సంస్కారమనగా ఏమిటి? నిత్యజీవితంలో మనల్ని వెంబడించే దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు దూరంగావించి సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతలు, సద్భావనలు మనయందు ఆవిర్భవింపజేసుకోవటమే సంస్కారము. అనగా చెడ్డను దూరం చేసి మంచిని స్వీకరించాలి. ఇంతేకాదు విశాలత్వమును పెంపొందించేది సంస్కారము.
(శ్రీ. జ.2002పు.28)
సంస్కారమనగా ఏమిటి సత్సంకల్పం. సద్భావం. సద్గుణం. అనగా మానవుని యొక్క నడతలు పవిత్రమైనవిగా ఉంటుండాలి. భావములు, ఆలోచనలు సమాజ క్షేమమును గూర్చినటువంటివిగా ఉండాలి.
(శ్రీజ.95 పు.5)
ప్రతిచూపులో ప్రేమ క్షీణించి పోతున్నది. ప్రతి ఆశలోపల దూరదృష్టి నశించిపోతున్నది. ప్రతి కోరిక స్వార్థరూపాన్ని ధరిస్తున్నాది. మానవుని యందు అభ్యుదయ భావాలు అడుగంటి పోతున్నాయి. చైతన్యము చల్లబడిపోతున్నది. కులమత బేధములంతా మారణహోమము సలుపు తున్నవి. రాగద్వేషములు స్వేచ్ఛా విహారములు సలుపుతున్నాయి. నిజము చెప్పాలంటే మానవత్వమే పూర్తి నశించిపోయింది. మనకు ఈనాడు. క్వాలిటీ కావాలిగాని క్వాంటిటీ గాదు. ఒక టీ స్పూన్ కౌమిల్క్ ఈజ్ యూజ్ పుల్: వై బారల్స్ ఆఫ్ డాo కీస్ మిల్క్ ? మనకు సంపాదన కాదు ప్రధానము. సంస్కారము చాలా ప్రధానము ఈనాడు సంస్కారమనేదే మానవులలో ఆడుగంటి పోయింది.
(ఉ.బ.పు.5)
ప్రపంచములో ఏవస్తువైనను సంస్కరింపబడినప్పుడే ఉపయోగకరమవుతుంది. స్వతః విలువ గలిగిన వస్తువు సంస్కరింపబడుటచేత అది మరింత విలువైనదిగా పరిణమిస్తుంది. అది మరొక రూపాన్ని కూడను ధరిస్తుంది. కనుకనే పవిత్ర భారతదేశమందు ప్రాచీన కాలమునుండి సంస్కరించాలి, సంస్కరింపబడాలి" అని చెబుతూ వచ్చారు. మలిన భావములను సంస్కారముచేత పవిత్రమైన భావములుగా, ఉత్తమమైన భావములుగా తీర్చిదిద్దుకోవాలి. నిత్యం మనము భుజించే ఆహారాన్ని, ధరించే వస్త్రాలను సంస్కారమువల్లనే మనము పునఃఉపయోగించుకుంటూ వస్తున్నాము. ప్రత్తిని మనము అట్లే ధరించలేము. దానిని దారముగా చేసి తదుపరి మగ్గములో నేసి వస్త్రముగా తయారుచేసి మనము కట్టుకుంటున్నాము.వడ్లను దంచి పొట్టును తీసిన తదుపరిదానిని అగ్నితో పక్వము గావించుకొని భుజిస్తున్నామేగాని ఎట్లా పుట్టిన వడ్లను అట్లే మనము భుజించడం లేదు. |కొండలో గుండుగా ఉన్న బండరాయిని సుత్తి వేట్లతో, ఉలిదెబ్బలతో సంస్కరింపచేసి, తదుపరి మందిరములో షోడశోపచారములతో దానికి పూజలు సల్పుతున్నాము. చెట్టులో నున్న కట్ట, గొడ్డలి దెబ్బలు తిని, రంపముతో కోయించుకొని, తదుపరి ఉలులచేత తాను సంస్కరింప బడుటచేత, చైర్ గా తయారైంది. కోతలు కోసి సంస్కరించడం చేత వజ్రము కూడా గొప్ప విలువైనదిగా రాణిస్తుంది. భూమిలో చిక్కిన ముతక బంగారము సంస్కరింపబడటం చేత పవిత్రమైన ఆపరంజిగా రూపొందుతుంది. అదేవిధంగా ఎట్లా పుట్టిన మానవుడు అట్లానే తన జీవితము గడుపుతూ ఉంటే ప్రయోజనం లేదు. ఇది కేవలం మట్టి ముద్దవలె, మాంసపు ముద్దవలె కనిపించవచ్చు. కాని దీనిని విద్య, సాధన, తపస్సు, ధ్యానములచేత సంస్కరించినప్పుడు దివ్యమైన మానవత్వంగా రూపొందుతుంది.
(షి.పు. 1/2)
(చూ॥ అవతారము, నిత్యకార్యక్రమములు, సంస్కృతి, స్వధర్మాచరణ)