పురుషార్థాల అవగాహన
శ్రీరామచంద్రుడు ధర్మార్థకామమోక్షములను చతుర్విధ పురుషార్ధములను రేండుగా మార్చుకుంటూ వచ్చాడు. ధర్మమును ఆధారం చేసుకొని, గమ్యమైన మోక్షమును ఆధేయంగా తీసుకున్నాడు. మోక్షమనునది పై అంతస్తు, అనగా పై మిద్దె. పైమిద్దె కెక్కుటకు నిచ్చెన కావాలి. మోక్షసౌధము నెక్కుటకు అర్థకామములు నిచ్చెన. ఆ నిచ్చెన నిల్చుటకు క్రింద ధర్మము అను భూమి ఆధారము. అర్థము, కామము అనునవి రెండును నిచ్చెన మెట్లు. ఆ మెట్లెక్కిపోతే మోక్షసౌధము చేరవచ్చును. అర్థము, కామము అను రెండును ధర్మముతోను మోక్షముతోను కూడినవేగాని ప్రత్యేకమైనవి కావు. దీనిని యింకా సులభంగా చెప్పాలను కొన్నప్పుడు, ధర్మార్థములు రెండూ ఒక్కటైనాయి. మోక్షకామములు రెండూ ఒక్కటైనాయి. ధర్మార్థమనగా ధర్మముచేత అర్థమును నీవు సంపాయించు. అంతేకాకుండా ధర్మముకోసమై నీవు ధనము ఆశించు. నీవు లోకాన్ని కామించ వద్దు, మోక్షాన్ని కామించు. మన కామము మోక్షమునకు సంబంధించినదిగా ఉండాలి. మన సంపాదనంతా ధర్మమునకు సంబంధించినదిగా ఉండాలి. (దివ్యఙ్ఞాన దీపికలు ప్రథమ భాగము పు 20)