు అనుకూలమైన ఆచరణ కలిగియుండుటయే పరమాత్మేతర విషయములందు ఉదాసీనత. మనకు సరిపడనివాడు మన దగ్గరకు వచ్చెననుకో, అట్టి సమయమున అతనిని మనము దూషించ నవసరములేదు; పరిహసించ నవసరములేదు; చులకనగా భావించనవసరము లేదు. మన పనులలో మనము నిమగ్నులమై యుండిన చాలును.
మనకు సరిపడనివాడు, అతని త్రోవ నతడు చూచుకొనును. ఇదియే ఉదాసీనభావమందురు. పరానురక్తి కలిగిన తరువాత పరబ్రహ్మ మందలి మధుర ప్రేమ, ఇతర ప్రాపంచిక సంఘమునందు ముముక్షువు నుదాసీనునిగా చేయును.
నిజముగా "బ్రహ్మ సత్యం జగన్మిథ్యా" అను భావము సదా మననము చేయుచుండవలెను. మంచివానితోగాని, చెడ్డవానితోగాని పోత్తే అంత గాఢముగా పెట్టుకొనరాదు. ఇట్టి స్నేహమువలన ముముక్షువు నివృత్తి పథమునుండి ప్రవృత్తికి మరలును. కావున ఈ క్షణిక వస్తువు లందు మోజు విడిచి నామరూపాత్మకమైన ఈ మహా జగంబుతోడ నిస్సంగత మెలగుటయే ఉదాసీనత. ఈ విషయమున సిద్ధించినవాడు జగము యొక్కయు, శరీరము యొక్కయు, ఇంద్రియముల యొక్కయు, మంచి చెడ్డలనుగూర్చి చింతించకుండుట,శాంతుడై,దాంతుడై, నిర్మలుడైచరించుట. ఇట్లుండిన ఇవి ఆసనము సిద్ధించినవారి లక్షణము లనబడును.
4. ప్రాణాయామము
శ్వాస ప్రశ్వాసముల రెంటి యొక్క గతి విచ్చేదనమే ప్రాణాయామ మనబడును. దీనిని యోగసూత్రమున, రేచక పూరక కుంభకాదుల శ్వాస ప్రశ్వాసరతివిచ్చేదనము వివిధముగా చెప్పి, దానిని ప్రాణాయామ మనును. అయితే నే నిట్లు తలంచను. ఈ సర్వజగత్తు మిథ్యమే అను భావమే ప్రాణసంయమము అని వివరింతును. మనము వివిధరూపములతో వివిధ పేర్లతో వుండు బంగారు సొమ్ములు చూచుచున్నాము. ఆ వస్తువు లన్నియూ బంగారుతో చేయబడినవే కదా అని, అన్నిటియందు మనకు సమభావముండదు. మనమై మనము తయారుచేసుకొన్న వివిధ రూపములపై, మన వినియోగ సౌకర్యార్థము మనము పెట్టుకొన్న పేర్లపై ఏదో వెఱ్ఱి మోజు మనకు జనించును. ఈ నగల యొక్క నామరూపములు పుట్టకముందు, పుట్టినప్పుడు, పెరిగినపుడు తుదకీ సొమ్ములరూపములు కరిగించి బంగారు ముద్దలోనికి మార్చి వారి వారి పేర్లను మార్చినపుడు ఆ బంగారము మాత్రము నిర్వికారముగా అట్లే ఉన్నది. కదా! ఇదే విధముగానే నామరూపములెన్నియో ఈ జగతియందు పుట్టి, పెరిగి అణిగి పోవుటను మనము గాంచుచునే యున్నాము. అయిననూ శాశ్వతమైన దేదో శాశ్వతముగానే యున్నది. అది నిర్వికారమే. ఏవిధముగా సామ్ముల రూప నామములు అసలు బంగారుకంటే వేరుగా కన్పించుచు మనలను మోహావశుల జేయునో, అట్లే నామరూపములు పరముకంటె వేరై చెప్పుటకు చూచుటకు సౌకర్యము కలిగించుటకు ఏర్పడినవయ్యును, అవియే మన సమస్త సుఖము, శాశ్వతములు అన్నట్లు తోచును. అయితే అనంత అకళంక అనాద్యమునైన బ్రహ్మమే ధ్రువమని చాటుచున్నవి శ్రుతులు; తెలియదా? కావున నగలరూపము లరయక, సర్వమును బంగారమేయని అరయునట్లు, మనకు కన్పించునట్టి ఈ సమస్తమైన నామరూపములందు మతిని చోనుపక అంతయును బ్రహ్మమేయని తెలుసుకొనవలెను. ఎట్లున్ననూ అది మాయాకల్పితమేనని, సద్వివేక బుద్ధితో నిజముగా దివ్యత్వమును తెలిసికొనుటయందు మిక్కిలి కాంక్షగలవాడై రాత్రి పగలు సమస్తంబును బ్రహ్మమే అను దృష్టితో చూడవలెను. భ్రాంతిదశలో, వ్యక్తమగు ఈ జగమే సత్యమనియు, బ్రహ్మమే మిథ్యమనియు తోచును. వివేకదశలో జగమే మిథ్య యను భావము వచ్చును. మోహదేవత సౌందర్యముగా అలంకరించుకొని నామ రూపముల నాధారము చేసుకొని మోహనాస్త్రముల విడుచుచున్నది. పై విధముగ జ్ఞానదృష్టిగల వివేకియే ఆ అస్త్రముల బారినుండి తప్పించుకొనును. ఈ నామ రూపములందేవి జూచిననూ కొలదికాలము క్రిందట మాత్రమే పుట్టి కొలదికాలము తర్వాత అంతరించునవిగా కన్పించును. వీటికి మొదలు తుది లేవు. మధ్యకాలమున వ్యక్తమగునవి కావు. ఇవి ఎంతమాత్రమునూ శాశ్వతములు కావు, వివేకముతో ఆలోచించిన ఈ జగత్తులో మనము విను నామముగాని, రూపముగాని ఇదివరకు వున్నది ఇకముందుండబోవునది కాదు. జగత్తు పరిణామశీలము. గీతలో చెప్పలేదా, "వ్యక్త మధ్యాని భారత"అని?
