ఈనాడు లోకములో మానవులందరినీ సమానులుగా భావించవలెనని, వారి సమానమైన అధికారములను - వివాహము, భూములు, అహార విహారములు, మొదలగువానిని - అందించవలెనని భావిస్తున్నారు. దీనినే సోషలిజమ్ అంటున్నారు. ఇది నిజముగా సోషలిజమ్ కానేరదు. ఆస్తిపాస్తులను, భౌతిక సుఖములను, ధనకనక వస్తువాహనములను సమానముగా పంచి పెట్టాలని భావించుట పవిత్రమైన కార్యమే కాని; మానవుల ఆశలనుసమానముగా పోషించుటకు ఏమాత్రము వీలుకాదు. ఏనాడు వాంఛలు సమానముగా ఉంటాయో ఆనాడే ఆస్తిపాస్తులు సమానముగా పంచుటకు వీలవుతుంది. ఆస్తిపాస్తులను మాత్రము పంచి పెట్టటము, వారికి సమభావము, సమానమైన ఆశలు లేక పోవటముతో అరాచకమునకు, మూలకారణమవుతుంది. కార్మికుడుమొదలు కర్షకుని వరకుమ ఇది సమంగా ఉంటుంది. వీరి దాసత్వమును నిర్మూలించవలెనని ఇది ఫ్రెంచి విప్లవముతో ప్రారంభమైనది. క్రమంగా ఈ భావమే సామాన్యుడు కూడ అధికారము చేపట్టాలని రష్యా విప్లవముతో ప్రారంభమైనది. అదే క్రమేణా వికారమార్గములు పొంది కమ్యూనిజమ్ అయినది. ఈ రెండు విప్లవములయందున్న ఆశయాలు ఉత్తమాశయాలే. అవి సరియైన విధముగా ఆచరణలో పెట్టకపోవటమువలన వికారమార్గమును పొందినవి. సమత్వమనే భావము లోకములో ఈనాడు వ్యాపించినట్లు భావిస్తున్నారు.కాని అది ఈనాటిది కాదు. ఏబది శతాబ్దములకు పూర్వము సోషలిజము అనే దానిని స్థాపించిన సామాజిక మూర్తి ఆ కృష్ణమూర్తి, నవభారత సమాజమును స్థాపించుటకు మూలాధారమైన చరిత్ర పురుషుడు శ్రీకృష్ణుడు. కార్మికుని కర్షకుని, విజ్ఞానినికూడ సమానముగా భావించి వారికి తగిన కర్తవ్యకర్మలను నియమించి, తద్వార లోకవినాశకులు,ద్రోహులైన రాజకీయ నాయకులను, సాంఘిక ద్రోహులను ఖండించి కిరీటములేని మహారాజుగా ఏలినమూర్తి ఈ కృష్ణమూర్తి,
(ని.పు.14/15)
అందరికీ ఒక్క హృదయము, అందరికీ ఒక్క భావము, అందరికీ బలము ఇమ్మని కోరింది. యజుర్వేదము. సమష్టితత్వాన్ని అనేక విధములుగా బోధిస్తున్నది. సహజ స్వరూపాన్ని కూడా స్పష్టముగా విమర్శించింది. ఏనాడు మనము సోషలిజం సోషలిజం అంటున్నాము అందరూ సమానముగా ఉండాలని. ఇది ఈనాడు పుట్టినది కాదు. వేద కాలము నుండే ఉన్నది. మానవులు మాత్రమే ఒకటిగాఉండాలని సంకుచిత భావముతో కోరుతున్నాము. కాని, వేదముల అట్లా కాదు. ‘లోకాస్సమస్తా స్సుఖినోభవంతు’ - సర్వ ప్రాణులు సుఖముగా ఉండాలని ఆశిస్తుంది వేదము. వేద రహస్యాన్ని వేదముల మంత్రార్థాన్ని చక్కగా గుర్తిస్తే ఇది కేవలము ఒక తెగకు, కులమునకు, ఒక జాతికి మాత్రమే సంబంధించినది కాదని మనకు స్పష్టమవు తుంది. వేదము కేవలము విప్రులకు, పండితులకు, జ్ఞానులకు మాత్రమే ఏర్పడినదని మనము భావిస్తున్నాము. ఇది చాలా తప్పు. లోక కళ్యాణ నిమిత్తమై ఏర్పడినటు వంటిదే ఈ వేదము త్రికాలాబాధ్యమైనటువంటిది వేదము. ముల్లోక వాసుల యోగ క్షేమాలను కోరేది వేదము. ఇంతటి విశాలమైన వేదార్థాన్ని గ్రహించక సంకుచిత భావముతో కొందరు ప్రవేశపెట్టడం చేత ఇది అపకీర్తి పాలవుతున్నది.
(అ.ప్ర.స.92పు.38)