కొందరు సుఖులై జన్మింతురు. పరిపూర్ణ ఆరోగ్యభాగ్యము లనుభవింతురు. మరొ కొందరు నిర్భాగ్యులైజన్మింతురు. కొందరికి కాలు చేతులుండవు. కొందరు మతిహీనులు అయి పుట్టుదురు. వారందరినీ సృజించిన వాడెవడు? అతను న్యాయశీలుడు, దయామయుడు అని అందురు కదా! అట్టి సమదృష్టి కల పరమాత్మకు ఇట్టి పక్షపాతబుద్ధియేలనని వాదించినా వాదించవచ్చును. ఈశ్వర పరిపాలనా రాజ్యములో ఇట్టి భేదములు యేల కలుగవలెనని ఊహించవచ్చును. అయితే మానవుని కష్టసుఖములకు, దైర్భాగ్య భాగ్యములకు కారణము పరమాత్మకాడు. ఈ జన్మమునకు పూర్వము చేసిన కర్మలు కారణము. ఇవి స్వయంకృతములు. పూర్వజన్మ కర్మలు, మానవులయొక్క శరీరముల పోకడలు వారికి వంశపారంపర్యంగా సంక్రమించిన లక్షణ విశేషములు. .
(జ. పు.89)
ఒకడు. సుఖియై జన్మించును. మరొకడు అసుఖియై జన్మించును. ఒకడు భాగ్యవంతుడైతే మరొకడు పరమ దరిద్రుడగును. ఒకజీవి మరొక జీవిని భక్షించును. బలవంతుడు బలహీనుని అణగదొక్కును. ఈ ఘోరము రేయింబవలు జరుగుచునే యున్నది. ఇదియే లోకమున గల స్థితి. ఇది నిర్మించినది. ఈశ్వరుడయ్యెనేని ఆ ఈశ్వరుడు క్రూరుడై యుండవలెను అని సామాన్యమానవులు భావింతురు. కాని ఈ పక్షపాతమునకు, స్పర్థలకు కారణభూతుడు ఈశ్వరుడు కానే కాదు. మరి దానిని కల్పించిన వాడెవడు? మనమే. మేఘము అన్ని పొలముల మీద సమముగా వర్షించును. కాని చక్కగా దుక్కిచేయబడిన పొలము మాత్రమే వర్షము వలన ఉపకారము నొందును. దున్నక బీడుగా పడవేసి ఉంచిన పొలమునకు ఆ ఉపకారము లభింపదు. ఇది మేఘముల తప్పా? లేక వర్షము తప్పా? లేక భూమిని దున్నక బీడుగా పెట్టుకున్న వాని తప్పా? ఈశ్వర కృప సర్వదా ఉండునదే. దాని యందు మార్పులే ఉండవు. భేద కల్పన చేయునది మనమే. కొందరు సుఖులుగా కొందరు అసుఖులుగా జన్మించుట. కేమి కారణము?వ్యత్యాసములు కల్పించు కార్యములు వారీ జన్మమున చేయకపోవచ్చును. కాని పూర్వ జన్మముల చేసిరి ఆ పురాకృత కర్మనే ఆ భిన్నతకు కారణము!
(జ.పు.112)