అన్ని రంగాల్లోను ఆదర్శమూర్తియై నిలిచి జగత్తునకు విలువల నందించినవాడు రాముడు. వారి సోదర ప్రేమ అపురూపము. అద్వితీయము, అసమానము. అట్టి ప్రేమ ఆ సోదరులను సుప్రీమ్ స్టేజికి తీసుకు వెళ్ళింది.కానీ ఈనాటి సోదర ప్రేమ సుప్రీమ్ కోర్టుకు తీసుకు వెళుతోంది! రాముణ్ణి వనవాసానికి పంపినందుకు సోదరుడైన భరతుడుతన తల్లిపై ఎంత కోపగించాడో వర్ణింప శక్యం కాదు. రామునిపై అతని ప్రేమ అలాంటిది. భరతుని నీడవలెవెంట నున్నవాడు శత్రుఘ్నుడు. ఇక రామ లక్ష్మణుల గూర్చి చెప్పనక్కర లేదు. పసిబిడ్డలుగా ఉన్న రామలక్ష్మణులను చెరొక ఊయల పైన పరుండబెట్టినప్పుడు ఇరువురూ ఏడుపు లంకించుకొన్నారు. ఎన్ని సపర్యల చేసినప్పటికీ వారు ఏడుపు మానలేదు. అప్పుడు తల్లులు వశిష్టులవారి సలహా అడుగుగా ఆయన "అమ్మా! రామలక్ష్మణులను ఒకే ఊయలపై పడుకోబెట్టండి" అన్నాడు. ఆ ప్రకారం చేయగా ఇరువురూ ఏడుపు మాని ప్రశాంతంగా నిద్రించారు. శైశవదశ నుండి రామలక్ష్మణులు కలసిమెలసి ఎంతో ప్రేమతో మసలేవారు. వనవాస సమయంలో సీతారాములను కంటికి రెప్పవలె చూసుకున్నాడు. లక్ష్మణుడు.యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు రాముడు చాల దుఃఖించాడు. “ప్రపంచంలో కౌసల్యవంటి తల్లినైనా పొందవచ్చును. సీతవంటి భార్యనైనా పాంద వచ్చును. కాని లక్ష్మణునివంటి సోదరుణ్ణి పొందలేను"అన్నాడు. ఇంక అందరికంటే గొప్పవాడు భరతుడు. రామనామంతో రామాజ్ఞ ప్రకారం రామపాదుకలనుప్రతిష్టించుకొని రాజ్యపాలన చేస్తూ రామ పునరాగమనం కొరకు ఎదురు చూశాడు. ఇక్కడ ప్రత్యక్షంగా సేవించిన లక్ష్మణునిది సాకార ఆరాధన. పరోక్షంగా చింతించిన భరతునిది. నిరాకార ఆరాధన. వనవాస సమయంలో పంచవటి సమీపంలో రాముడు "లక్ష్మణా! నీ ఇష్ట మొచ్చినచోట ఒక పర్ణశాలను నిర్మించు" అని ఆజ్ఞాపించాడు. వెంటనే లక్ష్మణుడు రాముని పాదాలపై పడి "స్వామీ! నేనేం పాపం చేశావని పర్ణశాలను నా ఇష్టమొచ్చినచోట నిర్మించమంటున్నావు? రామ సేవలో ఉన్న నాకు ప్రత్యేకంగా ఒక ఇష్టమున్నవదా? మీ ఇష్టమే నా ఇష్టం కాదా?" అని చాల బాధ పడ్డాడు. ఇట్టిది వారి అపూర్వ సోదర ప్రేమ. ఈ ప్రకారం రామాయణం పోదర ప్రేమ అనే ఆదర్శాన్ని జగత్తుకు చాటింది.
(స. సా.జులై.98 పు.194)