సీతారామలక్ష్మణులు కొంతదూరం నడిచి శరభంగుని ఆశ్రమం చేరుకున్నారు. శరభంగుడు రాముని దర్శించాలని, వర్షపు చినుకులకై చకోర పక్షి వేచియున్నట్లుగా క్షణక్షణమూ ఎదురు చూస్తూ ఉన్నాడు. అంతకుముందు అనేక పర్యాయములుదేవదూతలు శరభంగుని స్వర్గమునకు గొనిపోవడానికి వచ్చారు. కాని, వెదుకబోయిన తీగ కాలికి చుట్టుకున్నట్లుగా, సాక్షాత్తూ శ్రీమన్నారాయణ మూర్తియే శ్రీరామునిగా అవతరించి దండకారణ్యంలో ప్రవేశించాడని తెలుసుకొని, అతడిని దర్శించాలని ఇంతకాలము ఓపిక పట్టుకొని జీవించాడు.రాముని దర్శించి, "రామా! నా జన్మ ధన్యమైనది. నిన్ను చూశాను, నీతో మాట్లాడాను. ఇంక నాకీ శరీరము అక్కరలేదు. ఈ జీవితాన్ని చాలిస్తాను” అని ప్రార్థించి వారి ఎదురుగానే చితి పేర్చుకున్నాడు. ముగ్గురికి నమస్కరించాడు. “మీరిక్కడ నివసించడానికి వీలుకాదు. తక్షణమే అగస్త్యాశ్రమం వెళ్ళండి" అని పలికి, వారు చూస్తుండగానే చితిలో పడి భస్మమైపోయాడు.
సీతారామలక్ష్మణులు అక్కడి నుండి బయలుదేరి మార్గమధ్యంలో సుతీక్ష్ణుని ఆశ్రమంలో ఒకరోజు గడిపి అగస్త్యాశ్రమం చేరుకున్నారు. శ్రీరాముడు సాక్షాత్ నారాయణ మూర్తియేనని ఋషులందరికి తెలుసు. కాని, జరుగవలసిన కార్యానికి ఆటంకము కలుగకూడదని ఆ రహస్యాన్ని ఎవ్వరికి చెప్పలేదు. అగస్త్యుడు కూడా వారిని తన ఆశ్రమలో ఉంచుకోవడం రామసంకల్పానికి విరుద్ధమని గుర్తించి, "రామా! ఇక్కడికి కొంత దూరంలో గోదావరి ఒడ్డున పంచవటి అనే ప్రదేశం ఉంది. అక్కడ చల్లని జలము, తీయని ఫలములు లభిస్తాయి. వాతావరణం కూడా సమశీతోష్ణంగా ఉంటుంది. కనుక, మీరు అక్కడ సుఖంగా జీవించవచ్చును అన్నాడు. అగస్త్యుని మాటలలో ఆంతర్యమేమిటి? వారు ముగ్గురూ తన ఆశ్రమంలోనే ఉంటే సీతాపహరణం జరుగదు. సీతాపహరణం జరుగక పోతే రాక్షస సంహారం జరుగదు. కనుకనే, వారిని తన ఆశ్రమం నుండి పంపివేయాలని అగస్త్యుడు ఈ ప్లాను వేశాడు. (శ్రీ భ ఉ పు 66-67)