మానవ దేహమే ఒక యంత్రము, హృదయమే ఒక తంత్రము, శ్వాసయే మంత్రము. అదే సోఽహం , సోఽహం అనే మంత్రము. సోఽహం అనగా నేనే దైవం దీనిని మించిన మంత్రము మరొకటి లేదు. ఈ పవిత్రమైన మంత్రాన్ని స్మరించుకుంటూ పవిత్రమైన జీవితాన్ని గడపండి. సమాజమనే పెద్ద రైలులో దీర్ఘ ప్రయాణం చేసేవారు యువతీ యువకులే. మిగిలిన వారు ప్రక్క స్టేషన్లలో దిగిపోతుంటారు. కనుక, సమాజానికి శాంతి, భద్రతలను చేకూర్చవలసిన బాధ్యత యువతీ యువకులదే. భగవన్నామమనే బీజాన్ని ప్రతి హృదయంలో నాటండి. అందరూ దైవ నామాన్ని స్మరించాలి. దైవత్వాన్ని వరించాలి. అప్పుడే అందరూ ఆనందంగా ఉంటారు. ఈ ప్రపంచమే స్వర్గంగా మారిపోతుంది. అలాంటి అమృతమయమైన జీవితాన్నిగడపండి.ఉపనిషత్తులు"శృణ్వంతువిశ్వే అమృతస్య పుత్రః" అన్నాయి. మానవుణ్ణి "ఓ అమృత పుత్రుడా" అని సంబోధించాయి. మీరందరూ అమృత పుత్రులే. అనృత పుత్రులుగా మారకండి. పేరుకు తగిన సార్థకతను నిలబెట్టుకోండి.
(స.సా.జా, 99 పు. 62)
మానవుడిని అమృతస్యపుత్ర: అన్నారు. అమృతపుత్రుడు మానవుడు. ఈ నిజతత్త్యాన్ని గుర్తించుకొనలేక అనృత పుత్రుడు గా మారిపోతున్నాడు. కాని మనం అనృత పుత్రులం కాకూడదు. అమృత పుత్రులమే కావాలి. మనం దైవాంశసంభూతులం కాకూడదు. దైవములమే కావాలి. మనలో ఉండవలసినది. ప్రేమాంశముకాదు. ప్రేమయే మనం అభివృద్ధి పరచుకోవాలి. ఇట్టి ప్రేమ తత్వాన్ని మనం అనుభవించి నప్పుడే, పరమాత్మ తత్త్వమును మనం సులభంగా గాంచవచ్చును.
(శ్రీ. సె.2000 పు.8)
మీలో ప్రతి ఒక్కరును ఇనుప కండరములను, ఉక్కు నరములను కలిగిఉండవలెను! దౌర్బల్యము అనునది - ఏమాత్రం లేని వీరులుగా ధీరులుగా ఉండవలెను. మేము నీచులం తక్కువ వారం అన్నభావం ఎన్నడూ చెంతకు రానీయకండి. మేము పాపాత్ములము అను భావం తగదు. మీరు ఎన్నటికీ పాపాత్ములు కారు. మీరు అమృతాత్ములు. అమృత పుత్రులు.మీ హృదయము నందు భగవంతుడు అధిష్టించి యున్నాడు. కావున మీరు పాపులు పాపాత్ములు ఎన్నటికీ కారు!
(దే.యు.పు.36)
(చూ! బ్రహ్మస్వరూపుడు)