ప్రేమకు రూపంలేదు. ఇది అనిర్వచనీయమైనది, అవాజ్మానస గోచరమైనది. అనుభూతికి మాత్రమే లభ్యమయ్యేది. ప్రేమను ఎంత సమీపిస్తారో అంత ఆనందాన్ని మీరు. అందుకోగలరు. ఈనాడు లోకంలో అన్ని అవస్థలకు మూలకారణం మీలో ప్రేమలేకపోవడమే అయితే ప్రేమ ఉన్నది కాని అది శారీరకమైన స్వార్థపరమైనప్రేమగా ఉంటున్నది. మీరు దేహాత్మభావమునే ఆశిస్తున్నారు. కాని, పరమాత్మభావమును ఆశించడం లేదు; ఉపాధికి ఆధారమైన ఆత్మతత్త్వాన్ని విశ్వసించడంలేదు. ఆధారాన్ని విస్మరించి ఆధేయాన్ని ఆశ్రయిస్తే ప్రయోజనమేమిటి? అన్నిటికీ ఆధారము అన్నిటికీ ప్రధానము ప్రేమ ఒక్కటే. ప్రేమ ఎక్కడ పుడుతుంది? ఎక్కడ అంత్యమవుతుంది? ఇది దాసోహం తత్వము నుండి ప్రారంభమై సోహం తత్వములో అంత్యమవుతుంది. దాసోహం అనే భావన లేక సోహం తత్వన్ని అనుభవించుటకు వీల్లేదు. ఆసోహంతత్వమే ప్రేమతత్వము. ఆత్మయే ప్రేమ, ఆత్మయే బ్రహ్మ. ఈ భూలోకంలో మానవునికి ధర్మార్థకామమోక్షములనే చతుర్విధ పురుషార్థములున్నాయి. పరమ ప్రేమయే ఐదవ పురుషార్థము. దీనిని పొందినప్పుడే జగత్తంతా నిత్య కళ్యాణంగా ఉంటుంది.
(స.సా.డి.96 పు.311)