దైవత్వము మానవాకారము ధరించినంత మాత్రమున అలక్ష్యంగా చూడటం మంచిది కాదు.
చిక్కిన అవకాశము దక్కించుకొని దన్యులు కావటానికి
కృషి చేయాలి. తిరిగి చిక్కేది కాదు.
చిక్కిన సాయిని వక్కలేయక చక్కచేసుకోండి.
పోయిన చిక్కడు పరీశుని పాదసేవయండి
భక్తిని పెంచి శక్తిని ఇచ్చి ముక్తి ఇచ్చునండి
ఏక మనసుతో నమ్మి సాయిని ఎంచి కొలవండి.
ఇతరుల మాటలు ఇంపుగ విని కొంప తీయకండి.
చెడుమార్గములో మీరు జీవితము నాశనము చేసుకోకండి.
అవకాశమును సద్వినియోగం చేసుకోండి. సన్మార్గములో ప్రవేశించండి. ఆనందమును అనుభవించండి. దివ్యమైన భారతదేశము. పవిత్రమైన భారతదేశము. భగవదవతారములు కలిగిన దేశము. పుణ్యభూమి. యోగభూమి, త్యాగభూమి అని లోకమునకు చాటండి. ఈ విధమైన ప్రచారము చేయటమే మీ ప్రధానమైన సేవగా భావించాలి. సేవ అంటే ఏమిటి? గ్రామాలు ఊడ్చటం, రోడ్లు వేయటము కాదు. సేవ. భగవత్సేవ సత్సంకల్పములు అలవరచుకుంటే అదే సేవ, భగవంతుని కేది ఇష్టమో దానిని మీరు అనుసరించండి. భగవంతుడు కోరేది ఒక్కటే. ధన కనక వస్తువాహనాదులు కోరడు. - నిర్మలమైన విశ్చలమైన, నిస్వార్థమైన ప్రేమను మాత్రమే కోరుతున్నాడు. ఈ ప్రేమకు ఎంతైనా తిరిగి బదులు ఇస్తాడు భగవంతుడు. అయితే ప్రతిఫలము నిమిత్తము ప్రేమిస్తే అది వ్యాపారంగా మారుతుంది.’ఓ భగవంతుడా! రెండు కొబ్బరికాయలు కొడతాను అని కండిషన్ పెట్టకూడదు. భగవంతుడు కోరేది ఒక్కటే. అదే నిశ్చలమైన నిర్మలమైన ప్రేమ. ప్రపంచమే ఇందులో లీనమై ఉంటున్నది. ఆ విధమైన భావాన్ని మీరు అభివృద్ధి పరచుకొని, గోపి గోపాలుర భక్తి పవిత్రమైన భక్తిగా మీరు విశ్వసించి అందులో వేయింట ఒక భాగమైన మీరు అనుభవించటానికి కృషి చేయండి.
(భ.స. మ. పు.151)
(చూ|| దివ్య ప్రకటనలు)