అహింసా ప్రథమం పుష్పం పుష్ప మింద్రియనిగ్రహం
సర్వభూత దయాపుష్పం క్షమాపుష్పం విశేషతః
శాంతిపుష్పం తపఃపుష్పం ధ్యానపుష్పం తధైవచ
సత్య మష్టవిధం పుష్పం విష్ణో: ప్రీతికరం భవేత్.
ప్రేమస్వరూపులారా ! భగవంతుడు మీనుండి ఆశించునది షోడశోపచారములు కాదు; అష్టాదశ పురాణపఠనం కాదు; పవిత్రమైన అష్టవిధ పుష్పములను మాత్రమే తాను మీనుండి ఆశిస్తున్నాడు. ఆ అష్టవిధ పుష్పములు ఎలాంటివి?
మొదటిది అహింసాపుష్పం. మనోవాక్కాయములతో ఏ జీవిని హింసించకుండా ఉండటమే అహింస. కొందరు కూరగాయలను కోయటం హింస కాదా? అని ప్రశ్నిస్తారు. అది హింస కాదు. ఎందుకంటే, వాటికి బాధ తెలియదు. కొన్ని చెట్లలో కాయ కోసినచోటినుండి నీరు కారుతుంది. దానిని చూసి కొందరు "అయ్యో పాపం, కాయను కోయటంచేత చెట్టు ఏడుస్తుంది," అనుకుంటారు. కాని, అది ప్రకృతి సహజమైన ప్రక్రియయేగాని, శోకబాష్పము కాదు. మనుష్యులకు మాత్రమే అన్నమయకోశము, ప్రాణమయకోశము, మనోమయకోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయకోశము అనే పంచకోశము లున్నాయి. మనస్సున్న వారికే సుఖదుఃఖములుంటాయి. మానవునికి, పశుపక్షి మృగాదులకు, క్రిమికీటకాదులకు మాత్రమే మనస్సుంది. కూరగాయలకు, వృక్షములకు ప్రాణముందిగాని, మనస్సు లేదు. కనుక, వాటికి బాధ తెలియదు.
రెండవ పుష్పం ఇంద్రియనిగ్రహం. ఇంద్రియ నిగ్రహం లేకుండా ఎన్ని సాధనలు చేసినప్పటికీ అవి నిరుపయోగమై పోతాయి. ఇంద్రియాలలో మొట్టమొదట అనేక రుచులకు అలవాటు పడిన జిహ్వను అరికట్టుకోవాలి. "హే జిహ్వా! నీవు పుట్టినప్పటి నుండి ఎన్ని బస్తాల గోధుమలు తిన్నావో, ఎన్ని పిండి పదార్థములను ఆరగించావో, ఎన్ని కూరగాయలను భుజించావో! ఇంకనూ నీకు తృప్తి లేదా?" అని మందలించాలి. గోవిందా, దామోదరా, మాధవా అనే మధురాక్షరములను ఉచ్చరించుమని బోధించాలి. "భిక్షాన్నం దేహరక్షార్థం", దేహరక్షణకోసం భుజించాలి; ఆకలి వేస్తే భుజించాలి. అంతే గాని, రుచులకోసం భుజించకూడదు.
మూడవది సర్వభూత దయాపుష్పం. సర్వ ప్రాణుల పట్ల దయ కలిగియుండాలి. ఎవ్వరిని ద్వేషించరాదు. దీనినే భగవద్గీత "అద్వేష్టా సర్వ భూతానాం," అన్నది. అందరి పట్ల ప్రేమతో జీవించాలి. అబూబెనాదమ్ అనే వ్యక్తి నిరంతరము దీనులకు, దిక్కు లేనివారికి సేవలు సల్పుతూ ఉండేవాడు. ప్రతి రోజు బజారులో కనిపించే వృద్ధులకు, వికలాంగులకు సేవలు చేసి రాత్రి చాలా ఆలస్యంగా ఇంటికి చేరుకునేవాడు. ఒకనాటి రాత్రి అతను ఇంటికి చేరుకునే సరికి ఒక దేవతా స్త్రీ ఏదో వ్రాస్తూ కనిపించింది. కొంతసేపు వేచి, వినయవిధేయతలతో "అమ్మా! మీరెవరు? మీరు వ్రాసేదేమిటి?" అని ప్రశ్నించాడు. ఆమె "నాయనా! నేను దేవతా కన్యను. భగవంతుణ్ణి ఎవరు ప్రేమిస్తున్నారో వారి పేర్లు వ్రాస్తున్నాను." అంది. "అందులో నా పేరేమైనా ఉందా?" అని అడిగాడు. ఆమె లేదని సమాధానం చెప్పింది. మరునాటి రాత్రికూడా అతడు ఇంటికి చేరుకునే సరికి ఆ దేవతా కన్య మళ్ళీ ఏదో వ్రాస్తూ కనిపించింది. "అమ్మా! ఇప్పుడు మీరు వ్రాస్తున్నదేమిటి?" అని అడిగాడు. "నాయనా! నిన్న భగవంతుణ్ణి ఎవరు ప్రేమిస్తున్నారో వారి పేర్లు వ్రాశాను. ఇప్పుడు భగవంతుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో వారి పేర్లు వ్రాస్తున్నాను." అంది. "ఇందులోనైనా నా పేరు ఉన్నదా?" అని అడిగాడు. "ఈ లిస్టులో నీ పేరే ఫస్టు." అన్నది. దీని అంతరార్థమేమిటంటే, అన్ని పూజలకంటే పరులకు చేసే సేవయే గొప్పది. