సీతారామలక్ష్మణులు చిత్రకూట పర్వతం పై నివసిస్తున్న సమయంలో ముగ్గురూ ఒకే కుటీరంలో నివసించేవారు. ముగ్గురిదీ చిన్న వయస్సే. ఐతే, లక్ష్మణుడు పవిత్ర హృదయుడు, సీతారాములను తన తల్లిదండ్రులుగా భావించి సేవిస్తూ వచ్చాడు. ఈ విషయం రామునికి తెలుసు. కానీ, ప్రపంచానికి కూడా తెలియాలి కదా! లక్ష్మణుని పవిత్రమైన ఆదర్శాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి రాముడు అతనికి ఒక పరీక్ష పెట్టాడు. అందులో సీతను కూడా ఒక పాత్ర వహించమని కోరాడు. లక్ష్మణుడు చాలా గుణవంతుడు. అలాంటి పవిత్రమైన గుణము ఏ సోదరునికీ ఉండదు. ఒకనాడు అతడు కందమూలాదులను తీసికొని రావటానికి అరణ్యంలోకి వెళ్ళాడు. ఆ సమయంలో రాముడు సీతను నిద్రించినట్లుగా నటించమన్నాడు. రాముడు ఒక చెట్టు క్రింద కూర్చుని సీత తలను తన తొడ పై పెట్టుకున్నాడు. కొద్ది సేపటికి లక్ష్మణుడు వచ్చాడు. రాముడు “లక్ష్మణా! ఆహారం తెచ్చావా? మంచిది. అక్కడ పెట్టు. నేను అత్యవసరంగా ఒక పనిపైన వెళ్ళాలి. నీవు సీత శిరస్సును నీ తొడపైన పెట్టుకుని ఆమెకు నిద్రాభంగం కలుగకుండా చూసుకో” అన్నాడు. రాముని ఆదేశానుసారం లక్ష్మణుడు సీత తలను తన తొడపై పెట్టుకుని కూర్చున్నాడు. అతడు సీతను తన తల్లిగా భావించాడు. అతని భావంలో ఎట్టి మార్పూ లేదు. రాముడు ఏదో పనిమీద వెళ్ళినట్లుగా వెళ్ళి, ఒక చిలుక రూపాన్ని ధరించి, అదే చెట్టు మీద కూర్చున్నాడు. సీత కన్నులు మూసుకొని గురకలు పెడుతూ గాఢ నిద్రలో ఉన్నట్లుగా నటిస్తున్నది. ఈ దృశ్యాన్ని చూసి చిలుక - రూపంలో ఉన్న రాముడు పాడుతున్నాడు.
"మేను మరచి నిదురించేవారిని,
మేలుకొలుపగల రెవరైనా
కనులు మూసుకొని నిదుర నటించేవారిని
లేపగా ఎవరి తరం ?" –
కొద్దిసేపటికి రాముడు ఎక్కడి నుండో వచ్చినట్లుగా తిరిగి వచ్చాడు. సీత నిద్ర లేచింది. లక్ష్మణుడు సీతారాముల పాదాలకు వందనం చేసి, “మీకు ఎట్టి ఇబ్బంది కలుగకుండా సేవ చేయడమే నా కర్తవ్యం . నేను మీ పాదదాసుడను" అన్నాడు. (శ్రీ వాణి ఏ ప్రియల్ 2022 పు 7)