కేవలం, రామలక్ష్మణభరతశత్రుఘ్నులేగాక వారి పత్నులు కూడా గొప్ప ఆదర్నాన్ని అందించారు. సీత, ఊర్మిళ, మాండవి, శ్రుతకీర్తిలు నలుగురూ గొప్ప గుణము - కలిగినవారు; పరుల ఆనందమే తమ ఆనందముగా భావించేవారు. రాముడు అరణ్యానికి బయల్దేరినప్పుడు సీత - "స్వామీ! నీవు మానవోద్దరణ నిమిత్తం అవతరించిన వాడవు. నేను కూడా అందులో ఒక భాగమే కదా! నీవు సర్వసంగపరిత్యాగివై అరణ్యానికి వెళుతున్నావు. కాబట్టి నేను కూడా సర్వసంగ పరిత్యాగినై నీ వెంట వస్తున్నాను" అని పలికింది. తన సర్వాభరణములను విసర్జించి - రామునివెంట బయలుదేరింది.
లక్ష్మణుని భార్య ఊర్మిళ చిత్రకళలో గొప్ప ప్రావీణ్యం కలిగినది. ఆమె తన గదిలో కూర్చుని శ్రీరామపట్టాభిషేక ఘట్టాన్ని రంగులతో చక్కగా చిత్రించుచుండగా లక్ష్మణుడు వచ్చి ఊర్మిళా! అని పిలిచాడు. ఏమిటి స్వామీ! అంటూ ఆమె లేచి నిలబడింది. ఆమె లేచే సమయంలో అక్కడున్నపెయింటు - పొరపాటున ఆమె గీసిన చిత్రము పై - ఒలికిపోయింది. . "అయ్యో, ఎంతో అందంగా - గీసినటువంటి చిత్రము పాడైపోయిందే! " అని - బాధపడింది. అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు "ఊర్మిళా! లోకకళ్యాణమును చేకూర్చే శ్రీరామ పట్టాభిషేకమును కైకేయి చెడగొట్టింది. నీవు గీసిన చిత్రమును నేను చెడగొట్టాను. దీని గురించి నీవు బాధపడనక్కర్లేదు. ఈ జగత్తులో సుఖ దుఃఖములు రెండు సమానంగా ఉంటాయి. వాటిని మనం సమత్వంతో స్వీకరించాలి.
కష్టసుఖములు రెండును కలసియుండు
వీని విడదీయ నెవ్వరి వశము కాదు
సుఖము ప్రత్యేకముగ నెందు చూడబోము
కష్టము ఫలించెనేని సుఖంబటంద్రు
ఆమెకు జరిగిన సంగతి వివరించి లక్ష్మణుడు తానుకూడా సీతారాముల వెంట అరణ్యానికి వెళుతున్నానని, పధ్నాలు సంవత్సరాల వరకు తిరిగిరానని తెలియజేశాడు. ఊర్మిళ, గొప్ప త్యాగగుణము కలిగినది. తన భర్త తనను విడిచి వెళ్ళు తున్నాడని ఆమె విచారించి లేదు. సీతారాములకు సేవ చేసే అవకాశoతన పతికి లభిoచినందుకు ఎంతో ఆనoదించినది. అతని పాదాలకు నమస్కరించి ఆనందగా వీడ్కోలు పలికింది. (శ్రీవాణి, ఏ. 20 11 పు 4/5)