సుగుణ యను ఒక గోపిక, ఒకనాటి సాయంసమయమున, దీపము ముట్టించుకొనుటకు, నందుని యింటికి వెళ్ళినది. ఆ యింటి దీపముతో, తమ దీపములు వెలిగించుకొనుట, ఆ యూరివారి కొక యాచారము. నందుడు గొప్పవాడనియు, గొప్పవారి యింటిదీపముతో తమ దీపములు వెలిగించుకొనుట శుభావహ మనియు వారి నమ్మకము. నందుని యింటిలో అడుగు పెట్టగనే, సుగుణకు, ఆ యింట కృష్ణుడాడిన యాటలు, ఆయన ముద్దుమాటలు, ఆయన మహిమలు, లీలలు - ఒక్కు మ్మడిగా మనసుకు వచ్చి, తన్ను తాను మరిచిపోయినది. ఆ మైమరపులో, వత్తికి బదులు తన వేలిని దీపశిఖమీద పెట్టినది. వ్రేలు కాలుచున్నను, ఆ భాధ ఆమెకు తెలియలేదు. యశోద చూచి, హెచ్చరించువరకును, ఆమె ఆ పారవశ్యములోనే యున్నది. అట్టి స్థితి తన్మయత్వ నునబడును. అది నిజమైన భక్తికి నిదర్శనము. ఆ స్థితిని ప్రతివారును పొందవలెను. పక్షిపిల్ల గూటిలో ఎంతకాలము పడియున్నను ప్రయోజనము లేదు. రెక్కలు బలపడి, ఆది యాకాశమున కెగిరిపోవలెను. అట్లే మానవుడును, ప్రపంచమను దుమ్ములో నెంతకాలము పొర్లాడుచుండినను వాని గతి యంతే. అతడును భక్తి, వైరాగ్యము - అను రెక్కలు సంపాదించుకొని, అతి దూరమున నున్న తన గమ్యస్థానమున కెగిరిపోవలెను.) ((శ్రీ సత్య సాయి వచనా మృ తము 1964 పు 263)