రాముడు లంకను చేరి, రావణుని హతమార్చి, సీతను గొనివచ్చే నిమిత్తం సముద్రంపై వారధి నిర్మించాలని సంకల్పించుకున్నాడు. హనుమంతుడు, జాంబవంతుడు మొదలైన వానర వీరులు, “స్వామీ, ఒక్క నిమిషంలో మేము వారధి నిర్మిస్తాం”, అన్నారు. వానరులు వెళ్ళి కొండలనుండి పెద్ద పెద్ద బండరాళ్ళను పెకలించుకొని తెచ్చి సముద్రంలో వేశారు. కాని, అవన్నీ మునిగిపోయాయి. అప్పుడు లక్ష్మణుడు రామునితో, “అన్నా! ఈ జగత్తులో సృష్టింపబడిన సమస్త పదార్ధములుకూడను ఏదో ఒకనాటికి నాశనమయ్యేటటువంటివే; నదులుకూడను ఎండిపోయేటటు వంటివే; మానవ శరీరముకూడను రాలిపోయేటటు వంటిదే. పర్వతములుకూడను మునిగిపోయేటటు వంటివే; మునిగిపోనటువంటిది ఒక్కటే ఉన్నది. అదియే నీ నామము. అది సత్యమైనది, నిత్యమైనది. దానిని ఆధారం చేసుకొని వారధిని నిర్మిస్తే అది తప్పకుండా నిలుస్తుంది” అని అన్నాడు. రాముడు లక్ష్మణుని వీపు తట్టి, “లక్ష్మణా! నీవు సరియైన ఉపాయం చెప్పావు” అని అన్నాడు. హనుమంతుడు, “స్వామీ! ఆ పని మేము చేయగలము” అని అన్నాడు. అప్పుడు ఒక్కొక్క వానరుడు తెచ్చిన రాయిమీద రామ అని రాసి సముద్రంలో వేశారు.
రామనామ దివ్య మహిమచేత ఆ రాళ్ళన్నీ సముద్రంలో మునిగిపోకుండా పైకి తేలినాయి కాని, అలల తాకిడికి ఒక్కొక్క రాయి ఒక్కొక్కవైపుకు కొట్టుకొని పోసాగింది. అన్ని రాళ్ళూ ఒకదానితో ఒకటి చేరితేనే కదా వారధి ఏర్పడేది! అందుచేత వానరులు ఒకే రాయిమీద రామ అని రాయకుండా ఒకదాని పైన రా అనీ, మరొకదానిపైన మ అని రాసి భక్తి శ్రద్ధలతో సముద్రంలో వేశారు. అప్పుడా రాళ్ళన్నీ ఎక్కడెక్కడో కొట్టుకొనిపోకుండా ఒకదానితో ఒకటి చేరి వంతెనగా ఏర్పడ్డాయి. నిన్ను మునిగిపోకుండా కాపాడేది నామమొక్కటే!
ఆ రాళ్లు నీటి పై తేలడానికి ఆధారమేమిటి? రామనామమే! రామ అనే రెండక్షరములే ఆ రాళ్లను నీటి పై నిల్పినాయి. ఆ నామమయమైన వంతెనను ఆధారం చేసుకొని రాముడు లంకకు వెళ్లి రావణుని వధించాడు. నామమే సత్యము, నామమే నిత్యమని అప్పుడావిధంగా రాముడు బోధించాడు. రూపములన్నీ వృద్ధాప్యము పొంది కట్టకడపటికి నశిస్తుంటాయి. రూపములు ఏనాటికైననూ ఎప్పటికైననూ ఎక్కడైననూ మునిగిపోవలసినవే! ఎక్కడికి పోయినప్పటికీ నిన్ను మునిగిపోకుండా కాపాడేది నామమొక్కటే! అదియే శాశ్వతము. నామమును ఎవ్వరూ చెడపటానికిగాని, నాశనం చేయడానికిగాని నీనుండి దూరం చేయడానికి గాని వీలుకాదు. రామునికి సహాయం చేసిన విభీషణుడుకూడా చెప్పాడు, రామా! నీ నామమే సర్వమును సాధించింది అని. కనుక, రామనామాన్ని స్మరిస్తే చాలు, అన్నివిధాలుగా మనకు జయము కలుగుతుంది. " రామనామము, కృష్ణనామము, శివ నామము, హరినామము, హరనామము - ఇవన్నీ రెండక్షరాల నామములే. వీటిని ఆధారం చేసుకుంటే నీవు ఎంతటి ఘనకార్యమునైనా సాధించగలవు. కనుక, నీవు భగవన్నామమును నిరంతరం స్మరించాలి. ((శ్రీ సత్య సాయి వచనా మృ తము 2008 పు 71-73)