గ్రుడ్డివాడైన సూరదాసు గానం చేసేటప్పుడు కృష్ణుడు గోవులు కాచేవానివలె వచ్చి ఆ పాటకు తగినట్లు మనోహరంగా మురళి నూదుతూ కూర్చునేవాడు. అందరూ భగవంతుని రూపాలేనని తాను పాట పాడుతున్నప్పటికీ తన యెదుట ఉన్నది గోపాలబాలుడని అనుకున్నాడు సూరదాసు. ఒకరోజున కృష్ణుడు తానెవరో సూరదాసుకి స్పష్టపరచాడు. తన దివ్యహస్తంతో సూరదాసు నేత్రాలమీద మెల్లగాస్పృశించాడు! సూరదాసు కళ్ళు తెరచి చూచే సరికి ఎదురుగా కృష్ణుడు! మధురాధరముల నుంచి మోహన మురళీగానం వినిపిస్తోంది. ఆయన దివ్యరూపం పైన మనస్సు లగ్నం చేశాడు సూరదాసు. అప్పుడతడు కృష్ణుని దివ్య రూపాన్ని దర్శించిన తనకింకభౌతికమైన నేత్రాలు అవసరం లేదని, తనకుఅంతర్నేత్రములు చాలుని అన్నాడు. పరిశుద్ధమైన అంతర్దృష్టి అతనికి శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చింది. దానివల్ల అతడు ఎంతో ఆరోగ్యంగా జీవించాడు.
(వ.61-62.పు.59)
సూరదాసు మహాభక్తుడు, గ్రుడ్డివాడు. కృష్ణుడాతని ఆరాధ్యదైవము. ఒకనాడతడు బృందావనమునకు పోవలెనని, చేతి కఱ్ఱతో తట్టుచు, తడవుకొనుచు బయలుదేరినాడు. ఇంతలో ఒక పిల్లవాడు వచ్చి “తాతా! బృందావనమునకా? నేనును అక్కడకే వెళ్ళుచున్నాను. తీసికొని పోయెదను రమ్ము" అని తాత చేతి కఱ్ఱ పుచ్చుకొని ప్రయాణము సాగించినాడు. సూరదాసు “నాయనా! పేరేమి?" అన్నాడు. ఆ పిల్లవాడు “కృష్ణు" డన్నాడు! ఆ పేరు వినగనే సూరదాసు "తండ్రీ ఈ గ్రుడ్డివానికి త్రోవ చూపుటకు నాతో వచ్చితివా?” అని ఆనందమున పొంగిపోయినాడు. ఇంతలో ఆ పిల్లవాడు “తాతా బృందావనము దగ్గరకు వచ్చితిమి. నాకు వేరే పనియున్నది. ఇక నీవు పొమ్ము” అని చేతి కఱ్ఱ వదిలివేసినాడు. “నాయనా! నన్ను నడిత్రోవలో విడిచిపోయెదవా?” అని దీనముగా పలుకుచు ఆ పిల్లవానిని పట్టుకొని కౌగిట జేర్చుకొనవలెనని చేతులు చాచుచు అటు యిటు పరుగులు పెట్టినాడు. కాని కృష్ణుడు దొరకలేదు. అప్పుడు సూరదాసు “కృష్ణా ! నా కౌగిలి కందక తప్పించుకొని పోయినావు గానీ, నిన్ను నా హృదయమున బంధించి యున్నాను. అక్కడి నుండి ఎట్లు తప్పించుకొని పోగలవయ్యా!" అన్నాడు. అదిగో! ఆవిధముగా నమ్మినవారికే భగవంతుడు తోడునీడయై యుండును. (నా.వి. పు 14)