ప్రతి తల్లి యొక్క గర్భము సమత్వంతో కూడిన భూమాత వంటిదే. అందులో తాను ఎట్టి సంకల్పమనే బీజమును నాటునో అట్టి సంకల్పానికి తగిన సంతానమే ప్రాప్తించును. గుణవంతులైన, ఆదర్శవంతులైన, సంస్కారవంతులైన సంతానం ప్రాప్తించవలెనన్న, దానికి పూర్వం తల్లిదండ్రులు కూడా తగిన సంస్కృతిని, సదాచారమును, సంప్రదాయాన్ని కలిగియుండాలి. అది ఆర్యాంబ భక్తి ప్రపత్తులతో కూడిన ఉత్తమ సంస్కారమును కలిగి యుండుటచేతనే ఆమె గర్భమున జగద్గురువైన ఆది శంకరులవారు జన్మించినారు. వివేకానందుడు కీర్తి ప్రతిష్ఠలను పొందుటకు కారణం అతని తల్లియొక్క సంస్కారమే. రామకృష్ణ పరమహంస పవిత్రమైన ప్రేమతత్త్వాన్ని ప్రచారం చేసి జగద్విఖ్యాతి గాంచుటకు మూలకారణం అతని తల్లి సద్గుణాలే. గాంధీ మహాత్ము డగుటకు మూలకారణం అతని తల్లియొక్క పవిత్ర సంకల్పమే.ఆనాటి తల్లులు ఎంతో పవిత్రమైన సంస్కారాన్ని కలిగియుండి దివ్యమైన భావాలతో నవ్యమైన గుణాలతో తాము అనేకవిధములైన ఆదర్శములను నిరూపిస్తూ వచ్చారు. నేటి తల్లిదండ్రులయితే నిద్ర లేచేటప్పుడు కూడా పోట్లాడుకుంటూ లేస్తుంటారు. తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే వారికి పుట్టిన పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు. ఎట్టి విత్తనమో అట్టి మొక్కలు తయారవుతాయి. కాబట్టి, ఆనాటి తల్లిదండ్రులయొక్క పవిత్ర భావాలను ఈనాటి తల్లిదండ్రులు అలవరుచుకోవటానికి కృషి చేయాలి.
తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు
ఆనాటి పవిత్ర హృదయులైన తల్లులు ఏది చెప్పినప్పటికీ అది తప్పకుండా జరిగేది. అలాంటి తల్లులు తమ పిల్లలను ఆశీర్వదించేటప్పుడు దైవం కూడా తథాస్తు తథాస్తు అనేవాడు. తల్లి ఆశీర్వాదబలంతోపాటు దైవానుగ్రహ బలం కూడా ఉండాలి. అప్పుడే విజయం ప్రాప్తిస్తుంది. కనుక, ప్రతి వ్యక్తి తన తల్లి హృదయాన్ని సంతృప్తి పరచటానికి ప్రయత్నించాలి. దయ, సహనము, శాంతి, సత్యము, సానుభూతి ఇత్యాది సద్గుణములను మొట్టమొదట నేర్పించేది తల్లియే. పవిత్ర హృదయులైన - తల్లుల అడుగుజాడల ననుసరించియే కుమారులు - గుణవంతులుగను, కీర్తివంతులుగను, మేధావంతులుగను అభివృద్ధి గాంచుతారు.
ప్రత్యక్షంగా, భౌతికంగా మిమ్మల్ని పోషించి అభివృద్ధికి తెచ్చేది మీ తల్లిదండ్రులే కానీ దైవం కాదు. ప్రత్యక్షంగా మీ కంటికి కనిపించేవారు మీ తల్లిదండ్రులు. అలాంటివారిని విస్మరించి, కంటికి కనిపించని విష్ణువును, శివుణ్ణి, రాముణ్ణి, కృష్ణుణ్ణి ఆరాధిస్తే ప్రయోజనం లేదు. మీ ఫుడ్డు,మీ హెడ్డు, మీ బ్లడ్డు, మీ దుడ్డు అంతా తల్లిదండ్రులయొక్క వరప్రసాదమే. వీటిని ఏ దేవుడూ మీకు ప్రత్యక్షంగా అందించటం లేదు కదా. కనుక, మొట్టమొదట మీ తల్లిదండ్రులను దైవాలుగా విశ్వసించండి. ప్రత్యక్షంగా కనిపించే తల్లిదండ్రులను ప్రేమించి, గౌరవించినప్పుడే పరోక్షమైన దైవత్వం మీకు సాక్షాత్కరిస్తుంది. తల్లి తండ్రిని చూపుతుంది. తండ్రి గురువును చూపుతాడు. గురువు దైవాన్ని చూపుతాడు. కనుకనే, తల్లి, తండ్రి, గురువు,దైవం... ఈ నలుగురిలో తల్లికి ప్రథమ స్థానం అందించబడింది. (సనాతన సారథి, మే 2022 పు.6-7)