మహాభారత యుద్ధ సమయంలో ఒకనాడు అశ్వత్థామ ఒక ప్రతిజ్ఞ పట్టాడు. ఈనాడు సూర్యాస్తమయంలోపలనే పాండవుల శిరస్సులు ఖండిస్తానన్నాడు. ఈ మాట విని ద్రౌపది కృష్ణుని వద్దకు వెళ్ళి "కృష్ణా! నాకు రాజ్యము అక్కరలేదుగాని, పతుల ప్రాణభిక్ష పెట్టు" అన్నది. కృష్ణుడు ద్రౌపది! ఇది నా చేత కాదు. అశ్వత్థామ మాటకు తిరుగు లేదు. దానిని మార్చుటకు ఎవరి తరమూ కాదు " అన్నాడు. అప్పుడు ద్రౌపది "కృష్ణా! నీకు చేతకానిది ఒకటున్నదా? ఏమైనా చేయగలవు, ఎన్నైనా చేయగలవు. నీకు చేతకానిది జగత్తులో ఒక్కటీ లేదు. సర్వమూ నీ హస్తమునందే ఉన్నది. సంకల్పించుకుంటే నీవు ఏమైనా చేయగలవు" అని పాదాలపై పడింది. కృష్ణుడు ఈ రాత్రికి రాత్రే పాండవు లైదు మందిని తీసుకుని దూర్వాసుని కుటీరానికి వెళ్ళాడు. వారిని బయట ఉంచి తాను మాత్రం లోపలికి ప్రవేశించాడు. భగవంతుడు భక్త రక్షణకు కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని నాటకములు ఆడవలసి వస్తుంది. భగవంతుడు యాక్టింగ్ చేయకపోతే ఈ నాటకానికి అందమే ఉండదు. కృష్ణుణ్ణి చూసి దూర్వాసుడు ఆనందంతో, "స్వామీ లోపలకు దయచేయండి" అని ఆహ్వానించాడు. కృష్ణుడు "దూర్వాసా! నేను వచ్చిన పని చాల కఠినమైన పని. నీవు నాకు సహాయం చేయాలి" అన్నాడు. దూర్వాసుడు "స్వామీ! ఏమైనా సహాయం చేస్తానుగాని, అసత్యమాడను" అన్నాడు. అప్పుడు కృష్ణుడు "దూర్వాసా! నేను మాత్రం నిచే అసత్యమాడిస్తానా? నేను దైవ స్వరూపుడను. “సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్. నబ్రూయాత్ సత్యమ ప్రియం". నేను సత్యమునే పలికేవాడను. కనుక, నిన్ను అసత్యమాడ మని ఎప్పుడూ బోధించను. కానీ, నా ప్లాను ఏమిటో నీవు చక్కగా విచారించి అర్థం చేసుకో. దానికి అనుగుణంగా ప్రవర్తించు. నా మనోభీష్టం నెరవేరుతుంది" అన్నాడు. దూర్వాసుడు "స్వామీ! మీకు కూడా ఒక భీష్టం ఉన్నదా? మీరు ఏది చేసినా, ఏమి చెప్పినా, ఏది చూసినా మా నిమిత్తమేగాని, మీ నిమిత్తం కాదు కదా. మీ అభీష్టమే నా అభీష్టము. కనుక, నేను ఏమి చేయాలో చెప్పండి" అన్నాడు. కృష్ణుడు అక్కడ పెద్ద గుంట త్రవ్వించాడు. దాని పైన ఒక పలక వేయించాడు. ఆ పలక పైన దూర్వాసుని సింహాసనం పెట్టాడు. "దూర్వాసా! నీవు ఇక్కడ కూర్చో పాండవులను ఈ క్రింది గుంటలో కూర్చోపెట్టు. ఆశ్వత్థామ వచ్చి పాండవు లెక్కడ అని ప్రశ్నిస్తాడు. నీవు అసత్యం చెప్పనక్కర లేదు. నా క్రిందనే ఉంటున్నారని చెప్పు. అయితే, సౌండు మాత్రం మార్చు "అన్నాడు. దూర్వాసుడు ముక్కోపి, అతని వాక్కు చాల కఠినంగా ఉండేది. అశ్వత్థాము పాండవుల కోసం అంతా వెతికాడు. కానీ, పాండపు లెక్కడా కనిపించలేదు. దూర్వాసుడు త్రికాలజ్ఞాని. కనుక, పాండవు లెక్కడున్నారో అతనిని అడిగితే తెలుస్తుందని అతని దగ్గరకు వచ్చాడు. “స్వామీ నమస్కారం" అన్నాడు. "ఏమి కావాలి?" అని అడిగాడు దూర్వాసుడు అశ్వత్థామ "పాండవు లెక్కడున్నారు?" అని అడిగాడు. దూర్వాసుడు కోపం నటిస్తూ "పాండవులా? నా క్రింద ఉన్నారు" అన్నాడు గట్టిగా. తాను సత్యమే చెప్పాడుగాని, సౌండు మార్చాడు. పాండవులను రక్షించే నిమిత్తమై దూర్వాసుడు ఆవిధంగా సౌండు మార్చాడేగాని, అసత్యం చెప్పలేదు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
భగవంతుడు అవతరించేది సాధువులను రక్షించేకోసం కాదు, సాధుత్వాన్ని రక్షించే కోసమని. అందరియందూ సాధుత్వమున్నది. ధర్మానికి నాశనమే లేదు. నశించేది అయితే అది ధర్మం ఎట్లా అవుతుంది? ఏ యుగమందైనా ధర్మం నాశనం కావటానికి వీలుకాదు. ధర్మము ఉంటుంది. కానీ, మరుగున పడిపోతుంది. ఆ మరుగునపడిన దానిని తీయుటయే అవతార లక్షణము.
(సా.శు.పు.33/35)