ఈనాడు దేశములో ఉన్న అశాంతి అక్రమాలకు,అనాచారములకు,అసత్యమునకు,అధర్మమునకుమనమే కారణము. ఎంత చదువుండినప్పటికీ చదువుకు మానవత్వమున కే మాత్రము సంబంధము లేదు. నైతిక రాజకీయ వైజ్ఞానిక, ఆర్ధిక పరివర్తనలన్నిటి కంటే మానసిక పరివర్తనే ప్రధానమైనది. మనస్సు మార్చుకొనకుండా ఏది మార్చినా జగత్తు బాగుపడదు. స్వయం తీర్ణః పరాం తారయతి అన్నారు. తాను తరించి పరులను తరింపజేయువాడే మానవుడు. మనకు ఎన్నో సుఖదుఃఖముల కష్టనష్టములు వస్తుంటాయి. కాని, ఇవన్నీ కదలి పోయే మేఘముల వంటివి. శాశ్వతమైనవి కావు. ఇట్టి అశాశ్వతమైన వాటి కోసం మన మెందుకు విచారించడం? ఏనాటికైనా మనం ఇవన్నీ త్యజించవలసిందే, తప్పదు. కనుకనే మానవత్వములో ఉన్న యధార్థ స్వరూపాన్ని గుర్తించాలి. నీవు ఒక్క మానవుడవు మాత్రమే కాదు. నీవు ఒక్కటిగా మాత్రమే రూపమును ధరించలేదు. దేహరీతిగా నీవు ఒక రూపనామమును ధరించవచ్చును. మానసికరీతిగా మంచి చెడ్డ పేరు పొందవచ్చును. కాని, ఆత్మరీతిగా నీవు సాక్షీభూతుడవుగా ఉంటున్నావు. నీవు సాక్షీభూతుడవైన మానవుడవు, అన్యాయ, అక్రమ, అధర్మములకు మనమే మూలకారణముగా ఉంటున్నాము. మనలను పరిపాలన చేసే ప్రభుత్వ దోషము కూడా లేదు. ప్రజల దోషమే ప్రధానముగా రూపొందుతున్నది. ప్రజలు వోటులోనే ప్రభుత్వము ఏర్పడుతున్నది. కనుక ప్రజలలోనే ఉంటున్నది మంచి చెడ్డలు.
ఒక చిన్న ఉదాహరణ. ఎక్కడ చూచినప్పటికీ అవినీతి, అవినీతి అంటున్నారు. ఈ దేశంలో అవినీతి ఎప్పుడు అంతమొందుతుంది? అని అందరూ అడుగుతుంటారు. ఈ అవినీతికి ఎవరు కారణం? ప్రభుత్వమా కారణం? కాదు, వ్యాపారస్థులే దీనికి మూలకారణం. వాళ్ళ స్వార్థము, స్వప్రయోజనములను ఫలింపజేసుకోవడం కోసమని అన్ని విధముల అధికారులకు అందిస్తూ వాళ్ళను పెద్దగా చేసుకొంటూ వస్తున్నారు. మీరు నీతి నిజాయితీలతో జీవిస్తే ఈ అవినీతి క్షణంలో పోతుంది. ధనాశ లేని మానవులు లోకంలో లేరు. ఇచ్చే వాడిని చూస్తే చచ్చేవాడు కూడా లేచి వస్తాడని ఒక సామెత. మన మిస్తుంటే అధికారులు పుచ్చుకోక ఏంచేస్తారు? కనుక మన వ్యాపారం - మన ఆదాయం ఒక పరిమితిలో పెట్టుకుంటే జగత్తంతా నిత్యకల్యాణం పచ్చతోరణంగా కళకళలాడుతుంది. నీతిని హృదయంలో ప్రధానంగా పెట్టుకొని దివ్యమైన భావంలో ఆదాయానికి ఒక హద్దు పరిమితి పెట్టుకుంటే మీకు, సమాజమునకు, దేశమునకు శాంతి భద్రతలు సమకూరుతాయి.కాని,ఈనాడుప్రతివాడు. నాకు కావాలి నాకు కావాలి అన్నపాటే వచ్చింది పోతే పోయిందే అని ఏడుస్తారు. నిరంతరము స్థిరచిత్తుడుగా ఉండాలి. - సంకుచితత్వాన్ని పెంచుకోరాదు. మానవునికి మానవునికి మధ్య నున్న సంబంధ బాంధవ్యాన్ని పెంచుకొంటూ రావాలి. ఇలాంటి విశాలమైన భావాన్ని పెంచుకుంటూ వచ్చనప్పుడే దివ్యత్వమైన భావాన్ని తాను కూడా అనుభవించగలడు.
(వ.1984 పు. 85/86)