ఏడు సంవత్సరాల చిరుప్రాయంలోనే బాలబాబా పుట్టపర్తి గ్రామంలో పాండురంగ భజన మండలిని స్థాపించి, తాము స్వయంగా పాటలు రచించి ఇతర పిల్లలకు నేర్పించి పాడించేవారు. సాయంసంధ్యవేళలో గ్రామంలో పండరి భజనలు జరిగేవి. ఇంక వేరే కార్యక్రమాలేవీ ఉండేవి కావు. కరణం సుబ్బమ్మగారు పిల్లలకు పండ్లు, బొరుగులు ప్రసాదంగా పంచేవారు. దాదాపు 20 మంది పిల్లలు పండరి భజన గ్రూపులో ఉండేవారు. కాళ్ళకు గజ్జెలు తొడిగి, చేత జెండాలు పుచ్చుకొని భజనలో పాల్గొనేవారు. షర్టు, నిక్కరు, టవలు, స్కా ర్ఫు లను పసుపు సున్నం కలిపిన నీళ్ళలో తడిపి కాషాయరంగు వచ్చేలా చేసి ధరించేవారు. టవలును నడుముకు బిగించేవారు.
“కాషాయవస్త్రములె కట్టి
కరతాళములను చేతబట్టి
దట్టీలను నడుముకు కట్టి
కామక్రోధములను కొట్టి
పండరీ మార్గము పట్టి
జైజై రంగా జైజై రంగా
జైజైయనుచు రయమున రండి”
అని పాడుతూ పిల్లలు ప్రొద్దున్నే వీధుల్లో వెళుతూ గ్రామస్తులను మేల్కొల్పేవారు. ఈరీతిగా బాబావారు నగర సంకీర్తనకు ఆనాడే నాంది పలికారు. ఈ పండరి భజనలు కర్నాటకనాగేపల్లి, కోవెలగుట్టపల్లి, కమ్మవారిపల్లి, వంటి పరిసర గ్రామాలకుకూడాబ్రాహ్మణపల్లి వ్యాపించాయి. పుట్టపర్తిలో పండరి భజనలను చూడటానికి ఇతర పల్లెలనుండి కూడా జనం వచ్చేవారు. గ్రామంలో కూడలివద్ద పాండురంగని ఫోటో పెట్టి భజన సల్పేవారు.
“భజనెళ్ళిపోవుచున్నది భక్తబృందముతోడ
భజనెళ్ళిపోవుచున్నది సాధుబృందముతోడ
భజనే ఆనందమయా శ్రీరంగనికి
భజనే గంభీరమయ్యా శ్రీరంగనికి”
"విఠలరాయుడవు విఠోబాదేవుడవు
వేణుగానలోలుడవు వన్నెకెక్కిన దేవుడవు
భక్తుల పాలి పండరిలోన
దేవుడవై నిలిచినావయ్యా”
"సాకేతపురి నిలయా స్వామి పండరినాథా
హరిహరి పండరినాథా జై సిరిగల పండరినాథా”
అని ఎంతో ఉత్సాహభరితంగా, ఉత్తేజకరంగా పిల్లలు పాడుతుంటే అందరూ తన్మయులైపోయేవారు. అంతా లయతాళబద్ధంగా ఉండాల్సిందే. తేడా వస్తే బాలబాబా దండించేవారు! పండరి భజన ఊళ్ళోకి వస్తున్నదంటే ఇళ్ళువాకిళ్ళు, వీధులు శుభ్రం చేసేవారు. భక్తి శ్రద్ధలతో మంగళ నీరాజనాలు సమర్పించేవారు. ఆ రోజుల్లో భయంకరంగా ప్రబలిన కలరావ్యాధి పుట్టపర్తి దరిదాపులకు రాలేదంటే పండరి భజనలే కారణమని గ్రామస్తుల విశ్వాసం. (సనాతన సారథి, జనవరి 2023 పు22-23)