అయితే ఒక్క విషయము. మాయికముగా కనబడు ఈ ఆఖిల జగంబపుడు నశించి చననక్కరలేదు. ఈ జగత్తునందలి సత్యత్వదృష్టి ఒక్కటే మారిన చాలును. అంతటితో కృతార్థత, అదియే జగన్మిధ్యాపతీత రూపమైన ప్రాణసంయమము. ఇట్టి ప్రాణాయామసిద్ధుని ఈ రీతిగా నుండవలెను; పెక్కేండ్ల క్రిందట వ్రాసిన పెన్సిలు వ్రాత చెడీచెడనట్లు, కలలో చూచిన వెన్నియో వస్తువులు మతికి తోచినట్లు ఏ వివేకి బ్రహ్మమే సత్యము జగత్తు మిథ్యమని భావించునో అతనికి చుట్టుప్రక్కల గల ఏవియును చూపులోనికి వచ్చి లెక్కలోనికి రాకోరడు. పుట్టుట గిట్టుట, సమస్త సంపదలూ లోకములన్నియు వట్టివే అను భావము పూని యుండవలెను. ఇదియే ప్రాణాయామము.
5. ప్రత్యాహారము:
నాలుక రుచి చూచుటకునూ కన్ను రూపము కాంచుటకునూ, చెవులు ధ్వనిని వినుటకున్ను, చర్మము స్పర్శసుఖమనుభవించుటకున్ను, ముక్కు వాసన చూచుటకున్నూ ఈ విధముగా ఇంద్రియములు తమతమ విషయములందు సదా పనిచేయుచున్నవికదా ! అట్టియెడ ఇంద్రియములను తమతమ విషయములనుండి మరల్చి, చిత్తస్వరూపమును అనుకరించునట్లు చేయవలయును. ఇది పతంజలి నిర్వచనము. కాని నేనట్లుకాక మరొక విధమును కూడ సూచింతును..
చిత్తము యొక్క అంతర్ముఖభావము (అనగా చిత్తము, బయట గన్పించి మానవులను మోహింపజేయు నామరూపాత్మకమగు మిథ్యా జగద్వస్తువులలో ఏకీభవించకుండా సర్వకాల సర్వావస్థలయందు లోపలి వైపునకు మరలుట) ప్రత్యాహారమనబడును. చిత్తము ఎప్పుడైతే మాయాయత్తమని కనునో, అప్పుడే తన ప్రవర్తనమును మార్చుకొనును. తన ప్రాపంచి కాహంకారము వట్టి బూటకమని నిస్సందేహముగా తెలుసుకొనును.
