ప్రేమస్వరూపులారా! ప్రతి మానవునందు శుభంకరమైన ఈశ్వర . తత్వముంటున్నది. అట్టి ఈశ్వరత్వాన్ని పవిత్రమైన భావముల చేతనే ఆవిర్భవింప చేసుకోవాలి. ఈనాటి శివరాత్రికి కూడను ఒక చక్కని ఆదర్శముంటున్నది. శివ,రా,త్రి అనే నాలుగు అక్షరముల చేత, వర్ణ క్రమమును అనుసరించి, సంఖ్యా శాస్త్రములో "శి" కు 5, “వ"కు, 4, “రా"కు 2, ఉన్నది. మొత్తం 11 పదకొండు - దీనినే , ఏకాదశ రుద్రులన్నారు. శి,వ,రా, మూడు అక్షరముల చేరికయే త్రిపుటి అనగా నాలుగవఅక్షరము "త్రి” తయారైనది. పదకొండు రుద్రుల యొక్క స్వరూపమే ఈ శివరాత్రి యొక్క మహాత్మ్యము.
రుద్రులు బుద్ధిని విషయము పై ప్రవేశింపబెట్టి తద్వారా సంసారములో పడవేస్తున్నవి. పదకొండు రుద్రులకు పైవాడే పరమాత్ముడు ఈ - పదకొండు రుద్రులను జయించినటువంటి వాడే పరమాత్మను పొందగలడు. కనుకనే పరమాత్మ తత్త్వమును పొందగోరేవాడు ఈ పదకొండు రుద్రులను సాధించాలి. పదకొండు రుద్రులనగా ఎవరు? కర్మేంద్రియ పంచకము,జ్ఞానేంద్రియ పంచకము, మనస్సు కలిసి పదకొండు రుద్రులుగా తయారవుతుంది. శబ్ద, స్పర్శ, రూప, రస గంధాదులు, కర్మ జ్ఞానేంద్రియ మనసులు చేరిన పదకొండింటిని సాధ్యమైనంత వరకు అదుపులో ఉంచుకోవటానికి ప్రయత్నము చేయాలి. (శ్రీవాణి ఫిబ్రవరి 2022 పు 6)