విద్యార్థులారా! మీరు ఉద్యోగాల కోసం ప్రాకులాడకండి అయితే, ఉద్యోగాలు చేయండి. కానీ, భారతీయ సంసస్కృతి ప్రబోధించే "సత్యం వద, ధర్మం చర” అనే సత్య సూక్తిని ఆచరణలో పెట్టడానికి మీ ప్రాణాలనైనా త్యాగం చేయటానికి సిద్ధంగా ఉండండి. గ్రామ సేవలో పాల్గొనండి. దీనులకు, దిక్కులేనివారికి సహాయం చేయండి. దేశక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోండి. "దేశంలో నేనొక వ్యక్తిని. కాబట్టే దేశం బాగున్నప్పుడే నేను కూడా బాగుంటాను" అని గుర్తించండి. పరమేష్టి నుండి సృష్టి ఆవిర్భవించింది. సృష్టి నుండి సమిష్టి (సమాజం ఏర్పడింది. సమిష్టి నుండి దృష్టి (వ్యక్తి) ఉద్భవించినాడు. కనుక, మీరు వ్యక్తి నుండి సమిష్టి లోకి, సమిష్టి నుండి సృష్టిలోకి ప్రయాణించి, చివరికి పరమేష్టిలో లీనమైపోవాలి. ఇదియే దివ్యత్వానికి రాచబాట. దీనిని విడిచి పెట్టి, "ముళ్ళకంపల" తో కూడిన ప్రవృత్తి మార్గంలో ఎందుకు ప్రయాణమవుతున్నారు? "ఏమిటి సాయిబాబా ఇలాంటి బోధలు చేస్తున్నాడు" అని నన్ను ఎవరేమని తిట్టుకున్నా నాకు నష్టం లేదు. ఎందుకంటే, నేను చెప్పేది మంచి, మంచి, మంచి! మీరు మంచి సంకల్పాలను అభివృద్ధిపర్చుకొని, మంచి విషయాలను ఆచరణలో పెట్టినప్పుడే దివ్యమైన గమ్యాన్ని చేరుకుంటారు. ఇలాంటి దివ్యమైన మార్గాన్ని వదలి పెట్టి ఎందుకు మీరు అవస్థ పడుతున్నారు? లేత వయస్సులో మీ పంచేంద్రియాలను అరిషడ్వర్గములనే రాక్షసులకు ఆర్పితం చేసి వృద్ధాప్యంలో ఏడుస్తూ కూర్చుంటే వచ్చే ఫలితమేమిటి? లేత వయసులోనే ఇంద్రియాలను దైవార్పితం చేయాలి. ఇంతవరకు తెలిసో, తెలియకనో పొరపాటు జరిగియుండవచ్చు. దాని గూర్చి విచారిస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు. కనీసం ఇప్పుడైనా మేల్కొని, భగవచ్చింతనతో జన్మసార్థకం గావించుకోండి. మీ తుది శ్వాస కూడా దైవచింతనతో వదలండి...
(స. సా జ.99 పు.154)
మానవునిది సమిష్టి సాంప్రదాయమే కానీ, వ్యష్టి సాంప్రదాయము కాదు. ఈ జగత్తులో మానవుడు వ్యష్టిగా జీవించలేడు. మానవుడు ఈ జగత్తునందు సుఖశాంతులతో జీవించవలెనన్న సమిష్టి భావాన్ని పోషించుకోవాలి.
శ్లో! ఓం సహనా వవతు
సహనౌభువనక్తు
సహ వీర్యమ్ కరవావహై
తేజస్వినా వధీతమస్తు
మావిద్విషావహై
దీని అంతరార్థం ఏమిటి?
కలిసి మెలసి తిరుగుదాం
కలిసి మెలసి పెరుగుదాం
కలిసి మెలసి తెలుసుకున్న తెలివిన పోషించుదాం
కలిసి మెలసి కలత లేక చెలిమితో జీవించుదాం.
మన జీవితము సమిష్టి స్వరూపమైనది.
కనుకనే "సహస్రశీర్షాఃపురుషః సహస్రాక్ష సహస్రపాత్....." అనే సమిష్టి స్వరూపమును నిరూపిస్తూ వచ్చింది వేదము.
(శ్రీ బ.ఉ.పు.19)
(చూ|| పురుషుడు)