కన్న తల్లిదండ్రులకు, జన్మనిచ్చిన దేశానికి సత్కీర్తిని తెండి, ఆదే శ్రీరాముడు చెప్పాడు. "జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి" విదేశభ్రాంతులనేవి ఉండవచ్చును. మీరు పోయి రండి. కాని, మన మాతృ ప్రేమను మాత్రము మరువకూడదు. విదేశీయులు ఎంతో సుఖసంతోషములతో, భోగభాగ్యాలతో నిండియుండవచ్చును. కాని, భారతదేశం ఏమీ తక్కువ కాదు. ఇందులో కూడా మీరాశించే భోగభాగ్యములున్నాయి. కాని, ఈ కలియుగ ప్రభావం చేత ఆధునిక విద్యార్థులు - "పాచిపోయినా పక్కింటి పప్పురుచి" అంటారు. ఇంట్లో ఎంత రుచికరంగా తల్లి వండి పెడితే అవి రుచించవు.
మన భారతదేశం మహాభాగ్యభూమి. అన్నపూర్ణాదేవి,భోగభాగ్యాలకు ఏమాత్రం తక్కువలేదు. కాని, అట్టి భావముతో అనుభవించే వ్యక్తులు లేరు. అట్టి వ్యక్తులనే భారతదేశం ఆశిస్తున్నది.బయట దేశాలకు పోయిన మనం ఎన్ని కష్టాలకైనా గురి అవుతాము కాని ఆ కష్టాలనే మనదేశములో ఆనుభవించడానికి ఒప్పుకోము. కొందరు తమ ఇంట్లోనే వడ్డించిన తట్టనైనా కడుగరు. కానీ, విదేశాలకు పోతే జేబులో డబ్బు లేకపోతే హాటల్స్ లోప్లేట్లు కడిగి అయినా డబ్బు సంపాదించుకొంటారు. అదే పని మనదేశంలో ఎందుకు చేయకూడదు? ఈ దురభిమానం ఎందుకు? మనదేశానికి సేవ చేస్తే తప్పేముంది? అన్ని దేశములను, అన్ని మతములను ఆశించండి, అందరికీ మనం గౌరవము ఇవ్వవలసిందే, కాని, నీ దేశానికి నీవు మొట్టమొదట Respect ఇవ్వాలి. అది ప్రధానము.
(శ్రీభ.ఉ.పు. 141/142)