లోకములో మానవులు భగవంతుని మూడు విధములుగా వర్ణింతురు. ఆవియేవవ 1. నిర్గుణ నిరాకార రూపము. 2 సగుణ నిరాకార రూపము. 3. సగుణ సాకార రూపము. భగవంతుని మరో విధముగా కూడా స్మరింతురు. "కవి అనియు, పురాణుడనియు, అనుశాసితుడనియు, సూక్ష్మము లన్నికంటే సూక్ష్మ రూపుడనియు, సర్వాధారుడనియు, అచింత్య రూపుడనియు, ఆదిత్యవర్ణుడనియు, తమస్సుకు అతీతుడనియు వర్ణింతురు.
1. కవి.
కవి అనగా కేవలము కావ్యములు పద్యములువ్రాయుటకాదు. కవి అనగా "సర్వజ్ఞత్వం". కాన, భగవంతుడే త్రికాల దర్శి. అతనే సర్వజ్ఞుడు. భగవంతుడు అక్షరకవి. అతని కవిత్వం అమృతకావ్యం.
2. పురాణుడు.
పురాణుడన ఎంత పాత వాడయిననూ అంతవరకూ క్రొత్తవాడగు చుండును. అట్టివాడు భగవంతుడు. అతనే సనాతనుడు. యెప్పటికప్పుడు సూతనుడు. అందుకనే పురాతనమితి పురాణం అని అన్నారు.
3. అనుశాసితుడు.
అను శాసితుడనగా సర్వసతంత్రస్వతంత్రుడు. అతడు అందరియందునూ శాసనము చేయువాడు. “మనస్సునైనా శాసించేవాడు భగవంతుడు. కనుకనే అతనిని అను శాసితుడు అన్నారు."
4. సూక్ష్మరూపుడు.
నిర్గుణుడని అర్థము. దీనిని ఇంద్రియములతో తెలిసికొన సాధ్యము కాదు. పంచభూతములు అను సూక్ష్మ వస్తువులకంటే, తాను ఆతీతుడయి వుండుటచే అతని యందు యే గుణములూ లేనందున భగవంతుడు సూక్ష్మాతి సూక్ష్మస్వరూపుడయి వున్నాడు.
5. సర్వాధారుడు.
లోకమున ఆధారము, ఆధేయము అని రెండు కలవు. మన కంటికి కనుపించు, చెవులకు వినుపించు చరాచర జగత్తుకు ఆధారమైనవాడు భగవంతుడు,
6. అచింత్యరూపుడు.
అనగా చింతింప వీలుకాని వాడు అని అర్థము. మనసుతో చింతింపవీలు కాదని అర్థము.
7. ఆదిత్యవర్ణుడు.
ఆదిత్యవర్ణం, అనగా సూర్యునివలె స్వయం ప్రకాశకుడు. భగవంతుడని అర్థం. అంతేకాదు, సూర్యుని ప్రకాశముకూడనూ పరమాత్ముడే. లోకమున ప్రకాశింప చేయువాడు భగవంతుడు. కనుక అతనికి ఆదిత్యుడని పేరు వచ్చినది. ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్’ ప్రతి మానవుని యందు అజ్ఞానమనే చీకటికి ఆవల తేజోవంతుడై ప్రకాశిస్తున్నాడు.
8. తమస్సుపరుడు.
తమస్సు అనగా అజ్ఞానము. పరుడనగా సాక్షి. అజ్ఞానమునకు సాక్షి అని అర్థము. మాయ అన్ననూ, అజ్ఞానమన్ననూ ఒకటే కనుక, అట్టి మాయకు అతీతమైనవాడు పరమాత్ముడు అని కూడనూ తలంచవచ్చును.
(శ్రీ.స.సూ, పు. 219/221 మరియు స.హ.ఆ.96 పు. 265)