అస్థిరం జీవనం లోకే, అస్థిరం యౌవనం ధనమ్
అస్థిరం దారాపుత్రాది, ధర్మ: కీర్తిద్వయం స్థిరమ్.
ఏమి తాకొని వచ్చె ఏమితా కొనిపోవు
పుట్టునపుడు తాను గిట్టునపుడు
ధనము ఎచటి కేగు తా నేగు నెచటికి
చెప్పరయ్య మీరె చిత్త మొప్పు.
మనము జీవించు లోకము స్థిరమైనది కాదు. యౌవనము మధ్యలో వచ్చి మధ్యలో పోయేది. ఇట్టి మిడిమేలపు యౌవనమును చూచి మిడిసి పోవటం విద్యావంతుల లక్షణము కాదు. ధనమా! స్థిరమైనది కాదు. ఇది వదిలిపోయే మేఘముల వంటిది. ఇక దారాపుత్రాదులు. మధ్యలో ఆదరించి మధ్యలో విడిపోయేవారే. పెండ్లికి పూర్వము భార్య ఎవరు? భర్త ఎవరు? తెలియదు. మధ్యలో వచ్చి, మధ్యలోనే ఒకరినొకరికి వియోగము సంభవిస్తుంటాది. బిడ్డలు అంతే. పుట్టక పూర్వము తల్లి ఎవరు? బిడ్డ ఎవరు? పుట్టిన తరువాతనే ఈ విధమైన సంబంధ బాంధవ్యములు. ఇవి అన్నీ అస్థిరములే. మరి స్థిరమైనది ఏమిటి? ధర్మము, కీర్తి. ఇవి రెండే మానవులకు స్థిరమైనవి.
(బృత్ర.పు. ౧౫౮ )
(చూ॥ త్యాగము)