సుభాష్ చంద్రబోస్ కలకత్తా యూనివర్సిటీలో చదువుతున్న సమయమున ఒక బ్రిటిష్ లెక్చరర్ భారతదేశాన్ని, భారతీయులను గురించి హేళనగా, అలక్ష్యంగా చెప్పడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ మాతృదేశ దూషణమును వినలేకపోయాడు. "ఇది నాప్రియ మాతృదేశము. ఇది నా ప్రియమాతృభాష ఇదే నా మతము" అని మాతృదేశమునకై త్యాగము చెయ్యాలని సంకల్పించుకొన్న వ్యక్తి. అతడు లెక్చరర్ మాటలను వినలేకపోయాడు. కొంతసేపు ఓపికపట్టినాడు. ఒక్కతూరి మూడు డెస్కులంతా ఎగిరిపోయేసి ఆ బ్రిటిష్ లెక్చరర్ తలపట్టుకొని, చెప్పు తీసుకొని ఊరికే కొట్టేశాడు. దేనినైనా నేను సహిస్తాను. నా మాతృదేశాన్ని దూషించటం నేను సహించలేను. నేను నరకమునకు పోయినా ఫరవాలేదు, నాదేశ గౌరవాన్ని నేను కాపాడుకోవాలి" అని దేశాభిమానం వ్యక్తం చేసాడు. తక్కిన విద్యార్థులు ఏమీ చేయలేక పోయారు. పులిపిల్లలవలె ఎగిరి అతడిని అనేక రకములుగా హింసించాడు. లెక్చరర్ Help me, help me అంటున్నాడు. కానీ ఎవరూ సహాయం చేయలేదు.
ఈ వార్త యూనివర్సిటీ అంతా ప్రాకిపోయింది. అధికారులు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకొని 5 సం॥లు కలకత్తా యూనివర్సిటీలో సుభాష్ చదవటానికి వీలు లేదని నిర్ణయం తెలియచేశారు. దానితో సుభాష్ చదువును త్యాగం చేసినాడు. అటుపిమ్మట తండ్రి ఈ విషయాన్ని తెలుసుకొని లండన్ పంపించినాడు. అక్కడ శ్రద్ధాభక్తులతో చదివి ICS Pass అయ్యాడు. భారతదేశానికి తిరిగివచ్చి మాతృ దేశాభిమానముతో రాజకీయ రంగంలో ప్రవేశించి నాడు. ఇదే నిజమైన త్యాగము. స్వార్థాన్ని త్యాగం చేసి పరార్థాన్ని విశ్వసించి పరమార్థాన్ని పొందాలి.
(స.సా.మే. పు.137/138)