భజనలో అందరూ పాల్గొనాలి. భగవన్నామాన్ని స్మరించాలి. మీరు ఏ సాధనలూ చేయకపోయినప్పటికీ భగవన్నామాన్ని స్మరిస్తే చాలు. “భజన బినా సుఖ శాంతి నహీ”, శాంతి అనేది భజనవల్లనే లభిస్తుందిగాని మరొకదానివల్ల , లభించదు. “హరి నామ బినా ఆనంద నహీ. జపధ్యాన బినా సంయోగ నహీ”.
యోగమంటే ఏమిటి? ధ్యానమంటే ఏమిటి? ఏదో కళ్ళు మూసుకొని భగవంతుణ్ని స్మరిస్తూ కూర్చోవడం కాదు. ధ్యానమంటే నీ హృదయాన్ని భగవంతునితో చేర్చడం. నీవూ, దైవమూ ఏకమైపోవాలి. దీనిని పురస్కరించుకొనియే అర్ధనారీశ్వర స్వరూపాన్ని సృష్టించారు. ఒకటి ప్రకృతి, రెండవది పురుషుడు; ఒకటి జీవత్వము, రెండవది దైవత్వము. జీవబ్రహ్మైక్యానుసంధానమే నిజమైన ముక్తి. జీవుడున్నచోటే దేవుడున్నాడు. కాబట్టి, దేవునికోసం నీవు ఎక్కడికో పరుగెత్తనక్కర్లేదు. నేను జీవుడను అని నీవనుకోవద్దు; దేవుడను అని అనుకో. నిజంగా నీవు జీవుడవు కాదు. దేహాన్ని బట్టి నీవు జీవుడనని, దేవుడు వేరే ఉన్నాడని భావిస్తున్నావు. కాదు, కాదు. ఆత్మను బట్టి ఇరువురూ ఒక్కటే. ఈ హాలులో ఇన్ని దేహాలు ఉండినప్పటికీ అందరిలోనూ ఆత్మ ఒక్కటిగానే ఉన్నది. ఆకాశంలో సూర్యుడు ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్క సూర్యుడే ఇంత లోకానికి వెలుతురునందిస్తున్నాడు కదా! అదేరీతిగా, భగవంతుడు సూర్యునివంటి వాడు. ఆయనే అందరికీ వెలుగు నందిస్తాడు. కాని, మనం ఎవరినైనా దూషిస్తే మనలో చీకటి బయలుదేరుతుంది. కనుక, నీవు అందరినీ ప్రేమించు. అందరినీ సేవించు. అప్పుడు దైవమే నిన్ను కాపాడుతాడు. అట్టి దైవవిశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. చాలామంది దైవం లేడని అంటూంటారు. కాని, “దైవమే లేకపోతే నేనెక్కడినుండి వచ్చాను? నాకేది స్థానము?” అని తమను తాము ప్రశ్నించుకోరు. దైవ విశ్వాసమే లేకపోతే అన్నీ వ్యర్థమైపోతాయి. ((శ్రీ సత్య సాయి వచనా మృ తము 2008 పు 57-58)