పత్రి గ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం
భక్తాభీష్టప్రదం దేవం సాయినాథం నమామ్యహం
మహల్సాపతి మొట్టమొదట బాబాను సాయి అని ప్రకటించాడు. మన్మాడు తాలూకాలో పత్రి గ్రామంలో అవతరించి, ద్వారకామాయిలో ఉంటుండి భక్తుల యొక్క ఆభీష్టములు నెరవేర్చ నిమిత్తము తాను అవతరించాడు.
(షి.పు.1}
సాయి యొక్కడే నాకు ప్రతిపన్న భాగ్యంబు
జీవనాధారంబు జీవితంబు!
సాయి యొక్కడే నాకు ప్రేమ బంధు బలంబు
సకల భోగ ఫలంబు సమ్మతంబు!
సాయి యొక్కడే నాకు ప్రాకట దైవంబు
సేవింప భజియింప శ్రీకరంబు!
సాయి యొక్కడె నాకు రక్షక రాజ్యంబు
సంసార క్షితినార్ప సత్పదంబు!
సాయి సేవయే నా మది కామితంబు
సాయి ప్రేమయె నాకింక ధీమతంబు
సాయి భజనయే సుజన విభ్రాజితంబు
సాయి నామమె భువిలో సుధీమతంబు.
(బాబా 1949)
(బ.పు.2)
సాయి అర్థించు మీనుండి సద్గుణములు
సర్వమానవ సోదర సఖ్య బుద్ది
స్వార్థ త్యాగంబు పరిశుద్ధ సంఘ సేవ
సాయికిచ్చెడి ధనమిదె సత్యముగను.(స.సా.జ. పు.33)
వ్యక్తిని, సమాజమును పరిశుద్ధం గావించి లోకమును పవిత్రం గావించుటకు ఆధ్యాత్మికం అత్యవసరం. ఆధ్యాత్మికమంటే ఏమిటి? మానవునియందున్న పశుత్వాన్ని నిర్మూలం గావించి, మానవత్వాన్ని పోషించి దివ్వత్వాన్ని చేర్చునదే ఆధ్యాత్మికము. పూజలు భజనలు, వ్రతములు ఇవన్నీ కొన్ని విధములైన సత్కర్మలే తప్ప నిజమైన ఆధ్యాత్మికమునకు సంబంధించినవి కాదు. మానవునియందున్న పశుత్వాన్ని నిర్మూలం గావించాలి: మానవత్వాన్ని పోషించి దివ్యత్వంతో చేర్చాలి. ఇదియే ఆధ్యాత్మికము (Spirituality) యొక్క అంతరార్థం . SAI (సాయి) అనే పదములో S. Spiritual Transformation (ఆధ్యాత్మిక పరిణామము)ము, A - Association Transformation, (సామాజిక పరిణామము) మ - Individual Transformation (వ్యక్తి పరిణామము)ను సూచిస్తున్నాయి. ఈనాడు వ్యక్తి పరిణామము, సామాజిక పరిణామము. ఆధ్యాత్మిక పరిణామము మూడూ అత్యవసరమని SAI (సాయి) అనే పదము లోకానికి చాటుతున్నది.
(సా.శు.పు.27)
దైవత్వాన్ని గుర్తించటానికి కర్మోపాసనజ్ఞానములు ముఖ్యం. కర్మమార్గమునందు ప్రవేశించి, ఉపాసనా మార్గమునందు నిల్చి, జ్ఞానమార్గంలో అంత్యం కావాలి. కర్మమార్గం పూవువంటిది. భక్తిమార్గం కాయవంటిది. జ్ఞానమారం పరిపూర్ణ ఫలంవంటిది. ఫలమును భుజించినప్పుడే దాని మాధుర్యమును పొందవచ్చునుగాని, కేవలం కాయను మాత్రమే భుజిస్తే ఆమాధుర్యము నందుకోలేము. కనుక. మొదట కర్మమార్గమందు ప్రవేశించి, ఉపాసనామార్గమందు జీవితమును గడిపి జ్ఞానమార్గంలో ఆంత్యం చేసుకోవాలి. అప్పుడే దివ్యమైన పరిపూర్ణత్వమును పొందటానికి మీరు అర్హులవుతారు. ఇదియే సాయి అనే పదము యొక్క సత్యరహస్యము. సాయి (SAI) అనే పదంలో S అనగా Service (కర్మమార్గం), A అనగా Adoration (ఉపాస నామార్గం) - అనగా Illumination (జ్ఞానమార్గం). కర్మోపాసనా మార్గములందు జ్ఞానమును పొందే పరిపూర్ణ స్థితియే సాయి బోధించే ఆధ్యాత్మిక మార్గం. మానవత్వమునే అర్థం చేసుకోలేనివాడు ఇంక దైవత్వమును ఏమాత్రం గుర్తించలేడు. కనుక, మొట్టమొదట మానవత్వమునుఅర్థం చేసుకోవాలి.
(సా.శు.పు.67)
(చూ॥ స్వామి బాల్యము, ప్రతిష్టించు. హాయి. చక్కచేసుకోండి, సద్వినియోగం)