పొలమును దుక్కి దున్ని. నారు పెట్టి, నీరు పోసి, కలుపు మొక్కలను పెరికివేసి, సాగు చేసినప్పుడే పంటధాన్యమును అందుకోగలవు. ఎఱువు వేయక, నారు పెట్టక, నీరు పోయక, పొలమును దున్నక కేవలం విత్తనాలు నాటిన ఏమీ ప్రయోజనం లేదు. అదేవిధంగా, చతుర్విధ పురుషార్థములను సాధించవలెనన్న నవవిధ భక్తి మార్గముల ననుసరించవలెనన్న అష్టాంగయోగముల నభ్యసింప వలెనన్న ఏతా వాతా ఏ ఆధ్యాత్మిక సాధన సల్పవలెనన్నను ప్రధానంగా నాల్గు గుణములను అలవర్చుకోవాలి. అప్పుడే సాధనకు తగిన ఫలితాన్ని పొందగలవు. ఆనందాన్ని శాంతిని, సంతృప్తిని అందుకోగలవు. ఏమిటా నాల్గు గుణములు? మొదటిది మైత్రి, రెండవది కరుణ, మూడవది ముదిత, నాలవది తితీక్ష..
మొదటిది మైత్రి. నీ వయస్సుకు నీ సంపదకు, నీ - ఆరోగ్యమునకు, నీ చదువుకు నీ పరిస్థితికి తగినవారిలోనే నీవు స్నేహం చేయాలి. నీవు అధికులతో స్నేహం చేస్తే వారు నిన్ను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తారు. నీకంటే చిన్నవారితో స్నేహం చేస్తే నీవు వారిని అదుపులో పెట్టే ప్రయత్నం చేయవచ్చు. తద్వారా స్నేహం చెడిపోతుంది. కనుక, సమానులతోనే స్నేహం చేయాలి. ఇతరులకు కీడు చేసేవారితోను, దురాలోచనలతో, దుష్ప్రవర్తనతో మెలగే వ్యక్తులతోను స్నేహం చేయకూడదు. రెండవది కరుణ. దీనిని ఇష్టం వచ్చినట్లుగా ప్రసరింపజేయకూడదు. నీకంటెచిన్నవారిపైన,వయస్సునందు,సంపదయందు,ఆరోగ్యమునందు,పరిస్థితులందు తక్కువ స్థాయిలో ఉన్న వారి పైన నీ కరుణను ప్రసరింపజేయాలి. దీనివల్ల కరుణ యొక్క విలువ పెరిగి స్థాయి బలపడుతుంది.
మూడవది ముదిత. నీకంటె అధికులను చూసి అసూయ పడకుండా, వారిపట్ల ఎట్టి దుర్భావములకు చోటివ్వకుండా వారి అభివృద్ధిని చూసి ఆనందించడమే "ముదిత అని చెప్పవచ్చు. నాల్గవది తితీక్ష.అనగా,సుఖదుఃఖములపట్ల, నిందాస్తుతులపట్ల, లాభనష్టములపట్లసమదృష్టి వహించడం. ఈ నాల్గింటిని ఆచరిస్తే పురుషార్థములను సాధించినట్లే. వీటిని అలవర్చుకోవడానికి చిత్తశుద్ధి అవసరం. ప్రతి జీవియందు ఉన్నది భగవంతు డొక్కడే అనే విశ్వాసాన్ని అభివృద్ధి పర్చుకుంటే చిత్తశుద్ధి కల్గుతుంది. చంచలత్వానికి కారణములైన రజోగుణ తమోగుణములను దూరం చేసుకుని నిశ్చలత్వాన్ని సాధించాలి. పాత్రలోని జలము మలినంగా ఉన్నప్పుడు అందులో సూర్యుని ప్రతిబింబం సరిగా కనిపించదు. కదిలే జలములో ప్రతిబింబము కూడా కదిలినట్లుగా కనిపిస్తుంది. పాత్రలోని నీరు పరిశుద్ధంగా, నిశ్చలంగా ఉన్నప్పుడే అందులో సూర్యుని యొక్క ప్రతిబింబమును చక్కగా దర్శించగల్గుతావు. నీ దేహమే ఒక పాత్ర, మనస్సే జలము, ఆత్మయే సూర్యుడు. తామసిక మనస్సును మలిన జలములోను, రాజసిక మనస్సును కదిలే జలముతోను, సాత్విక మనస్సును పరిశుద్ధ జలముతోను పోల్చవచ్చును. అందరియందు ఒకే ఆత్మ ఉన్నప్పటికీ ఉపాధి భేదముచేత నీవు నిశ్చలత్వమును. నిర్మలత్వమును సాధించలేకపోతున్నావు. నీయందున్న దోషములను, ఇతరులయందున్న మంచిని గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే నీ మనస్సు పరిశుద్ధం కాగలదు. దోమతెర వేసుకుంటే దోమలు నిన్ను బాధించవు. కానీ, దోమతెరలోనే దోమలు చేరితే దోషం ఎవరిది? కనుక, మొట్టమొదట నీలో దోషములు లేకుండా చూసుకో, ఇక్కడ మరొక విషయాన్ని నీవు గమనించాలి. ఆధ్యాత్మిక సాధనలు నీ భక్తి ప్రపత్తులను నిలబెట్టే నిమిత్తమై ఏర్పడినవని గుర్తుంచుకోవాలి. స్వార్థస్వప్రయోజనముల నిమిత్తమై చేసే సాధనలు ఆనందాన్ని, శాంతిని, సంతృప్తిని ప్రసాదించలేవు. అప్పుడు నీవు దేనిని స్థిరంగా, నియమం ప్రకారం చేయలేవు. రామాయణం దీనిని చక్కగా వివరించింది. కేకయ రాజ్యము నుండి తిరిగి వచ్చిన భరతుడు దశరథుని మరణవార్తను విని, తల్లియైన కైక వద్దకు వచ్చి కారణమడిగాడు. దానికి సమాధానంగా కైక "నాయనా! దీనికి నేనే కారణం. నీ ఉన్నతి నిమిత్తమై, నిన్ను రాజాను చేయదలచి నేను ఈ కోరిక కోరినాను. రామ వియోగముచేత నీ తండ్రి మరణించినాడు" అన్నది. ఆమె దృష్టికి ఈ కోరిక చాల గొప్పదిగా అనిపించింది. కానీ, భరతునికి అది చాల కఠినంగా తోచింది. వెంటనే తల్లితో
“క్రూరురాలా! చెట్టును కొట్టి కొమ్మలను నాటడానికి ప్రయత్నిస్తున్నావు. ఇది బుద్ధిహీనుల లక్షణం" అన్నాడు. అదేరీతిగా ఈనాటి మానవుడు దైవత్వమనే చెట్టును త్రుంచి, ప్రకృతి తత్త్యమనే కొమ్మలను నాటుతున్నాడు. భక్తి ప్రపత్తులు లేని సాధనలు మిక్కిలి హేయమైనవి. అలాంటి సాధనలు సత్ఫలితాలను అందించలేవు. మైత్రి, కరుణ, ముదిత, తితిక్ష అనే సద్గుణాలు లేకపోతే సాధనలు సంతృప్తిని, శాంతిని ఆనందమును అందించలేవు. కనుక, ఆధ్యాత్మిక సాధనలకు ముందుగా ఈ మూలసూత్రాలను అలవర్చుకోవాలి.
(సపా.ఆ. 99 పు. 279/280)