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాద సేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహ మాత్మనివేదనం - అనే నవవిధ భక్తి మార్గములు కంటె సేవయే చాలా గొప్పది. అబూబెనాదమ్ నిరంతరము పరులకు సేవ చేయటంచేతనే భగవత్ప్రేమకు పాత్రడైనాడు. భగవంతుడు లోకంలో అందరిని ప్రేమిస్తాడు. ప్రేమయే అతని స్వరూపము. అయితే, సర్వ భూతములపట్ల దయ కలిగి సేవ చేసేవారికి తనను తానే ఇచ్చుకుంటాడు.
నాల్గవది క్షమాపుష్పం. క్షమా పుష్పం విశేషతః అన్నారు. ఇది చాలా ప్రధానమైనది; భగవంతునికి అత్యంత ప్రీతికరమైనది. కౌరవులు తమను ఎంతగా బాధించినప్పటికీ, తమ ధర్మపత్నియైన ద్రౌపదిని నిండుసభలో పరాభవించినప్పుడు కూడా ధర్మజుడు ఏ మాత్రమూ క్షమను కోల్పోలేదు. ఆ క్షమయే పాండవులను రక్షించి, వారిని ఆదర్శప్రాయులుగా తనరారజేసింది.
ఐదవది శాంతిపుష్పం. ఎన్ని బాధలు కల్గినప్పటికీ, ఎన్ని ఆటంకములు ఎదురైనప్పటికీ శాంతం వహించాలి. త్యాగరాజు, ద్రౌపది, తుకారాంవంటి పరమభక్తులకు ఎన్ని బాధలో కలిగాయి. కాని, అన్నింటియందు వారు శాంతం వహించారు. శాంతము గలవారికే భగవత్కృప లభ్యమౌతుంది. త్యాగరాజు "శాంతము లేక సౌఖ్యము లేదు." అన్నాడు. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మానవునికి శాంతి కావాలి. అయితే, శాంతి ప్రాపంచిక విషయాలలో లేదు, వస్తు వాహనాదులలో లేదు. శాంతి మీయందే ఉన్నది. శాంతిపుష్పము మీ నుండియే ఆవిర్భవించాలి గాని, బయటనుండి లభించేది కాదు. ఈ ప్రాకృత జీవితంలో ఎన్నో ఇక్కట్లు కల్గుతుంటాయి. వాటిని మీరు లెక్కచేయకూడదు. మానవజన్మ పశుపక్షి మృగాదులవలె ప్రాకృతమైన సుఖాలను అనుభవించే నిమిత్తం రాలేదు. హృదయము నుండి ఆవిర్భవించే శాంతిని మీరు అనుభవించాలి.
నిండుసభలో ద్రౌపదికి పరాభవం జరుగుతున్నప్పుడు భీముడు ఉగ్రుడై గద తీసికొని దుశ్శాసమని పైకి పోయాడు. అప్పుడు ధర్మజుడు అడ్డుకొని "నాయనా! మనం ఓడిపోయినవారము, వారి స్వాధీనంలో ఉన్నవారము. మనకు వారితో యుద్ధం చేసే అధికారం లేదు. కాబట్టి, నీవు శాంతం వహించు. ఏనాటికైనా ధర్మమే జయిస్తుంది," అన్నాడు. ఇలాంటి శాంతము అందరికీ ప్రాప్తించదు. ఏ కొద్దిమందికో ప్రాప్తిస్తుంది. శాంతము గలవారికే దైవబలము చేకూరుతుంది. చిరకీర్తి లభిస్తుంది. కౌరవులు నూరుమంది పుట్టారు. పాండవులు ఐదుమందియే. కాని. పాండవులకీర్తి సమాజంలో శాశ్వతంగా నిలిచి పోయింది. ధర్మజుడంటే అందరికీ ప్రీతి. "ధర్మ-జ", ధర్మమునుండి పుట్టినవాడు అతను. ధర్మమును ఆచరించాడు కాబట్టే శాంతమును అనుభవించాడు. ఈనాడు ఎక్కడ చూసినా అధర్మమే. అసత్యమే. కనుకనే, అశాంతి, అలజడి చెలరేగుతున్నాయి.
