చేసి చూపించాలి. పరుల తృప్తి కోసం కాదు. మన తృప్తికోసం చేయాలి. చేసిన పని, చెప్పే మాట హృదయ సాక్షిగా ఉండాలి. నేను చెప్పేది నా కోసం కాదు. కేవలం జగత్ కల్యాణం. జనుల సేవ. గ్రామాల సేవ చేస్తుంటే మీ జన్మ సార్థక మవుతుంది. పూర్వపు ఋషులు ఎన్నో విధముల శక్తిని సాధించుకోంటూ వచ్చారు. షేక్స్పియరు గొప్ప నాటక కర్త, అతని నాటకాలు హృదయాన్ని కరగింప జేస్తాయి. అతను మీరు పశుబలాన్ని, రాక్షస శక్తి ఎంతైనా సంపాదించవచ్చు. కాని, సంపాదించిన బలాన్ని రాక్షసుని వలె ఉపయోగించకండి, అన్నాడు. దేహబలాన్ని పుష్టిగా సంపాదించుకోండి. తప్పులేదు. కాని, దానిని రాక్షసుని వలె కాకుండా మానవుని వలె వినియోగించాలి. అది నిజమైన బలం. ధన బలం. భుజబలం, బుద్ధిబలం, జవబలం దుర్వినియోగం చేసుకోకూడదు. సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవటానికి మనిషి జన్మ వచ్చింది. దేహమనే పడవకు చిల్లులు పడి శిధిలం కాకముందే గట్టుకు చేరడానికి ప్రయత్నించాలి.
(వ.1984 పు.104)
దివ్యత్వము మానవాకారము ధరించినంత మాత్రమున అలక్ష్యంగా చూడటం మంచిదికాదు. చిక్కిన అవకాశాన్నిదక్కించుకొని తద్వారా ధస్యులు కావడానికి కృషి చేయాలి. ఇది తిరిగి చిక్కునది కాదు.
"చిక్కిన సాయిని వక్కలేయక చక్క చేసుకోండి
పోయిన చిక్కదు పర్తీశుని ఈ పాద సేవయండి
భక్తిని ఇచ్చి శక్తిలో ముంచి ముక్తి జేర్చునండి
ఏకమనసుతో నమ్మి సాయిని ఎంచి కొలువబోండి
ఇతరుల మాటల నింపుగ నమ్మి కొంపతీయకండి
"చిక్కిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. భగవంతునికి ఏది ఇష్టమో దానిని ఆచరించండి. భగవంతుడు కోరేది నిశ్చల నిర్మల నిస్స్వార్థ ప్రేమ ఒక్కటే. ఈ ప్రేమకు ప్రతిఫలం తిరిగి ఎంతైనా ఇస్తాడు. భగవంతుడు. కాని, ప్రతిఫలం నిమిత్తమై మీరు ప్రేమించకండి. అలా చేస్తే అది వ్యాపారంగా మారి పోతుంది. "ఓ భగవంతుడా! నా కోరిక నెరవేర్చు. నీకు రెండు కొబ్బరికాయలు కొడతాను" అని కండీషన్లు పెట్టకూడదు. పవిత్రమైన గోపీగోపాలుర భక్తిలో వేయింట ఒక భాగమైనా మీరు అనుభవించడానికి కృషి చేయండి.
(స. సా..ఆ.95 పు.266)