విష్ణువు తాను దశరథుని కుమారునిగా మళ్ళీ పుడతానని చెప్పినపుడు ఈ మాట లంకాపట్టణమునకు కాపలా కాసే లంకిణి అనే రాక్షసి విన్నది. సీతాన్వేషణ కొరకై హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు ఆమె "లంకా పట్టణ సింహద్వారమునకు అధిపతిని నేను. నన్ను దాటుకొని పోవుటకు నీకు సాధ్యం కాదు. నేను మహాశక్తిమంతురాలను,” అని హనుమంతుణ్ణి నిలుపడానికి ప్రయత్నించింది.
హనుమంతుని శక్తిసామర్థ్యములు ఆమెకు తెలియవు. ఎడమ చేతితో ఆతడు ఆ లంకిణిని ఎత్తి బయటికి విసిరేశాడు. అప్పుడు లంకిణికి పూర్వం బ్రహ్మ తనకు ఇచ్చిన మాట జ్ఞాపకం వచ్చింది. బ్రహ్మ "ఎప్పుడు మారుతి వచ్చి నిన్ను ఎదిరించి నిలువరిస్తాడో అప్పుడే ఈ లంకకు పాప పరిహారం జరుగుతుంది. ఈ లంకలో ఉన్న రాక్షసుల బాధలు తప్పిపోతాయి,” అని చెప్పాడు. హనుమంతునిచే విసరివేయబడిన లంకిణి అతనికొక నమస్కారం చేసి “నాయనా! నీ స్పర్శవల్ల నా పాపం పరిహారమైపోయింది. “దర్శనం పాప నాశనం, సంభాషణం సంకట నాశనం, స్పర్శనం కర్మవిమోచనం” అన్నారు. నాకు నీ దర్శన, స్పర్శన, సంభాషణలు మూడూ లభించాయి. ఇక, లంకకు అధోగతి ప్రారంభమైంది. ఇదిగో, నేను వెళ్ళిపోతున్నా,” అని - ప్రాణం వదిలింది లంకిణి. (రామాయణ దర్శనము వేసవి తరగతులు 2002 పు 63-64)