ఆరవది తపఃపుష్పం. తపస్సనగా ఏమిటి? అడవులకు పోయి కందమూలాదులను భుజిస్తూ భగవంతుణ్ణి స్మరించటమా? అది నిజంగా తమస్సనే చెప్పవచ్చు. త్రికరణశుద్ధియే తపస్సు. “మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం" - అన్నారు. మనస్సును నిరంతరం దైవమునందు ఉంచాలి. సత్వరజస్తమో గుణములచేత మనో వాక్కాయములలో కలిగే ఉద్రేకములను అరికట్టాలి. సంతోషాన్ని, దుఃఖాన్ని, ఉత్సాహాన్ని, కోపాన్ని అరికట్టుకోవాలి. సుఖదు: ఖే సమేకృత్వా లాభాలాభా జయాజయౌ’, సుఖదుఃఖములను సమదృష్టితో స్వీకరించాలి. అదియే నిజమైన తపస్సు. ఏ సేవ చేసినా వాంఛారహితంగా చేయాలి. వాంఛారహితమైన భావమే తపస్సు.
ఏడవది ధ్యానపుష్పం, ధ్యానమంటే ఏమిటి? పద్మాసనం వేసుకొని, కన్నులు మూసుకొని భగవంతుణ్ణి స్మరించడమా? అది ప్రాకృతమైన ధ్యానము. అది కూడా అవసరమే. కాని, ధ్యాన మంటే అది కాదు. పాలలో నీరు ఏకమైనట్లు, మీ మనస్సు భగవంతునిలో లీనం కావాలి. నిప్పులో వేసిన ఇనుము పూర్తి నిప్పుగానే మారిపోతుంది. అట్లే, మీ మనస్సు భగవద్భావంలో ఏకమైపోవాలి. దీనినే "బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి", అన్నారు. ఉదయం, సాయంకాలం పద్మాసనం వేసుకొని ఏదో కొన్ని నిమిషాలు భగవచ్చింతన చేస్తే, అది ధ్యానమెలా అవుతుంది? సర్వదా సర్వ కాలేషు సర్వత్ర భగవచ్చింతన చేయాలి. ఏ పని చేసినా భగవంతుణ్ణి లక్ష్యంలో పెట్టుకోవాలి. అదియే నిజమైన ధ్యానము. ఏదో కొంత కాలపరిమితి పెట్టుకొని భగవంతుణ్ణి స్మరిస్తే అది పార్ట్-టైం" భక్తి అవుతుంది. ఆలాంటివారికి పార్ట్-టైం అనుగ్రహమే లభిస్తుంది. భగవదనుగ్రహం శాశ్వతంగా లభించాలంటే "ఫుల్-టైం భక్తిని అభివృద్ధిపరచుకోవాలి.
ఎనిమిదవది సత్యపుష్పం. ఇది చాలా ముఖ్యమైనది. ఈ ప్రపంచము సత్యము నుండియే పుట్టింది. సత్యముచేతనే పోషింపబడుతున్నది, సత్యమునందే ఐక్యమైపోతున్నది. త్రికాలాబాధ్యం సత్యం . ఎప్పటికీ మారనిది సత్యం.
ఎప్పటికీ ఉండునది సత్యం. సర్వమూ అంతర్థానమైనా సత్యం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. అట్టి సత్యమే భగవంతుడు. కనుక, మీరు సత్యముతోనే జీవించాలి. సత్యముతోనే అంత్యమైపోవాలి.
ఆ అష్టవిధ పుష్పములతో మీరు భగవంతుణ్ణి పూణించినప్పుడే భగవంతుడు వాటిని ప్రీతితో అందుకొని, మీరు కోరిన వరముల ననుగ్రహిస్తాడు. భగవంతునికి ప్రీతికరమైన పుష్పములను అర్పించకుండా, వాడి పోయే,రాలిపోయే,కాలిపోయే,కూలిపోయేపుష్పములను ఎన్ని అర్పించినా ప్రయోజనం లేదు.
(స. సా. సె.2000పు. 265/269)