సర్వధర్మాన్పరిత్యజ్య

శ్లో: సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ

అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః!

అను వాక్యములను పట్టి పరమాత్ముడు "సర్వధర్మాన్ పరిత్యజ్య" అని మాత్రమే అన్నాడు. కానీ సర్వధర్మాన్" అని అనలేదు. అనగా, ధర్మవిచారణ చేయక, భగవత్ప్రీతిగ జ్ఞరూప ధర్మకర్మలను చేయవలెననియే దీనిభావము. అనన్యగతికులై సర్వభారమును పరమాత్మ పైననే వేచి, జనకాదులవలె, తాము పొందవలసిన దేదియు లేకయున్నను లోకసంగ్రమ కర్మనాచరించవలెను.ఎందుకన, సర్వభూతాంతరాత్మ తన ఆత్మకన్ననూ వేరుకాదు. కనుక, సర్వభూత హితానురక్తుడై నిష్కామబుద్ధితో విధి విహిత కర్మలను ఆచరించునట్టిదే నిష్కామకర్మయనబడును. కాన, గీతను అవగాహన చేసుకొని తదా దేశానుగుణంగా నిష్కామకర్మనిష్టులై స్వధర్యమును చక్కగా నెరింగి సర్వమును హరి ప్రసాదముగా భావించి కర్మలు చేయుట మాత్రమే కర్తవ్యము: ఫలాపేక్ష లేకసాత్విక ప్రవర్తన కలిగి హరికృపా కటాక్షములకు పాత్రులైన వారి జీవితములే ధన్యములు.

 

ధర్మము నాశ్రయించినవారికి ఐహికమున దుర్భరమైన కష్టములు యెదురైనను చివరకు వారికే సంపూర్ణ విజయము చేకూరును. అధర్మపరులు ఐహికమున సర్వసంపదలతో తులతూగి నప్పటికినీ తుదకు వారికి సర్వనాశనము సంభవించక తప్పదు. ఈ విషయమున పాండవ, కౌరవుల పరిస్థితి మానవ లోకమునకు ప్రత్యక్షసాక్షి, అధర్మమూర్తులయిన కౌరవులు ధూర్తులై ధర్మమూర్తులగు పాండవులను నానాబాధలకు గురిచేసిననూ కడకు ధర్మమూర్తులకే విజయము. అధర్మమూర్తులకు సర్వనాశనము సంభవించును. అధర్ములకు యెన్ని విధములైన బలములు అండ దండలుగా వుండిననూ గ్రహబలము లేనిదే అన్నియూ వ్యర్థములేయని భారతము భారతీయులకు గొప్ప సత్యమును అందించెను. పవిత్ర ధర్మమును నిరూపించెను. సత్యధర్మముల సౌధమే భారతమునందలి గీతాభవనము, భక్తి శ్రద్ధలతో పవిత్రగీతను పఠించి అందలి నిబంధనలను అనుష్టాన రూపమున ఆచరించిన అట్టి వారికి ఆత్మారాముడు అరచేతియందే కనుపించును; అరనిమిషమందే కరుణించును. బ్రహ్మాండమంతయు బొజ్జలో నుంచుకొన్న పరమాత్మను కోరిన అష్టఐశ్వర్య సంపదలతో ఐహికమును అనుభవించుటే కాక, సత్యానంద నిలయమైన సత్యజ్ఞానమును కైవల్యమును కూడనూ పొందవచ్చును. వెన్నచిక్కిన నేతికొఱకు యోచించనక్కర లేదు కదా! అందు వలననే, పరమాత్ముని శరణుజొచ్చిపరమాత్మ ఆజ్ఞకర్మల నమసరించిన మోక్షాపేక్ష కూడనూ అక్కరలేదు. అట్టి వానికి కావలసినదేదియో యోగ్యమయిన దేదియో భగవానుడే అందించును. తన కొఱకు తపించవలెను కానీ మోక్షము కొఱకు కాదనియు, తనను శరణుజొచ్చి మోక్షమును కూడనూ త్యజించిన, అట్టివాని సర్వపాపములను నాశనము జేతుననియూ, పరమాత్ముడు గట్టి మాటనిచ్చి ఆర్జునునకు తిరిగి పుట్టుకలేకుండా చేసెను. కావున, పుట్టుకకోరని వారందరునూ ఇట్టి గట్టి చట్టము ననుసరించి పరమాత్మను మెప్పించి, అతనిని శరణు జొచ్చిన, సర్వసిద్ధిని సాధించవచ్చును.

(గీ.పు.240/241)

            


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage