అనాది కాలము నుండి సత్యాన్వేషణ నిమిత్తమై అనేకమంది మహర్షులు, మహనీయులు సాధనలు సల్పుతూ వచ్చారు. పవిత్రమైన భావమును, విశిష్టమైన విశ్వాసమును, దృఢ సంకల్పమును ఉంచుకొని సత్యాన్ని దర్శించే వరకు తమ దీక్ష వీడమని అనేకమంది మహర్షులు తపస్సు చేశారు. కొంత కాలమునకు వారే ప్రజలలో ప్రవేశించి, "ఓ ప్రజలారా! మేము భగవంతుని ప్రత్యక్షంగా చూడ గలిగాము. ఆ భగవంతుడు తేజోమయుడు: దివ్యమైన ప్రకాశములో ఉన్నాడు. అజ్ఞానమనే తమోగుణమునకు ఆవల నున్నాడు. భగవంతుడు ఎక్కడో దూరముగా లేడు. మేము ఎక్కడో బయట వె త కలేదు. మృణ్మయమైన ఈ దేహమందే ఆ చిన్మయమూర్తిని మేము చూడగలిగాము" అన్నారు. కనుక దేహమును సామాన్య మైనదిగా భావించరాదు.
(ద.స.98పు. 3/4)
సత్యాన్వేషణ అంటారు. ఏమిటి అన్వేషణ? అయితే సత్యము సర్వత్రా ఉంటున్నదే. దీనికి ఒక ఉదాహరణము. మన కన్నులు అమ్మను చూస్తుండాలి. అదే కన్నులు బిడ్డను చూస్తుంది. అదే కన్నులు భార్యను చూస్తుంది. ఆదే కన్నులు వంటి మనిషిని చూస్తుంది. అయితే తల్లిని చూచే సమయంలో ఏమనసుతో చూడాలి? బిడ్డను చేసే సమయంలో ఏభావముతో చూడాలి? భార్యను చూచే సమయంలో ఏ తలంపుతో చూడాలి. ఇదియే సత్యాన్వేషణ. వీరు నలుగురు ఆడవారే. చూచేది కన్నులు ఒక్కటే. కాని ఎవరిని ఏదృష్టితో ఏ భావంతో చూడాలన్నదే సత్యాన్వేషణ అదే విధముగనే నాలుక ఉన్నది. అసత్యమాడేది, సత్యమాడేదే ఒక నాలుక.. పరులను దూషణ చేసేది, భూషణచేసేది. ఒకనాలుకే. అయితే ఒకే నాలుక అయినప్పుడు ఎవరిని దూషించాలి? ఎవరిని భూషించాలి? ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ఆరాధించాలి? అనేటటు వంటిదే సత్యాన్వేషణ. సత్యాన్వేషణ" అనగా అన్నింటి యందూ ఉన్నది సత్యము,పదార్థానికి తగిన ప్రయోగమే సత్యము.
వెన్న ఉన్నది వ్రేలితో కొట్టవచ్చు. ఇనుము ఉన్నది సుత్తితోనే కొట్టాలి. పదార్థానికి తగిన ప్రయోగమే సత్యాన్వేషణ. ఇనుమును వ్రేలితో కొడితే వ్రేలు కూడా తెగిపోతుంది. వెన్నను సుత్తితో కొడితే చిన్నా భిన్నమై పోతుంది. దీనికి ఏవిధమైన దానిని ఉపయోగించాలి. అన్నదే సత్యాన్వేషణ. కనుక సర్వత్రా ఉండిన దైవత్వాన్ని అన్వేషణ చేయడమంటే మనలో భావమార్పురావాలి. దైవభావమును మనలో ఆవిర్భవింప చేసుకొనప్పుడే సర్వుల యందు కూడనూ ఏకాత్మ భావాన్ని మనం దర్శించవచ్చు.
(శ్రీ.ఏ.1995 పు.34/35
(చూ॥ దైవాన్వేషణ)