చూసారా! దైవనిర్ణయాలు, దైవసంకల్పాలు, దైవం యొక్క అభీష్టాలు యింత రహస్యంగా ఉంటాయి. ధ్రువుడు తీవ్రమైన తపస్సు ఆచరించాడు.కానీ మనస్సు, క్రియలతో అతని వాక్కు యేకం కాలేదు. ఇంత చిన్నదాంట్లో ఓడిపోయాడు ధ్రువుడు. ఇంక సర్వమూ నీకే అర్పితమని నారాయణునికి వదలి పెట్టాడు. అప్పుడు నారాయణుడు చెప్పాడు, నాయనా! నా మాటను శిరసావహించు. తల్లి మాటను నీవు శిరసావహించావు. ఇప్పుడు భగవంతుడే నీకు తల్లి, తండ్రి, సర్వమూ. నీ వాక్యమును నీవు నెరవేర్చుకునే నిమిత్తమే నిన్ను పంపుతున్నాను. మారు మాటాడక నీవు వెళ్ళవలసిందే అన్నాడు. సరే, భగవదాజ్ఞను శిరసావహిస్తాను. దేనినైనా ఆచరిస్తాను అన్నాడు ధ్రువుడు. ఈ వాగ్దానం యిచ్చిన తరువాత నారాయణుడు అతనిని దగ్గరకు చేర్చుకున్నాడు. ధ్రువా! నీవు ఈ లోకమునకు చాటవలసింది ఎంతో ఉన్నది. దైవనామ మహిమను నీవు లోకానికి చాటాలి. ఇదిగో నేను నీలో ప్రవేశిస్తున్నాను అన్నాడు, నారాయణునినుండి ఒక జ్యోతి వెళ్లి ధ్రువునిలో చేరిపోయింది. ఇంతకాలం బలహీనంగా ఉన్న ధ్రువునియందు అమితమైన శక్తి ఆవిర్భవించింది. నమస్కారం చేసాడు. నారాయణుడు అంతర్థానమైనాడు. అశరీరవాణిగా ధ్రువునితో, ధ్రువా! నీవు అనేక సంవత్సరములు చక్రవర్తిగా పరిపాలన సర్పాలి. నీ తండ్రి యిప్పుడు చాలా పశ్చాత్తాపపడుతున్నాడు. అన్నపానాదులను వదలి నీ రా కకై నిరీక్షిస్తున్నాడు. వెళ్ళి రాజ్యపాలన గావించు. తరువాత నీవు ఉన్నతమైన స్థానం చేరుకుంటావు. సప్తఋషుల మధ్య, సూర్యచంద్రాదుల మధ్య అందరూ నీకు ప్రదక్షిణ చేసేటట్లు ధ్రువ నక్షత్రముగా నీకు స్థానమునందించాను. నీ అమృతస్వరూపునిగా, ఆనందస్వరూపునిగా జీవిస్తావు అన్నాడు. (దివ్యఙ్ఞాన దీపికలు ప్రథమ భాగము పు178)