ఈ ఆసుపత్రి (వైట్ ఫీల్డ్ శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) అందంగా ఉందని అందరూ కొనియాడు తున్నారు. కేవలం అందంగా ఉంటే ఏమి ప్రయోజనం? అందరికీ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని చేకూర్చాలి. బీదలు సంతోషపడినప్పుడే మనకు ఆనందం కల్గుతుంది. బీదలవద్ద మందులు కొనటానికి డబ్బు ఉండదు. కాబట్టి వారికి కావలసిన మందులన్నీ మేమే ఉచితంగా ఇస్తాము. మీరు ఈ ఆసుపత్రిని తక్కువ అంచనా వేయకండి. ఈ ఆసుపత్రిని గురించి ఇప్పుడు మీకు అంతగా తెలియదు. మున్ముందు ఇది గొప్ప స్థితిని పొందుతుంది. వివిధ దేశాల ప్రజలు ఇక్కడికి వచ్చి చికిత్స చేయించుకుంటారు. ఆలాంటి దివ్యమైన శక్తి ఈ హాస్పిటల్ లో ఉన్నది. పూర్వం పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టినప్పుడు దానిని కొంతమంది తక్కువ అంచనా వేశారు. కాని, నేడు పుట్టపర్తి చుట్టు ప్రక్కల గ్రామాలలో ఒక్క హార్ట్ పేషంటూకూడా కనిపించడు. ఆ ఆసుపత్రిలో హార్ట్ ఆపరేషన్ చేయించుకోవాలంటే చిన్న పిల్లవాడుకూడా ఏమాత్రమూ భయం లోకుండా నవ్వుతూ వస్తాడు. అదేరీతిగా ఈ కర్ణాటక రాష్ట్రంలో కూడా ఎవ్వరికీ గుండె జబ్బులు లేకుండా చేయాలి. రోగపీడితులైన పల్లె ప్రజలను తీసుకువచ్చి వారికి తగిన వైద్యం చేయించాలి. ఎవరినైనా తీసుకురండి. మాకు ఎట్టి అభ్యంతరమూ లేదు. ఈ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి అందరికీ సమాన హక్కుంది. ఏ కులంవారైనా, ఏ మతం వారైనా ఏ దేశం వారైనా వచ్చి ఈ ఆసుపత్రిలో చికిత్స పొందవచ్చు. మాకు ఎలాంటి భేదమూ లేదు. అందరికీ ఉచితంగా ట్రీట్ మెంట్ ఇస్తాం. అప్పులైనా చేసి ఉచిత వైద్య సేవలందిస్తాం. ధనం కోసంఏమాత్రమూ వెనుకంజ వేయం, రోగనివారణ గావించి ప్రాణాలను కాపాడటమే మా ప్రధాన లక్ష్యం. మీరు కూడా ఈ ఆదర్శాన్ని అనుసరించండి. లోకాస్సమస్తా సుఖినో భవంతు , అందరూ సుఖంగా ఉండాలి. నాయొక్క వాంఛ అదియే. దానినిమిత్తమై నేను ఏమైనా చేస్తాను. నా ప్రాణాన్నైనా ఆర్పితం చేస్తాను. ప్రజాక్షేమం కోరని వ్యక్తి ఉండి ప్రయోజన మేమిటి? నేనెప్పుడూ అందరి మంచిని కోరతాను. మనం చేసే పని మంచిదైనప్పుడు, మన
భావాలు మంచివైనప్పుడు డబ్బుకోసం వెఱవనక్కరలేదు, దానంతటదే నడుచుకుంటూ వస్తుంది.
(స. సా.పి.2001 పు.36/37)
(చూ: సంగీత విశ్వవిద్యాలయము)