చిత్తము సహజముగా మిక్కిలి చంచలస్వభావము కలది. ఇది సుఖమును, శాంతిని కోరుచు. ఒకదానిని విడిచి మరొకదానిపై పరుగు లిడుచుండును. ఇట్టి చిత్తము సకల వస్తువులను కలలో కనిపించిన వస్తువుల చందమున, మాయికములని తెలిసికొనిన వెంటనే, స్థిరముకాని వానిపై అనవసరముగా తనకు కలిగిన మిక్కిలి మోహమునకు ఇంత కాలము ఇట్టి మోహముచే అవివేకముగా కాలముబుచ్చుటకు ఆశ్చర్యము, భయము, సిగ్గును బొందుచు బయట కనిపించు సర్వపదార్థములను విడచుచు లోపలి మొగంబగును. తదుపరి ముందటిదారికి పోవ భయపడును. బైట వస్తువులన్నియు భ్రాంతి అని తక్షణము వాటిపై భ్రాంతి విడిచి, చిత్తమంతర్ముఖమైన తరువాత, ఆ చిత్తము మునుపటివలె మూల ముసుగిడును. అప్పటి సాధకుని మనఃస్థితిని వినోదలీలల జూపుచూ దారిని తప్పించును. చిత్త మంతర్ముఖమైన వెంటనే శాంతము, సౌఖ్యము, జ్ఞానమును గూర్చి పెట్టునవి ఇవియేయను ఆశచేపట్టి అభూతవస్తువులపై మోహంబుచే రేయింపగలు కష్టించి వృథా కాలయాపన చేసితినని సాధకుడు పశ్చాత్తాపము చెందును. వెఱ్ఱి పట్టుదలతో బయటి మాయావస్తువుల గూర్చుకొనుటకై అచ్చటి కచ్చటికేగుచు, సదా అనర్థముల బొందితిని; వ్యర్థ పరిశ్రమమున శాంతిని కాంచనైతిని; అను విచారమున మునుగును. అది సిద్ధించిన, పైవిధమైన పరితాపముచే బయటి వస్తువులకై చేయిని చాపక మిక్కిలి విశదమయిన వివేకమున తాను వెలసియుండును. రానున్న కోటి వస్తువులవంక చూడక చిత్తము సూటిమీర అంతర్ముఖమై యుండుటయే వారి లక్షణములుగా ఉండును.
6. ధారణ:
చిత్తము ఒకచోట అవలంబవమున నిల్పుటయే ధారణయని పతంజలి నిర్వచించెను. నాభావము, చిత్తము యొక్క నిశ్చలమైన భావమే ధారణయని చెప్పుదును. ఎప్పుడు చిత్తము బైట వస్తుసమూహము నందలి స్నేహమువిడిచి పశ్చాత్తాపము, వైరాగ్యము, విజ్ఞానమునందభిలాష అను సద్గుణముల ప్రోత్సాహమున లోముఖమగునో అపుడే తన ధ్యేయస్వరూపముతో గూడుకొని మాటిమాటికి వుబ్బుచుండును. ఇట్టి నిల్కడనే ధారణ యందును. కాన చిత్తమెచ్చటెచ్చటి కేగునో అచ్చటచ్చట బ్రహ్మమునే భావించి కనుచు, చిత్త మెట్టి కల్పనలు చేసిననూ అవి అన్నియూ బ్రహ్మమే అనుచు, చిత్తము నొక బాలునిగా తలంచి, ఆచిత్తబాలునకు జ్ఞానబలముచే నయమగు లాలనచే బయట కన్పించు వస్తువులన్నియును బ్రహ్మమందు నిశ్చయముగ కల్పితములని జెప్పి అతనిని పరితృప్తుని జేసి నిర్భయునిగా జేసి పట్టుదలతో నిశ్చలత్వమును సాధించవలయును. ఎప్పుడు కూడ చిత్తమును బలాత్కారముగా బట్టరాదు. దాని చాంచల్యమును విరక్తి బుద్ధిచేత, దాని అజ్ఞానమును ఆత్మబోధనవశమున చక్కగా బోవు నట్లు నచ్చజెప్పుము. బ్రహ్మమునం దనురాగమును ప్రబలజేయుట, లోని కల్పనా రమణమును మానచేయుట, చిత్తమును బాహ్యసంచారవిముఖ మొనర్చుట ఈ మూడు విషయములచే మనస్సును ధారణాయోగమున నిల్పవలెను. చిత్తము జాగ్రత్ స్వప్నావస్థలయందు ఎన్నేనియు చిత్రకల్పనలు చేయును. అట్టి ధారణసిద్ధికి చిహ్నమేమన, సకల లౌకికవిషయ సంచారము విడిచి, గండిలోపోవు నీటిధారవలె గట్టి పట్టుబట్టి చిత్తమును బ్రహ్మమునందు నిల్పుటే, కనుబొమ్మలనడుమ అంటింపబడిన చిల్లగింజవలె చిత్తము ప్రాణముతోకూడి బ్రహ్మాత్మకముగ నిల్చును. ఉన్న దగ్గరే తిరుగు బొంగరమురీతి మనసు ద్విదళపంకజమున ప్రాణములో కూడి బ్రహ్మచింతనలో నుండుట, బ్రహ్మము దక్క ఇతరమేమియూ రవంతైన విచారింపకుండట. ఇవియే ధారణ సారము.
