మానవుని దేహమందు ప్రాముఖ్యమయిన ఆరు నాడీ కేంద్రములు వున్నవి. అవి కమలాకారమును చెంది వుండును. ఆ ఆరు కమలాకారములు చేరి మొత్తము యేబది రెండు రేఖలు వుండును. ఒకొక్క రేఖపై కూడా ఒకొక్క అక్షరము యేర్పడి యుండును. వాయించు హార్మోనియంలో వుండు రీడ్సు " వలె ఒక్కొక్క రేఖయు కదలు సమయమున ఒక్కొక్క విధమైన శబ్దము బహిర్గతమగుచుండును. ఇచ్చట బుద్ధిమంతులకు ఒక సందేహము కలుగవచ్చును. ఈ రేఖలందలి అక్షరములు కదలవలెనన్న యేదో ఒక కదలించు శక్తి ఆధారమై యుండవలెను కదా! అది నిజమే. ఆ కదలించు శక్తియే ప్రణవము. ఇది అనాహతమైన ధ్వని. ఇది అప్రయత్నముతో కలగునని ప్రయత్నములతో కలిగే ధ్వనిని ఆహత ధ్వని అందురు.
దారములో పూసలు గ్రుచ్చబడినట్లు అనాహత ధ్వనియైన ప్రణవములో వేదములనెడి పూసలు గ్రుచ్చబడినవి. రసస్వరూపమైన తనలో జలము చేర్చబడినది. ఇట్టి సర్వాధారమైన ప్రణవములోనే మనసును లీనము చేయవలెనని కృష్ణపరమాత్మ యొక్క బోధ. శబ్దములో మనసును లయముచేసే స్వభావము కలదు. మనసు యేది చూచిన
అది అంతా కావాలని కోరును. ప్రతిదానిని ఆశించడమే దానికి పని. అట్టిచంచల మనసును శబ్దమున లయము చేయవచ్చును. అందు వలననే మనసును - సర్పముతొ పోల్చిరి.
(గీ పు. 105/106)