మీలో అహంకారం లేశమైనా మిగిలిపోరాదు. అంతదాకా మీరు భగవంతుని స్పష్టంగా దర్శించలేరు. అహంకారం ఒక అడ్డుతెర. “నాదేమీ లేదు, అంతా ఆయనదే” అని నిరంతరం భావించుకుంటే అహంకారం నశిస్తుంది. “నన్ను ఆడించే శక్తి ఆయన, నేను కేవలం ఒక పరికరమును” అని తలపోస్తూ ఉండాలి. ఆయన నామం నాలుకమీద నిత్యమూ నాట్యమాడాలి. కదిలే ప్రతి ఆకారంలోనూ భగవంతుని రూపం గుర్తించండి. ఇతరుల గురించి చెడు మాటలు చెప్పకండి. ఇతరుల్లోని మంచినే గమనించండి. ఇతరులకు సహాయం చేయటానికి, ఓదార్చటానికి, ఆధ్యాత్మికమార్గంలో పురోగమించుటకు ప్రోత్సాహపరచటానికి అవకాశం కోసం ఎదురుచూడండి. నమ్రత అలవరచుకోండి. మీ సమస్త భౌతిక సంపదలనూ, మానసిక శక్తులనూ, బుద్ధిగతమైన వివిధ కౌశలములనూ భగవంతునికి సమర్పితం చేయండి. ఈశ్వర సేవకే సర్వమూ వినియోగించండి. అప్పుడు మీ అహంకారం రూపుమాసిపోగలదు.- బాబా (సనాతన సారథి, జనవరి 2022 పు23)