7,ధ్యానము:
ఒకచోట ఏకభావ ప్రవాహరూపమైన జ్ఞానమే ధ్యానము. కాని, నేను ఎన్ని విధములుగనో దీనిని గూర్చి చెప్పితిని. నేను కేవలజ్ఞానస్వరూపుడనను చింతనే ధ్యానము. ఈ సమస్తము బ్రహ్మము. అమృతసాగరమంతయు అమృతమే. అందలి ఒక బిందువుకూడ అమృతమే. సర్వము బ్రహ్మము. బ్రహ్మమే సర్వము అనినపుడు సరోవరములందు, గుంటలయందు, సముద్రమునందు, బావులయందు. వాగులయందు. కాల్వలయందు, చెరువులయందు ఎచ్చట నున్నమా నీరు నీరే అయినట్లు, పలు నామరూపములతో కూడుకొని విశ్వవ్యాప్తమై నానారీతుల వ్యక్తమగు సర్వమును బ్రహ్మస్వరూపమైన ఏకపదార్థమే. ఘటములోపల ఆకాశము, ఘటము ఇవతల ఆకాశము, రెండు వేరుగా తోచుచున్ననూ నిజమునకు ఆకాశము ఒక్కటేకదా! అటులే ఈ వ్యావహారికుడు ఎన్ని దేహములందున్ననూ, జీవసంపదయొక్క ప్రభావము, విశిష్టత, విమలత్వము ఒక్కటే. సారమైనట్టి ఆ బ్రహ్మమే బైట లోపల ఒక్కడే. అట్టి సర్వం బ్రహ్మమయ మను అనుభవమును గుర్తించి భేదభావములు లేక చరించుటే ధ్యానలక్షణము, ధ్యానానుభవములు అనేకము. అవి వారివారి ఇచ్ఛా శక్తిని అనుసరించి వుండును. కాని దానికి సారము అంతా బ్రహ్మమయము.
8. సమాధి :
రూపమును విడిచి అర్థమును మాత్రమే భాసింపజేయు చుండి నపుడు అది సమాధి అనెను పతంజలి: దానికి మరొక విధానము తెలుపుదును. ధ్యానము చేయువాడు తనను, తన ధ్యానమును మరచి పోవుటయే (ధ్యేయవస్తువునందు లీనమగుటయే) సమాధి అని.
ధ్యానమందు పరిపూర్ణత ఏర్పడి మరచుటయే సమాధి. ఈ ధ్యానము ప్రయత్నము చేయగా లభించునది. సమాధి ప్రయత్నము లేకనే లభించునది. అదియే అష్టాంగములందు శ్రేష్టమయినది. చివరిది. జీవాత్మల కావంతయూ భేదములేదని మిక్కిలి ఆమభవమునకు వచ్చు దశయే చక్కని సమాధి. ఇదియే చక్కని ధ్యానసిద్ధికి ఫలితము. యోగీంద్రులకు ప్రియము, అజ్ఞానధ్వంసిని. ఈశ్వరుని పరమ కృపాఫలము, దృఢముగా ఆత్మను తెలిసికొనుటకు ఆలవాలము, ఆదరించదగినది, సర్వ సంశయ విచ్చేదిని. ఇట్టి సమాధి సవికల్ప సమాధి నిర్వికల్ప సమాధి అని రెండు కలవు, బాగుగా ముదిరిన ధ్యానమే సవికల్పము. ఇందు జ్ఞాత, జ్ఞానము, శ్రేయము అను త్రిపుటిభావము వదలడు. నిరంతర మదియే భాసించును. ఈ త్రిపుటి భావముతోనే నిరంతరము చిత్తము బ్రహ్మమందు నెలకొని యుందును. ఇదియే సవికల్పము. జ్ఞాతనగు నేను బ్రహ్మమే, జ్ణేయము బ్రహ్మమే, అని త్రిపుటియందు సమాధారణయుండును.
సమాధి అన్నింటి సాధనసారమును చేర్చుకొన్న సాగరము వంటిది.
సప్తఅంగములైన యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానములను సముద్రములను రూపనామములు లేక లీనము చేయునట్టి అష్టాంగసాగరమే సమాధి. సముద్రమున చేరిన పుణ్యనదుల రూపనామరుచులు ఎట్లు తెలియవో సమాధిలో చేరిన ఏ అంగసాధన కూడ రూప, నామ, సారములు తెలియకుండును. అదియే సమాధి. సేవకుడూ సేవగాని,ధ్యానము,ధ్యానపరుడుకానీ,రెండునుతెలియకుండును.తను అను భావమే. చేయుట అను భావమే యుండదు. సేప్యుడొక్కడే, అభావమొక్కటియే అంతతప్ప అన్యము గోచరించదు. అట్లు అన్యము గోచరించుచున్న ఆది సమాధి అనబడదు. స్వప్న మనబడును. బ్రహ్మము తప్ప అన్యము లేనిదే సమాధి. అందులోని లీనభావము సమాధి.
(ప్ర.వా.పు.77/88)