అరిషడ్వర్గాలన్నియును ఉండేతీరాలి. అయితే, వాటి వినియోగము మాత్రము ఇప్పుడు విరుద్ధంగా చేస్తూ కష్టాల ననుభవిస్తున్నారు. భగవంతుని స్వరూపం పైన మోహం, పరమాత్మపైన తీవ్ర ఆశ, ఆధ్యాత్మికపథములో పోకూడదు అనే భావముపై ద్వేషము, ఇట్లా అన్నిటినీ భగవద్విషయంపై వేస్తే చెడ్డ రాదు, రానివ్వదు. మొండెద్దుంటే దాని ముక్కుకు ముగుతాడు కట్టి, రెండు పగ్గాలువేసి మెత్తపరచి దానితో సేద్యం చేయించుకోవాలి. ఆవిధముగా గుణములన్నిటినీ సక్రమ మార్గములో నడిపించాలి. దానివలననే శాంతి అనుభవము కలిగేది.
యుద్ధములో ఉపయోగించే సాధనాలగు కత్తి కఠారాలకు ఆయుధపూజనాడు పూజచేస్తున్నారే! అట్లనే,అరిషడ్వర్గానికి కూడ , పూజ చేయాలి. కామ , క్రోధాలున్నాయే అని బాధపడవద్దు. అవి వుండనీ, అయితే వాటిని మంచి త్రోవలో త్రిప్పితే యేమీ బాధ లేదు. సర్వ కామాలు తప్పు అంటే, పురుషార్థములో దానిని ఎందుకు చేర్చినారు? కామాన్ని పరమాత్మునిపై వేయ్! రాముని తలంచితే కాముడు పరుగెత్తిపోతాడు. రావణుడు రాముణ్ణి నరుడుగా తలంచినాడు. హనుమంతుడు నారాయణుడుగా తలంచినాడు. వారివారి గుణములను పట్టి వారివారి విశ్వాసము కుదిరేది కూడ.
కోరికలవల్ల ముముక్షువు కావచ్చును. ధ్రువుడు కోరికలవలననే అరణ్యానికి తపోన్ముఖుడై బయల్దేరినాడు. క్రమక్రమముగా విజయవాసనలన్నిటినీ మరచినాడు. గాజు పెంకుకోసం వెతుకుతూపోతే అతనికి రత్నమే దొరికింది. నీళ్ళకోసం పాకులాడినవానికి అమృతమే దొరికింది. అట్లనే, ఏదో ఒక కడుపునొప్పి అని సాయిబాబా దగ్గరకు వస్తారు. పోనీ, కోరికల మూలంగానైనా నాదగ్గరికి వచ్చినారే, అదే నాకు సంతోషము. వచ్చిన తరువాత ఆ ప్రేమను చూసి, భక్తిభావములో పడి ఒక పటమో, భజన పుస్తకమో తీసుకొని వెళతారు. ముముక్షువులు అవుతారు. ఎండ లేకపోతే ఏర్ కండిషన్ కోరరు. అది ఒక కారణం, ఒక మార్గమైపోతుంది. ఈ క్షుద్ర కోరికలను కాదు, మోక్ష ప్రాప్తిని అనుగ్రహించేదానికే మాధవుడు వచ్చేది.
ఇపుడు వీరభద్రశాస్త్రిగారు భాగవతమునుంచి ఉదాహరించి ఉపన్యాసమిచ్చినారే... ఆ గోపికల దాహం మీకు అర్థం కాదు. అది పరమాత్మ సంబంధం. మీరు విని యుండవచ్చును, కొంతమంది చెప్తారు, రాముడు చేసినట్లు చేయ్, కృష్ణుడు చెప్పినట్లు చేయ్ అని. అయిన నాకది అన్వయించదు. నేను చేసినదే చెప్తాను, చెప్పినదే చేస్తాను. చెప్పినదాన్ని తప్పను. సత్యం పైన పవళించినవాడే సత్యసాయి. స అంటే సగుణ, సత్యం, సత్ అయిన సర్వేశ్వరుడు. అయి అంటే మాయి, తాయి, తల్లి! బాబా అంటే తండ్రి. వాడు గొప్ప, వీడు చిన్న అనే భావము నాకు యేమాత్రము లేదు. మీ సాధనా సంపత్తినిగూర్చి గొప్ప చిన్న అంతే! నా పేరు యొక్క అర్థమే పవిత్రమైన తల్లి తండ్రి అని; ఆత్మసంబంధమైన తల్లి తండ్రి అని; నీపై ప్రేమ కలిగిన నీ ఆత్మయేనని.
ఈ నామస్మరణ చేస్తే మీ హృదయకమలము వికసిస్తుంది. ఒక్కొక్కతూరి జపం చేస్తే ఒక్కొక్క దళము విడుగుతుంది. విరాట్ స్వరూపి అయిన భగవంతుడు విశాలంగా హాయిగా మీ హృదయ పీఠములో ప్రతిష్ఠితుడు కావాలంటే ఎంత వికసించాలో మీరే యోచించండి. (1962 జనవరి సనాతన సారథి నుండి)(సనాతన సారథి, జనవరి 2022 పు 29)