ప్రతి ఒక్కటియు ఈశ్వరార్పణ యొనర్చిన, బాధలకు గాని, దుఃఖములకు కానీ, సంతోషమునకు కానీ, స్థాన ముండదు. అట్లు ఏదీ తనకు సంబంధము లేనట్లుండిన శాంతికి భంగము లేదు. అంతానాది, నేను, నావారు, నీది, నీవారు అను వ్యత్యాస భావనలు మనమున కదిలినపుడే శాంతికి అన్ని విధములైన ఆటంకములు అడ్డు వచ్చును. అట్టి ఈశ్వరార్పణ చేయుట కూడా ఆత్మవిశ్వాసముతో చేరిన ప్రేమ కావలెను. అదియే భక్తి. దానిని నిత్యము క్రమముగా తప్పక ఆరాధించుచూ ఆనందించు చుండవలెను. దానితోపాటు సమర సమగు మనము కలిగి యుండవలెను. ఆధ్యాత్మిక జీవన మనునది వ్యర్థమైన సంభాషణకాదు. ఆత్మయందు నిజముగా జీవించుటే. అది నిర్మలమైన ఆనందము యొక్క ఉత్కృష్టనుభవమే. అదియే సంపూర్ణ జీవనము.
(స.సా.న. 1989 పు. 304)